5 వ పాస్కా ఆదివారము (10 ఆగస్టు 2013)


ఐదవ పాస్కా కాల ఆదివారము

మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు.  అవి చేతలలో నిరూపింప బడు యదార్ధ ప్రేమ కావలయును (1 యోహా 3:18). ప్రేమ తన బహిరంగ జీవితములో అనేక సందర్భాలలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను, వ్యక్తులను గమనించి వాటిని ఉదాహరణగా తీసుకొని, గొప్ప పరలోక సత్యాలను, తన శిష్యులకు భోధించేవాడు.  ఉదాహరణకు, గొర్రెల కాపరులను, నీటిని, వెలుగును, రొట్టెను, మరియు పరిసయ్యులను ఉదాహరణగా చేసుకొని అనేక విషయాలను భోధించేవాడు.  ఈ కోవకు చెందిన ఒక ద్రాక్షావల్లి ని ఉదాహరణగా తీసుకొని, ఈనాటి సువిశేష పటనము ద్వారా మనలో మాట్లాడుచూ ఉన్నాడు.

యేసు ప్రభు జీవించిన సమయములో యూదయా దేశములో ద్రాక్షా తోటలు ఎక్కువగా సాగుచేసేవారు.  ద్రాక్షా యొక్క మరియు దాని ఎదుగుదల, ఫలాలు గురించి అందరికి కూడా ఒక అవగాహన అంటూ ఉండేది. అందువలననే యేసు ద్రాక్షా వల్లిని-తీగలను ఉదాహరణగా చేసుకొని దాని ద్వారా ఆయనను అనుసరించే శిష్యులకు, దేవునితో ఉండవలసిన బంధాన్ని గురించి భోదిస్తూ ఉన్నాడు.  కనుక ద్రాక్షా వల్లిని గురించి కొంత సేపు ద్యానిద్దాం.

మొదటగా, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింప జాలదు.  ద్రాక్షా వల్లి నుండి వేరు చేయబడిన రెమ్మలు జీవింపలేవు.  అందుకే, ద్రాక్షావల్లి రెమ్మలు ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని యుంటాయి.  అవి ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని ఉండుట వలన అధికముగా ఫలిస్తాయి.  ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి.  ద్రాక్షా రెమ్మల వలన ద్రాక్షావల్లి బలపడుట లేదు.  కారణం, మనం ఒక రెమ్మను కత్తిరిస్తే మరియొక రెమ్మ పుట్టుకొస్తుంది.  కాని ద్రాక్షా వల్లి వలన దాని రెమ్మలు లబ్ది పొందుతూ ఉన్నాయి.  ద్రాక్షావల్లి దానిలో ఉన్న జీవాన్ని, బలాన్ని, రెమ్మలకు ఇస్తుందే తప్ప, రెమ్మల నుండి అది జీవం పొందుట లేదు. ద్రాక్షా వల్లిని రెమ్మలు అంటి పెట్టుకొని యుండుట వలన, అవి ధృడముగా, ఎదగ గలుగు చున్నాయి.  మనందరి జీవిత సత్యం కూడా ఇదే!  మనం ప్రభువుని విశ్వసించి, ఆయనను అంటి పెట్టుకొని యుండుట వలన, మనము కూడా ఆయన జీవాన్ని, బలాన్ని పొందుతూ ఉన్నాము.  ఆయన విశ్వాసములో ధృడముగా ఎదగగలుగుతాము.   మన జీవితాలు సంతోషముతో, సమాదానముతో వర్హ్సిల్లుతాయి.  మనము ఆయనతో ఉండుట వలన, జీవితములో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని, సమస్యను, ఆయన నుండి వచ్చే బలము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయ శక్తి ద్వారా అదిగా మించ గలము.  కనుక, ద్రాక్షావల్లి యగు క్రీస్తుకు మన జీవితాన్ని అంటి పెట్టినప్పుడు మన జీవితాలు అధికముగా ఫలిస్తాయి.

