16 వ సామాన్య ఆదివారము, YEAR C

16 వ సామాన్య ఆదివారము, YEAR C
ఆది. 18:1-10; కొలొస్సీ. 1:24-28; లూకా. 10:38-42


మన జీవితములో రెండూ విలువైనవే: ప్రార్ధన మరియు సేవ


ఈనాటి మొదటి 
పఠనము మరియు సువిశేష పఠనము, ఒక అతిధిని ఏవిధముగా ఇంటికి ఆహ్వానించి, గౌరవ మర్యాదలు చేస్తామో తెలియజేయుచున్నాయి. అబ్రహాము తన గూడారము చెంతకు వచ్చిన వారికి తన ఉదార స్వభావాన్ని చూపిస్తున్నాడు. యేసు ప్రభువు మార్త, మరియమ్మల ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఈ రెండు సంఘటనలుకూడా చాలా దగ్గరి సంబంధాన్ని కలిగియున్నాయి. ముగ్గురు వ్యక్తులు తన గూడారము చెంతకు సమీపిస్తుండగా, అబ్రహాము వారికి ఎదురెళ్ళి, వారిని ఆహ్వానిస్తున్నాడు. వారికి తన ఆతిధ్యాన్ని స్వీకరించవలసినదిగా ప్రార్ధిస్తూ ఉన్నాడు. అబ్రహాము తన ఆతిధ్యముద్వారా తన సేవాతత్వాన్ని చూపించాడు. యేసు మార్త, మరియమ్మల ఆహ్వానాన్ని స్వీకరించి, వారి ఇంటికి అతిధిగా వెళ్ళారు. మనం "అతిధి దేవోభవ" అని చెప్తూ ఉంటాము. మన ఇంటికి వచ్చే వ్యక్తిని దేవునిగా భావిస్తాము. వచ్చిన వారికి దగ్గర ఉండి అన్ని అతిధి మర్యాదలు చేస్తూ ఉంటాము. ఆ దేవుడే స్వయముగా మన అతిధి మర్యాదలు స్వీకరించడానికి వచ్చారు అని భావిస్తూ ఉంటాము. అతిధులను స్వీకరించి వారికి పరిచర్యలు చేసే ప్రతి వ్యక్తిలోకూడా మనం అబ్రహామునకు ఉన్న సేవాతత్వాన్ని చూస్తూ ఉన్నాము.

అయితే ఆనాడు, ఆ ముగ్గురు వ్యక్తులుకూడా గూడారము చెంతకు వచ్చిన విధముగా, ఈ రోజు దేవుడే మన మధ్యకు వస్తూ ఉన్నారు. గూడారము వంటి దివ్యమందసములో ఆయన కొలువైయున్నారు. దేవున్ని మన క్రైస్తవ సంఘములో చూడగలగాలి. దేవున్ని మనం గుర్తించగలగాలి. దేవుడు ఎల్లప్పుడూ మన మధ్యలోనే ఉన్నారు. ఆయన మన చుట్టూ ఉన్న పేదవారిలో, చిన్నవారిలో, రోగులలో, పరదేశీయులలో, మనం చిన్నచూపు చూసే వారిలో... ఉన్నారు. ఆయన ప్రతీరోజు మన హృదయద్వారాన్ని తట్టుచూనే ఉన్నారు. ఆయన మనతో ప్రతీరోజు చెప్పే మాట, "ఈ చిన్న వారిలో ఏ ఒక్కరికి మీరు గ్రుక్కెడు మంచి నీళ్ళు ఇచ్చినను, అది మీరు నాకు చేసినట్లే" అని చెప్పుచూ ఉన్నారు. కనుక, ప్రేమగల దేవుడు, మనల్ని తనకు సేవచేయమని, మన సహోదరి సహోదరుల సేవలో తరించమని మనలను పిలచుచున్నారు.

యేసుపట్ల మార్తమ్మ అతిధి మర్యాదలను మనం వినియున్నాము. ఆమె యేసుకి దగ్గరగా ఉండి అన్ని విషయాలను చూస్తూ, ఆయనకు ఏమి లోటులేకుండా సేవలు చేస్తూ ఉన్నది. యేసు వారి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే విధముగా ఆమె ఆయనకు పరిచర్యలు చేసింది. మార్తమ్మ సోదరి మరియమ్మ యేసు పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ ఉన్నది. మార్తమ్మ అనేక పనులతో సతమవుతున్నదని గ్రహించి, యేసు ఆమెను మందలిస్తూ ఉన్నారు. మరియమ్మ చేసేది గొప్ప పనిగా చెప్పుచున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మార్తమ్మ చేసే ఆతిధ్యాన్ని ప్రభువు తప్పు పట్టడం లేదు; కాని ఆమె ఎన్నో పనులగురించి ఆతురపడకూడదని చెప్పుచున్నారు. ఇంటికి వచ్చిన అతిధికి సేవచేసి, వారికి కావలసినవన్నీ సమకూర్చి, వారిని సంతృప్తిపరచడం, అలాగే అన్నింటికన్న ముఖ్యముగా సమయాన్ని గడపడం గూర్చి ముఖ్యమని తెలియజేయుచున్నారు. అనగా వారి కష్టసుఖాలను పంచుకోవడం. మనం వారితో సమయాన్ని వెచ్చించలేనప్పుడు, వారి బాగోగులు తెలుసుకోలేనప్పుడు, మనం వారికి చేసే సేవ, వృధాగా పోతుంది. మరియమ్మ చేసినది ఉత్తమ మైనదని యేసు అన్నారు. ఆమె దేవుని కుమారుని చెంత కూర్చుండి, ఆయన వాక్కును వింటూ ఉన్నది. వాక్కును ఆలకించిన మరియమ్మ, యేసును తన హృదయములోనికి, జీవితములోనికి స్వీకరించినది.

