ఉత్థాన పండుగ, 31 March 2013


ఉత్థాన పండుగ, 31 March 2013

ఉత్థాన పండుగ, క్రీస్తు ద్వారా మనం పొందిన నూతన జీవితాన్ని కొనియాడటం. ఈ నూతన జీవితాన్ని ఇతరులతో పంచుకొన్నప్పుడే సాకారమవుతుంది. ఈ నూతన జీవితం ఓ ఛాలెంజ్! రక్షకుడైన యేసు మనం సంపూర్ణముగా ఈ నూతన జీవితాన్ని పొందాలని, తన జీవితాన్ని బలిగా అర్పించాడు. తన మరణముతో అంతా శూన్యం అనుకొంటుండగా, తన ఉత్థానముతో, మన జీవితాలకు, గొప్ప ఆశను, ఊపిరిని నింపాడు. ఈ సంపూర్ణమైన జీవితాన్నుండి మన "పని" ఆరంభం కావాలి. ఉత్థాన క్రీస్తు సంతోషాన్ని, ఆనందాన్ని, వెలుగును, శాంతిని, సందేశాన్ని, చీకటిలో, కష్టాలలో, బాధలలో, భయములో, అవినీతిలోనున్న ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. ముందుగా మనం, మన క్రైస్తవ పిలుపును జీవించాలి. ఈనాటి సమాజానికి ఆశను, నమ్మకాన్ని, ప్రేమను నింపాలి. మంచి భవిష్యత్తు కొరకు ఆశను నింపాలి. గుండెకి చిల్లు పడినట్లుగా, ఈ భూలోకానికి, అనేకమైన చిల్లులు పడి కష్టాలలో, నిరాశ నిస్పృహలో, అనారోగ్యముతో ఉన్నది. ఉత్థాన క్రీస్తు శక్తి, మహిమతో మన జీవనాన్ని మనం బాగు చేసుకొందాం. ఈనాడు ఎవరైనా సరే, వారి బాధ్యతలను గుర్తెరిగి, సక్రమముగా నిర్వహిస్తే, ఈ భూలోకం తప్పక మెరుగవుతుంది. ప్రతీ ఒక్కరిలో చిత్తశుద్ధి ఉండాలి.

ఉత్థాన క్రీస్తు మనందరి జీవితాలలో ఉండి మనలను ముందుకు నడిపించాలని ఆశిద్దాం. ఆయన ఒక నూతన సమాజాన్ని చూడాలనుకొన్నాడు. దైవ సమాజాన్ని స్తాపించాలనుకొన్నాడు. క్రీస్తు విశ్వాసులుగా, ఆయన కోరుకొన్న శాంతి, సమాధానం, ప్రేమలతో నిండిన సమాజాన్ని ఆయనకు కానుకగా ఇద్దాం. ఆయన ఆశీర్వాదాలు మనతో ఎల్లప్పుడూ ఉంటాయి!

పేదరికం మరియు ఇతర కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి భయపడి ఆగిపోతే, మన జీవిత కాలములో ఏమీ సాధించలేము. క్రీస్తు ఉత్థానములోనున్న గొప్ప ఆశతో ముందుకు సాగిపోవాలి. అంతిమముగా నీతి న్యాయమె గెలుస్తుంది. అంతిమముగా ప్రేమే శాశ్వతముగా నిలుస్తుంది.

క్రీస్తు ఉత్థాన మహోత్సవాన్ని మనం అర్ధవంతముగా కొనియాడాలంటే, క్రీస్తు చూపిన బాటలో నడవాలి, ఆయన బోధించిన జీవిత పాఠాలను పాఠిoచాలి. ఆయన ఇచ్చిన పిలుపుకు మనం సమాధానం ఇవ్వాలి. క్రీస్తు ఉత్థానము ద్వారా పొందిన మన నూతన జీవితాల ద్వారా ఆయనకు తిరిగి మంచి ఫలఫలితాలను ఇవ్వాలి. మన గుండెల్లో గుప్పెడంత ప్రేమను నింపు కొందాం. దానిలో కొంచెమైన ఇతరులతో పంచుకొందాం. అప్పుడు తప్పక మనం ఆశించే మార్పు వస్తుంది.