"నా యందు ఫలింపని  ప్రతీ తీగను ఆయన తీసి వేయును.  ఫలించు ప్రతీ తీగను అధికముగా ఫలించుటకై, ఆయన దానిని కత్తిరించి సరిచేయును." ద్రాక్షావల్లి అధికముగా ఫలించాలి అంటే, మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  దానిని సరిగా అంటూ కట్టాలి.  కాలమును బట్టి ఎండిన ఆకులను, కొమ్మలను కత్తిరించి సరిచేయాలి.  దానికి కావలసిన ఎరువును, నీటిని సకాలములో అందించాలి. ఈ జాగ్రత్తలు పాటించినప్పుడే ద్రాక్షావల్లి మంచి రుచికరమైన ఫలాలను మనకు అందించగలదు.  ద్రాక్షావల్లి క్రీస్తు మనమంతా కూడా ఆయన రెమ్మలం. ఎండిన ఆకులు, కొమ్మలు మనలో ఉన్న చెడుకు, పాపానికి చిహ్నంగా నిలుస్తాయి.  వాటిని ఎ విధముగా కత్తిరించి, ప్రోగుచేసి నిప్పులో వేసి తగుల బెట్టుతామో, అదే విధముగా, మనలో ఉన్న చెడును, చెడు క్రియలకు, ఆలోచనలకు స్వస్తి చెప్పి మనల్ని మనం సక్రమమైన మార్గములో నడచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం అధికముగా ఫలించగలుగు తాము.

"నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు"

ద్రాక్షావల్లి ఎదుగుదలకు, మరియు అది ఫలించడానికి దాని తీగలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి.  ద్రాక్షా రెమ్మలు, ద్రాక్షావల్లి నుండి వచ్చే బలాన్ని, జీవాన్ని స్వీకరించి, అవి బలపడుతూ, ఎదుగుతూ, ద్రాక్షావల్లిని జీవింప చేస్తాయి.  అదేవిధముగా ఈ ప్రపంచములో దేవునికి మానవుడు కూడా ఎంతో అవసరము.  మన సత్యోపదేశములో చదువుకున్నట్లు, మానవుడు  దేవుని ప్రేమించి, సేవించి అటు వెనుక మరణము పొందుటకు సృష్టింప బడెను.  మనం ఒక వ్యక్తిని ప్రేమించినపుడు లేదా ఒక వ్యక్తి చేత ప్రేమింప బడినప్పుడు, ఆ వ్యక్తి గురించి పదిమందికి చెబుతూ ఉంటాం.

అదేవిధముగా, మానవుడు దేవుని ఈ ప్రపంచానికి చాటగలగాలి.  దేవుని నామాన్ని ఆయన ప్రేమను ప్రకటించటం అంటే ఆయనను ఈ లోకములో జీవింప చేయటం.  ఆయన మరణమును ప్రకటించడం అంటే, ఆయనను ఈ లోకములో జీవింప చేయడం.  ఆయన మహిమను కొనియుండటం.  ఆయనను స్తుతించి గౌరవించడం.  కనుక, క్రీస్తు బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం.

"మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరప బడును."  ప్రియులారా! మానవ జీవితాన్ని ఒక ఉన్నతమైన ద్రుక్పదముతో చూసినప్పుడు, మనం అనుకున్న ఫలాలకంటే, అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  మన అనుదిన జీవితములో ప్రతీసారి మనం మంచి చేసినప్పుడు, మంచిని గురించి ఆలోచించినప్పుడు అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  ప్రేమ, శాంతి, సమాధానాన్ని ఇతరులకు పంచినప్పుడు మనం అధికముగా ఫలించినట్లే...  ఇతరులను మన్నించడం ద్వారా, మనకున్న దాన్ని ఇతరులతో పంచుకొనుట ద్వారా, మనం అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  మన శత్రువులను ప్రేమించి, వారి కోసం ప్రార్ధించినప్పుడు మనం ఫలిస్తూ ఉన్నాం.  ఈ విధముగా, ప్రతీసారి, ప్రతీ రోజు, మన మాటల ద్వారా, క్రియలద్వారా ఫలిస్తూ తండ్రి దేవుని మహిమ పరస్తూ ఉన్నాము.  కనుక, మన ఫలములో దేవుని మహిమను  పరచ గలగాలి.