కనుక, క్రైస్తవ జీవితములో కావలసినది రెండు ప్రార్ధన (మరియమ్మ) మరియు సేవ (మార్తమ్మ).

నేడు మనం దేవుని స్వరాన్ని వినలేకపోవుచున్నాము, ఎందుకన, లోకములోని అనవసరమైన స్వరాలను ఆలకిస్తున్నాము కాబట్టి! "నీవు ఎన్నో పనుల గురించి విచారించుచు ఆతురపడుచున్నావు. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైనదానిని ఎన్నుకొనినది" అని ప్రభువు మనందరితో పలుకుచున్నారు. మన జీవితములో ఉత్తమమైనది: దేవుని వాక్కును వినుట - శిష్యునివలె యేసు పాదములచెంత కూర్చొని ఆయనను ఆలకించుట, ఆయన చిత్తమును ఎరుగుట, ఆయననుండి నేర్చుకొనుట, ఆయన సానిధ్యాన్ని అనుభూతి చెందుట. దేవుని స్వరాన్ని వినాలంటే ముందుగా దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన రక్షణ మార్గము గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న దేవుని వాక్యాన్ని ఆలకించాలి, ధ్యానించాలి. ప్రార్ధనద్వారా, దేవునితో సమయాన్ని కేటాయించాలి.

దేవుని వాక్కును వినుట గురించిన ప్రాముఖ్యత: మత్త 4:4 - "మనుష్యుడు కేవలము రొట్టెవలననే జీవింపడు. కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును:" రోమీ 10:17 - వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును." లూకా 8:21 - "దేవుని వాక్కును ఆలకించి, పాటించు వారే నా తల్లియు నా సోదరులు." దర్శన 3:20 - "వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడు నాతో భుజించును." యోహాను 15:5 - "నేను లేక మీరేమి చేయజాలరు."

ప్రభు వాక్కును విని, ఆయనను అంగీకరించగలగాలి. మనం విన్న వాక్కులే, మనలను సేవామార్గమునకు నడిపిస్తాయి. మనం నమ్మిన విషయాలను మన క్రియల రూపములో చూపించగలుగుతాము. యేసు తండ్రి దేవుని ప్రేమను అంగీకరించారు. తండ్రి మాట ప్రకారమే జీవించారు. ఆయన చిత్తప్రకారమే, తన జీవితములో ముందుకు సాగారు. పాపాన్ని, మరణాన్ని జయించారు. మనకు రక్షణను ప్రసాదించారు.

సేవాభావముతోకూడా మనం జీవించాలి. సేవకు ప్రార్ధన మూలం. ప్రార్ధనా జీవితం లేనిచో సేవా జీవితం జీవించలేము. యోహాను 15:5 - "నేను లేక మీరేమి చేయజాలరు."

మరియ, మార్తలు యేసును ఎలా తమ ఇంటికి ఆహ్వానించారో, ఆ ప్రభువును మనం  మన జీవితాలలోనికి ఆహ్వానిద్దాం. మార్తమ్మ ఆతిధ్యానికి పరిపూర్ణతను తీసుకొనివస్తే, మరియమ్మ శిష్యత్వానికి పరిపూర్తను తీసుకొని వచ్చింది. మన యింటికి వచ్చే అతిధులను మనం ఎలా సత్కరిస్తున్నాము? రాగానే పలకరించి వారితో విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నామా? లేదా మనం లోకములో మనం, మన పనులలో మనం (మొబైల్ ఫోనుతో...) మునిగి తెలిపోతున్నామా?

దివ్యపూజాబలిలో, మనం అర్పించే కానుకలను స్వీకరించి, తిరిగి తననుతానే మనకు బలిగా అర్పిస్తున్నారు. కనుక, ఆయనను స్వీకరించి, ఆయన వాక్కును ఆలకించి, సేవా భావముతో, మన తోటివారిని గౌరవిస్తూ, జీవించుదాం.