ఉత్థాన క్రీస్తు, మనలనందరిని ఆశీర్వదించునుగాక! నూతన భూమిని, నూతన పరలోకాన్ని నిర్మించుటకు ఆయన మనకు సహాయ పడునుగాక!

అందరికి క్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలు!
మీ లిటిల్ బ్రదర్ గోపు ప్రవీణ్.

పవిత్ర శుక్రవారము, Year C, 29 మార్చి 2013

పవిత్ర శుక్రవారము, Year C, 29 మార్చి 2013

ఈరోజు క్రైస్తవులమైన మనమందరమూ క్రీస్తు సిలువ మరణాన్ని స్మరించుకొంటున్నాము. దైవ కుమారుడైన క్రీస్తు ఘోరమైన సిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. పవిత్ర శుక్రవారమున, క్రీస్తు మన కొరకు శ్రమలు, బాధలు, అవమానములను, శారీరక వేదనలను మరియు మరణాన్ని పొందియున్నాడు. ఈనాడు, కల్వరి కొండకు సిలువను మోస్తున్న క్రీస్తును మనం అనుసరిస్తున్నాము. వ్యాకుల మాతతో మనము కూడా క్రీస్తు సిలువ చెంత నిలిచి, క్రీస్తు సిలువ మరణార్పణలకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. మనదరికోసం యేసు సిలువ మరణాన్ని పొందియున్నాడని తెలిసిన మనము ఏవిధముగా చలించిపోకుండా ఉండగలము? మన బలహీనతలను, ఆశక్తిని ఆయన భరించాడు. మన శ్రమలను ఆయన శ్రమలుగా భరించాడు.

ఈనాడు శ్రీసభ దివ్యపూజాబలిని కొనియాడకుండా, క్రీస్తు సిలువను, ఆయన శ్రమలు, మరణాన్ని ధ్యానిస్తూ ఉంది. యేసు యెరుషలేమునకు పోవుచు మార్గమధ్యమున పన్నిద్దరు శిష్యులతో ఇట్లనెను: "ఇదిగో! మనము ఇప్పుడు యెరుషలేమునకు వెళ్ళుచున్నాము. అచట మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు, ధర్మశాస్త్రబోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ దండన విధించి, అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళన చేసి, కొరడాలతో కొట్టి, సిలువ వేయుదురు. కాని, ఆయన మూడవ రోజున లేపబడును" (మత్తయి 20: 17-19). ఈ పఠనములో, యేసు తన మరణ పునరుత్థానమును గూర్చి మూడవసారి ముందుగానే తెలియ జేస్తున్నాడు.

క్రీస్తు శ్రమలద్వారా, దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు క్రీస్తు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధమగుచున్నది. అయితే, క్రీస్తు శ్రమలు యాధృచ్చికముగా జరిగినవి కావు. జరగబోవు విషయములన్నియు కూడా ప్రభువు ముందుగానే ఎరిగియున్నారు. శ్రమల గూర్చి, ప్రభువు ముందుగానే మూడు సార్లు తెలియజేసియున్న విషయాన్ని సువార్తలలో చూస్తూఉన్నాము. తన శిష్యులు ఆయన వేదనలను తెలుసుకోవాలని ఆశించాడు. మెస్సయ్యా శ్రమలను, మరణాన్ని పొందవలసి యున్నదని వారు ఏనాడు ఊహించలేదు. లోక పాపాల పరిహార్ధమై క్రీస్తు గొర్రెపిల్ల అర్పణ అవసరమని వారికి అర్ధము కాలేదు!