"మీరు నా యందు ఉండుడు"

ఈనాటి సువిశేష పతనములో ఈ వాక్యము 8 సార్లు చెప్పబడింది.  అంటే, ఈ వాక్యము ఎంత ముఖ్యమైనచో మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలలో, కొంత మంది వ్యక్తులు ఒకే కుటుంబములో జీవిస్తూ ఉంటారు.  వారు కలసి ఉన్నప్పటిని పరదేశిగా బ్రతుకుతూ ఉంటారు.  ఒకరంటే ఒకరికి పడదు. పట్టించుకోరు. ఒకలాంటి విదేశీ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.  వారి మధ్య ప్రేమలు,  ఆప్యాయతలు ఉండవు.  నామమాత్రముగా కలసి జీవిస్తూ ఉంటారు.  అదే విధముగా, "ప్రభువు యందు ఉండటం" అంటే నామ మాత్రానికే క్రైస్తవులుగా ఉండి ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటే సరిపోదు.  "మీరు నాయందు ఉండుడు" అను వాక్యము ద్వారా, ప్రభువు మనలను తనతో కలసి జీవించటానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.  ఆయనతో జీవించడం, ఆయనతో పంచుకోవడం, ఆయనతో ఉండటం ఒకరి నుండి మరియొకరు పొందటం, ఒకరిని ఒకరు గౌరవించడం, ప్రభువు యందు ఉండటం అంటే, మన నమ్మకాన్ని ఉత్తాన క్రీస్తుయందు ఉంచటం. ఆయన యందు ఉండటం అంటే, ఆయనలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను పొందటం.  ఒక నిండిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని  ఆయనలో కలిగి ఉండటం.  కారణం ఆయన కూడా "నేను మీ యందు ఉందును" అని మనకు మాట ఇచ్చి యున్నాడు. కనుక మనం మన జీవితంలో ఎన్ని కష్టాలు, భాదలు, నష్టాలు, రోగాలు ఎదురైనప్పటికిని ప్రభువుతో ఉన్నట్లయితే ఆయనే మనకు బలాన్ని ఇచ్చి, జీవితములో ముందుకు నడిపిస్తాడు.  కనుక ప్రభువు యందు ఉండటానికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని అర్ధిద్దాం.

చివరిగా, ఇది మే మాసం.  ఈ నెల మరియ తల్లికి అంకితం చేయబడిన నెల.  ఆమె దేవుని యొక్క తల్లి.  ఆమె దేవుని తల్లి కనుక మనందరికీ కూడా తల్లిగా నిలుస్తుంది.  ఈ కారణం చేత మనం  కూడా ఆమెను విన్నవించుకోవాలి. రక్షణ చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది.  ఆమె ఈ ప్రపంచానికి యేసు ప్రభువును అందించింది.  ఆమె "తన గర్భ ఫలమును" మనకు కానుకగా ఒసగింది.  ఆమె ఇంకా ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. ఆమె తన విశ్వాస జీవితము ద్వారా ప్రభువు యందు ఉంటూ, ఆ ప్రభువులో జీవిస్తూ అధికముగా ఫలించింది.  కనుక, ఆమె నిత్య సహాయము ద్వారా మనము కూడా అధికముగా ఫలించుటకు ఆమె సహాయాన్ని వేడుకొందాం.  ఆమె చూపిన విశ్వాస మార్గములో జీవించడానికి ప్రయాసపడదాం.  ఆమెన్.

పాస్కా కాలపు నాలుగవ ఆదివారము, 21 April 2013

పాస్కా కాలపు నాలుగవ ఆదివారము, 21 April 2013

అ.కా. 13:14,43-52; దర్శన గ్రంధము 7:9, 14-17; యోహాను 10:27-30

మార్పుకు మార్గం - వినుట

'వినగలిగే వాడే మాట్లాడ గలడు'. వినడానికి విడ్డూరముగా ఉన్నా ఇది నిజం. మాటలురాని పిల్లలపై పరిశోధనలు జరిపిన వైద్యుల అంచనాల ప్రకారం, వినికిడి లేని పిల్లలే ఎక్కువగా మూగత్వమునుకూడా పొందుతూ ఉంటారు. భౌతిక విషయాలలో ఇదెంత నిజమో, ఆధ్యాత్మిక విషయాలలో అంతకంటే నిజం.

ఈనాటి మూడు పఠనముల యందు కూడా, 'వినుట' యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలుపబడినది.

మొదటి పఠనం: 44 వ వచనం - ప్రతి వ్యక్తి ప్రభువు వాక్కు వినుటకు వచ్చెను. 48 వ వచనం - అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి.
సువార్త పఠనం: 27 వ వచనం - నా గొర్రెలు నా స్వరమును వినును.
రెండవ పఠనం: 14 వ వచనం - గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొని... 17 వ వచనం - ఆ సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును.

మాట రావాలన్న, మాటలాడాలన్నా - వినగాలగాలి.
వినటం ద్వారా ఏం జరుగుతోంది?
వినటం ద్వారా తెలుసుకొంటాం.
తెలుసు కొనటం ద్వారా అర్ధం చేసుకొంటాం.
అర్ధం చేసుకొనటం ద్వారా ఎదుగుతాం, అభివృద్ది చెందుతాం!
ఆ ఎదుగుదల ఆత్మ యందు, సత్యమందు, ఆయనయందై ఉండాలి!

అందుకే పౌలుగారు, రోమీయులకు వ్రాసిన లేఖలో, "వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును (10:17).

తండ్రి దేవుడు కూడా పదే పదే ఈ మాటను పలికి యున్నారు. ఉదాహరణకు, ద్వితియో.కాం. 6:4-9 నందు ఆ మాట వాక్కానిస్తున్నారు. ఈ భాగమునందు "వినుము, ప్రేమింపుము, భోధింపుము,
ముచ్చటింపుము, వ్రాసికొనుము మరియు జ్ఞప్తియుంచుకొనుము." క్లుప్తముగా వివరించాలంటే, ఆయన మాటను వినాలి, విన్న దానిని పాటించాలి, పాటించే దానిని భోధించాలి, భోధించే దానిని, ముచ్చ టించాలి, ముచ్చటించిన దానిని వ్రాసి, జ్ఞప్తియుంచుకోవాలి.

మనం ఏమి వినాలి?
వినికిడి శక్తియున్న ప్రతి ఒక్కరు వినగలరు. వినిపించే ప్రతి శభ్దమును వినగలరు. కాని, మనం ఏమి వినాలి? ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి? ఈ ప్రశ్నలకు సమాధానం యాకోబు గారు వ్రాసిన లేఖలోని మొదటి అధ్యాయములో మనకు లభిస్తుంది.
21 వ వచనం: "ఆయన మీ హృదయములపైన ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది."

25 వ వచనం: స్వాతంత్రమునొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుటకాక, దానిని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందును." దేవుని పరిశుద్ధమైన వాక్కు మనందరి హృదయములపై ముద్రించబడినది. దాని ప్రకారము నడచుకొనువాడు, నీతిమంతుడగును (రోమా 2:14,15). మనలను నీతి మంతులుగా చేసే శాసనం (మాట, వాక్యం) ఎంతో దూరంలో లేదు. అది "మీ (మన) చెంతనే ఉన్నది, మీ (మన) నోటనే మీ (మన) హృదయముననే ఉన్నది" (ద్వితియో 30:14). దానిని మనం శ్రద్ధతో ఆలకించాలి (మార్కు 4:24). మనం వినుచున్న దానిని "ఎట్లు వినుచున్నామో గమనించాలి" (లూకా 8:18).

ఆ పరిశుద్ధ వాక్యమును వినేముందు, రైతు భూమిని విత్తనములు వెదజల్లుటకు సిద్ధము చేసిన విధముగా,మన హృదయమును శుద్ది చేసుకోవాలి. "పాపములు ఒప్పుకొనుచు క్షమాపణను అర్ధిస్తూ... (1 యోహా 1:9), హృదయ కాఠిన్యాతను తొలగిస్తూ... (యిర్మియా 4:3) మరియు సాత్వికతను కలిగియుంటూ (యాకోబు 1:21) ఆ వాక్యం వినాలి. ఈ విధముగా ఆ పరిశుద్ధ వాక్యాన్ని వింటే, స్వీకరిస్తే మనయందు ఆత్మబలం నూత్నీకరించ బడుతుంది మరియు విశ్వాసపు పునాదులు గట్టిపడతాయి.

అందుకే, మన మాటలను తగ్గించి, మాట్లాడే ప్రభుని మాటలను, జీవమునిచ్చు మాటలను, నడిపించే మాటలను, స్వస్థ పరచే మాటలను, బలపరచే మాటలను ఆలకిద్దాం! ఆచరిద్దాం!

మూడవ పాస్కా ఆదివారము, 14 ఏప్రిల్ 2013

మూడవ పాస్కా ఆదివారము, 14 ఏప్రిల్ 2013 
పఠనములు: అ.కా. 5:27-32, 40-41; దర్శన గ్రంధము 5:11-14; యోహాను 21:1-19 

విశ్వాసం దేవుని వరం. మన విశ్వాసానికి సాక్షమివ్వడానికి కూడా మనకు దైవ సహాయం అవసరం. పెంతకోస్తు పండుగకు ముందు పేతురుకి, పెంతకోస్తు పండుగ తరువాత పేతురుకి మధ్య ఉన్న తేడా మనకు సుపరిచితమే! పెంతకోస్తు ముందు అంటే ప్రభువు మరణానికి ముందు యేసు తనకు తెలియదని పేతురు మూడుసార్లు బొంకాడు. పెంతకోస్తు తరువాత, పవిత్రాత్మతో నింపబడి పేతురు, ఇతర అపోస్తలులు బాహాటముగా, నిర్భయముగా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. భయస్థానములో ధైర్యం ప్రవేశించినది. పిరికితనం స్థానములో ధృడత్వం చోటు చేసుకున్నది. బ్రతుకు జీవుడా అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయినవారు, మేము నమ్మిన ప్రభువు కొరకు మా ప్రాణాలను సహితం ఇవ్వడానికి సిద్ధం అని బాహాటముగా చెబుతున్నారు. తమ విశ్వాసానికి సాక్ష్యం ఇస్తున్న సంఘటనను మనం ఈ రోజు మొదటి పఠనములో చదువుతున్నాం. "యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభనుండి వెడలి పోయిరి" (అ.కా 5:41). 

మన అనుదిన జీవితములో కూడా యేసుకు సాక్ష్యం ఇచ్చుటకు అనేక అవకాశములు ఉన్నవి. వాటిని సద్వినియోగ పరచుకొని యేసుకు దైర్యముతో సాక్ష్యం ఇద్దాం. మన విశ్వాస అనుభవాలను ఇతరులతో పంచుకొనడం ద్వారా, ఇతరుల విశ్వాసాన్ని వికసింప జేసినవారము అవుతాము. వారి కష్ట సమయములో మన నోటిమాట ఒక మంత్రములా పనిజేసి, పరిష్కార మార్గాన్ని చూపవచ్చు. చిన్న చేతిస్పర్శ, ఇతరులకు ఊరటను ఇవ్వవచ్చు. కాబట్టి, దైవ ప్రేమ పంచుటకు, పెంచుటకు ఉదార స్వభావముతో మనం ముందుకు వెళదాం! 

ఈనాడు రెండవ పఠనములో పునీత యోహానుగారు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. సకల జీవకోటి ప్రభువును స్తుతించునట్లుగా అతను ఒక దివ్య అనుభూతిని పొందాడు. ప్రభువునకు స్తుతి, ఆరాధనలు, ఘనత, మహిమలు అర్పించడం ఇక్కడే మొదలు పెట్టాలి. అది ఒక అలవాటుగా మారాలి. మన స్వభావములో భాగమై పోవాలి. అపుడు, మనము, మన సంఘము, పునీతులతో, దేవదూతలతో ఏకమై ప్రభువును నిరంతరం స్తుతించగలుగుతాము. 

ఈనాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారి కొరకు, వారు ఉద్దేశాల కొరకు ప్రార్ధన చేద్దాం. వారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి విశ్వ శ్రీసభను విశ్వాస పధంలో ముందుకు నడిపేలాగున ప్రార్ధించుదాం.

రెండవ పాస్కా ఆదివారము YEAR C (దివ్య కారుణ్య మహోత్సవము )

రెండవ పాస్కా ఆదివారము  YEAR C (దివ్య కారుణ్య మహోత్సవము )
అ.కా.5:12-16; ద.గ్రం. 1:9-13, 17-19; యోహాను 20:19-31 

క్రీస్తు ఉత్థానం - నూతన సృష్టి 

క్రీస్తు ఉత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. "క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే. మీ విశ్వాసమును వ్యర్ధమే (1 కొరింతు 15:14). శిష్యులకు క్రీస్తు ఉత్థానం ఓ దివ్యానుభూతి. క్రీస్తు ఉత్థానములోని పరమ రహస్యాన్ని వారు పూర్తిగా అర్ధము చేసుకొనలేక పోయారు. కాని, క్రీస్తు ఉత్థానం వారి విశ్వాసాన్ని బలపరచినది అనడములో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు అనుభవించారు. క్రీస్తు ఉత్థానం వారిని మనుషులుగా, దృఢవిశ్వాసులుగా మార్చినది. విశ్వాసులుగా హింసలను, అవమానములను ధైర్యముగా ఎదుర్కొనుటకు వారిని బలపరచినది. ఉత్థానమైన తరువాత, క్రీస్తు వారితో ఉన్నాడు, వారితో మాట్లాడాడు, వారితో భుజించాడు మరియు వారికి బోధించాడు. ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపడానికి పిలువబడినారు. అనాది క్రైస్తవుల దృఢవిశ్వాసం ఎంత గొప్పదో మనదరికి తెలిసిన విషయమే! జ్ఞానస్నానము పొందిన క్రైస్తవులు, ఎప్పుడైతే యేసు మెస్సయ్యా అని విశ్వసించారొ, మరణమునుండి ఉత్థానమైనాడని విశ్వసించారొ, వారు నూతన జీవితాన్ని, జీవనాన్ని పొందారు. నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు. క్రీస్తు కొరకు హింసలను భరించుటకును, మరణించుటకును సిద్ధ పడ్డారు. 

మొదటి పఠనములో అపోస్తలులు ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా, క్రీస్తు దైవకార్యాన్నిఈ లోకములో కొనసాగించడం చూస్తూ ఉన్నాము. ఉత్థాన క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములను, సూచక క్రియలను చేసియున్నారు. దీని మూలముగా, "అనేకులు మరియెక్కువగ, విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి." ప్రజలు అపోస్తులలో ఉన్న దేవుని శక్తిని విశ్వసించారు. "పేతురు నడచి పోవునప్పుడు కనీసము అతని నీడనైన కొందరిపై పడగలదు అను ఆశచేత వారు రోగులను చాపలమీద, పరుపుల మీద పెట్టుకొని, మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. యెరుషలేము చుట్టు పట్టులనున్న పట్టణములనుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరు స్వస్థత పొందిరి. క్రీస్తు ఉత్థానముద్వారా, దేవుడు మనకు నూతన జీవితమును, సంతోషమును ఒసగుచున్నాడు. అయితే, మన భూలోక జీవితమున మన క్రైస్తవ జీవితమునకు విశ్వాసులుగా ఉండవలయును. క్రీస్తు మరణమును జయించి మనదరికి శాశ్వత జీవమును ఏర్పాటు చేసియున్నాడు. 

సువిశేష పఠనములో ఉత్థాన క్రీస్తు శుష్యులకు దర్శన మివ్వటం చూస్తూ ఉన్నాము. యూదుల భయముచే శిష్యులు ఇంటిలో తలుపులు మూసుకొని యుండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగునుగాక!" అనెను. శాంతి వచనాలతో (షాలొమ్) వారిలోనున్న భయాన్ని తొలగించాడు. ఆయన ఉత్థాన క్రీస్తు అని తెలియజేయుటకు వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, వారు ప్రభువును చూచి ఆనందించిరి. ఆ తరువాత ఆయన వారి మీద శ్వాసను ఊది "పవిత్రాత్మను పొందుడు." అని చెప్పెను. తాను ఆరంభించిన పనిని తన శిష్యులు కొనసాగించాలని ఆదేశించాడు. పవిత్రాత్మను పొందడం అనగా నూతన సృష్టిని పొందడం. తండ్రి తనను పంపినట్లుగా, ప్రభువు తన శిష్యులను దైవకార్యమునకై పంపుచున్నారు. యేసు శిష్యరికములో ఈ దైవ కార్యం చాల ప్రాముఖ్యమైనది. వారుకూడా ప్రభువువలె జీవించుటకు మరియు ఇతరులను ప్రభువు మార్గములో నడిపించుటకు పిలువబడియున్నారు. పవిత్రాత్మ శక్తి వలన, పాపములను క్షమించు అధికారమును శిష్యులు పొందియున్నారు. "మీరు ఎవరి పాపములనైనను, క్షమించిన యెడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు." దీని ద్వారా, ఈ లోకములో ఒకే మనస్సు, ఒకే హృదయంగల ఒకే కుటుంబమును ఏర్పాటు చేయవలసియున్నది. మానవాళిని దేవునితో సఖ్యపరచవలసిన అవసరము ఉన్నది. 

తోమాసు - యేసు దర్శనము 
సువిశేష రెండవ భాగం అపోస్తలుడు తోమాసు - ప్రభువు దర్శనాన్ని గూర్చి చూస్తూ ఉన్నాము. పాస్కా ఆదివారమున యేసు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు, తోమాసు వారితో లేకుండెను. యేసు దర్శనాన్ని గూర్చి తోమాసుకు తెలియ జేసినప్పుడు, అతను విశ్వసించడానికి నిరాకరించాడు. "నేను ఆయన చేతులలో చీలల గురుతు చూచి, అందు వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను." అని అన్నాడు. యేసు ఉత్థానాన్ని విశ్వసించుటకు వ్యక్తిగతముగా ప్రభువు సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆశించాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తోమాసు అవిశ్వాసి అని చెప్పడం సబబు కాదు. వ్యక్తిగా తోమాసుగారు చాలా ధైర్యవంతుడు, విశ్వాసపరుడు. లాజరు మరణించినప్పుడు, తోమాసుగారు "మనము కూడ వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదము" (యో 11:16) అని తోడి శిష్యులతో అన్నాడు.అయితే, ఇక్కడ తోమాసు గారు, తన అవిశ్వాసాన్ని ప్రకటించడానికి కారణం, ఉత్థాన ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మూసుకొని ఉన్నారు? ఉత్థాన క్రీస్తుకు ధైర్యముగా సాక్ష్యమీయవలసి ఉన్నది కదా! అని తలంచు యుండవచ్చు! వాస్తవానికి, తోమాసుగారు దృఢ విశ్వాసి. ఆయన విశ్వాసము కొరకు ఎంతో దూరమునుండి భారత దేశమునకు వచ్చి తన విశ్వాసము కొరకు మరణించాడు. 

ఎనిమిది దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగును గాక" అనెను. అపుడు తోమా "నా ప్రభూ! నా దేవా! అని పలికి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అయితే, చివరిగా ప్రభువు, "నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా! చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు" అని ప్రభువు పలికి యున్నారు. 

దివ్య కారుణ్య మహోత్సవము 

క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత ఆదివారమును దైవ కారుణ్య పండుగగా జరుపుకోవాలని పరిశుద్ధ రెండవ జాన్ పౌల్ పాపుగారు పిలుపునిచ్చారు. అప్పటినుండి రోమను కతోలిక సంఘమునందు ఈ పండుగను జరుపు కొంటున్నారు. 

అసలు 'దివ్య కారుణ్యం' అంటే ఏమిటి? ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దివ్య కారుణ్యం అంటే, 'దేవుని కరుణ' అని అర్ధం. 'కరుణ' అనే తెలుగు మాటకు ఆంగ్లములో 'Mercy' అందురు. 'Mercy' అనే ఆంగ్ల మాట mercedem లేదా merces అనే లాటిన్ మాట నుండి ఉద్భవించింది. ‘mercedem’ లేదా ‘merces’ అనే మాటకు ప్రతిఫలము, జీతము, కిరాయి అనే అర్ధాలు గలవు. బైబిలు పరి భాషలో ఈ మాటకు (Mercy) ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించ బడినది అని అర్ధము. 

దివ్య కారుణ్య అపోస్తరాలుగా పిలువబడే పునీత ఫౌస్తీనమ్మ గారి మాటలలో చెప్పాలంటే, ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మూడు: 
దేవుని కరుణను కోరుకోవడం 
యేసుని అనంత కరుణను నమ్మడం 
మనం పొందిన/పొందుతున్న ఆ దేవుని కరుణను పంచడం 

నీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా తటస్థ పడితే ఏమి చేస్తావు? లేదా ఏమి అడుగుతావు? 
నీకు మంచి చేసిన వాడితే, మేలు చేసిన వాడితే, నీ అభివృద్ది కోరేవాడితే, వారు మనల్ని చూడకపోయినా, మనమే ఎదురెళ్లి, వారికి అగుపడి గతమున చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసి, కుశల ప్రశ్నలు అడుగుతాం! 

అదే మనకు చెడు చేసిన వారైతే, మనల్ని మోసగించిన వారైతే, మన నమ్మకాన్ని వమ్ము చేసినవారైతే, వంచనతో మన స్నేహాన్ని కోరిన వారైతే, స్వార్ధం కొరకు ప్రేమగా నటించిన వారైతే, వారిని చూసినా కాని, చూడనట్లు నటించి వారి చూపులనుండి, వారి చుట్టు ప్రక్కల నుండి తప్పించుకొనడానికి ప్రయత్నిస్తాం! కొద్దిగా దైర్యవంతులైతే, తప్పు చేయని వాడిని నా కెందుకు భయం అని చూసి చూడనట్లుగా వెళతాం! ఇంకా అతను/ఆమె కాని మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, జరిగింది, చేసింది, చెప్పింది చాలు! ఇక వెళ్ళు అంటాం! ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తే మోసగించిన, వంచన చేసిన, అవమానము, ఆ సందర్భము, ఆ సందర్భములో జరిగిన మాటలు, సంభాషణ అవి హృదయపు లోతులలో చేసిన గాయాలను గుర్తుకు తెచ్చుకొని కోపపడతాము లేదా బాధపడతాము! 

ఇదంతా ఎందుకు వివరిస్తున్నానంటే, యేసు ప్రభువు అటువంటి పరిస్థితులలోనే ఉన్నా, దానికి భిన్నముగా ప్రవర్తించారు. ఆయనే వారికి అగుపడుచున్నారు. ఆయనే వారితో మాట్లాడుచున్నారు. యూదుల భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఏమి చేయాలో అని పాలుపోని స్థితిలో, ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పుచున్నారు. బాధను, భయమును పోగొడుచున్నారు. ఇంత జరిగినా, ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు ఉన్నాడు. 

అదే మనమైతే, 
నాయవంచాకులారా! విశ్వాస ఘాతకులారా! గురుద్రోహులారా! పిరికి పందల్లారా! అని అనే వాళ్ళం! 
కాని ఆయన మాత్రం, షాలోం (శాంతి) సమాధానం కలుగుగాక! సమృద్ధి కలుగును గాక! ఆనందం సంతోషం వర్ధిల్లుగాక! అని వారిని సంభోదిస్తూ ఉన్నారు. ఎందుకంటే, (ఆయన) మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు (కీర్తన 103:10). 

ఆయన కరుణ గలవాడు, దయగలవాడు. అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. సులభముగా కోపపడువాడు కాదు. ప్రేమామయుడు, విశ్వాసమందు అనంతుడు (నిర్గమ కాండము 34:6). 
అందుకే నమ్మని తన శిష్యులకు, తనకు కలిగిన గాయాలను చూపిస్తున్నాడు. ఈ సందర్భములో మనమైతే, ఇదిగో మీ/నీ నయవంచనకు మోసమునకు, విశ్వాస ఘాతమునకు, గురు ద్రోహమునకు గుర్తు! అని అంటాం! 

కాని ప్రభువు అంటున్నాడు: ఇదిగో మీ రక్షణ చిహ్నాలు, మీ పాపమునకు పరిహారముగా సిలువ మీద నన్ను సమర్పించుకొన్నాను అనడానికి చిహ్నాలు - మీ పాపములకు జీతము/ప్రతిఫలము/కిరాయి చెల్లించ బడినది అనుటకు గుర్తు. 

మీ కొరకై, మీ విముక్తి కొరకై, అమ్మబడ్డాను, చంపబడ్డాను/ పరిహార బలిగా అర్పింపబడ్డాను అని అనడానికి గుర్తు. మీపై గల ప్రేమకు, రక్షణకు, కరుణకు గుర్తులు నా తీపి జ్ఞాపకాలు. మీరు చెల్లించవలసిన మూల్యం (అప్పు) చెల్లించబడినది అని నిరూపించే రసీదు. 

మీరు పొందిన ఈ పరిహారమును, మన్నింపును, విముక్తిని, మీ తోనే, మీ కొరకే, పరిమితం చేసికొనకుండా, ఇతరులకు పంచండి. మన్నింపులోని మహత్యమును కరుణలోని కమనీయతను వెదజల్లండి అని భోదిస్తున్నాడు యేసు. 
ఇంకా ఈ కరుణకు దూరముగా ఉంటె, కరుణకు దగ్గరవ్వాలని కోరుకొందాం! మనకు దగ్గరయి, మనలను దేవుని దరికి చేర్చిన క్రీస్తు కరుణను నమ్ముదాం! నమ్మిన ఆ కరుణను పొంది, పంచుదాం ... మన తోటి వారందరికీ...