శ్రమలలో క్రీస్తు తండ్రి దేవునికి విధేయుడైయున్నాడు. ముందుగానే సర్వాన్ని, ముఖ్యముగా తన శ్రమలు, మరణాన్ని ఎరిగిన క్రీస్తు చివరి వరకు తండ్రి చిత్తానికి విధేయుడై యున్నాడు. క్రీస్తు విధేయతకు, అర్పణకు, ప్రేమకు విరుద్ధముగా, పరిసయ్యుల, సధ్ధుకయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల, యూదమత పెద్దల మూర్ఖత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని, కుట్రలను, పన్నాగాలను, పిలాతు అధికార దాహాన్ని, గురు ద్రోహాన్ని చూస్తున్నాము. విశ్వాసము, నమ్మకము,  వాస్తవాలను గ్రహించక పోవడం, హృదయాలను, మనస్సులను మూసివేయడం, స్వార్ధం, అహంకారం, అధికార దాహంతో ఉన్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకొంటాయి. దైవ ప్రేమ, యేసు ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన వారందరికోసం శ్రమలను అనుభవించి, సిలువ మరణాన్ని సంతోషముగా పొందాడు. తనను మట్టుబెట్టాలని చూసిన వారిని ఆయన ప్రేమించాడు.

యూదమత పెద్దలు యేసును చంపలేక పోయారు. ఎందుకనగా, రోమను సామ్రాజ్యం, ఆ అధికారాన్ని యూదులనుండి తీసివేసింది. దాని మూలముగా యేసును అన్య జనులకు అప్పగించారు (మ 20:19 లో యేసు చెప్పిన విధముగా). సీజరుకు వ్యతిరేకముగా తనను తాను రాజుగా చెప్పుకున్నాడని యేసుపై అభియోగాన్ని మోపారు, అసత్య సాక్ష్యమును వెదికారు. పిలాతు యేసునందు ఎలాంటి తప్పును చూడలేదు. కాని, యూదుల ఒత్తిడికి లొంగి పోయి, తన చేతగాని తనాన్ని, రోమను గవర్నరుగా తన అధికారా దాహాన్ని చూపించాడు.

యేసు మరణ దండన తీర్పుకు గురి అయిన తరువాత ఈ క్రింది సంఘటనలు జరిగాయి: ఆయనను పరిహసించారు. రాష్ట్ర పాలకుని సైనికులు వస్త్రములను ఒలిచి, ఎఱ్ఱని అంగీని ధరింప జేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. కుడి చేతిలో రెల్లుకాడి నుంచిరి. ఆయన ముందు మోకరిల్లి. "యూదుల రాజా! నీకు జయము!" అని అవహేళన చేసిరి. ఆయనపై ఉమిసి, ఆయన చేతిలోని రెల్లుకాడను తీసుకొని తలపై మోదిరి. ఆ తరువాత ఆయన వస్త్రములను ఆయనకు ధరింప జేసి, సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. సిలువ మార్గమున ఆయనను కొట్టారు, అవహేళన చేసారు, అవమాన పరచారు. కాని, ప్రభువు వాటన్నింటిని మౌనముగా భరించాడు. మనకోసం తండ్రికి తనను తాను గొర్రెపిల్ల అర్పణగా అర్పించాడు.

తన వారే తనను తృణీకరించారు. "ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని తన వారే ఆయనను అంగీకరించలేదు (యో 1:11). "ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనే" (అ.కా. 4:11). క్రీస్తు ఒంటరిగా సిలువ మరణాన్ని పొందాడు. శిష్యులు పారి పోయారు. తండ్రి కూడా మరచి పోయాడని తన ఒంటరి తనములో, " నా దేవా! నా దేవా! నీవు నన్నేల విడనాడితివి?" అని బిగ్గరగా కేక పెట్టాడు (యో 27:46).

క్రీస్తు సిలువపై మరణించాడు. అయితే, చేతులలో, కాళ్ళలో దించబడిన చీలల వలన ఆయన మరణించలేదు, తలపై పెట్టిన ముండ్ల కిరీటము వలన మరణించలేదు, ఊపిరి ఆడక మరణించలేదు, మరియు శారీరక వేదనల వలన మరణించలేదు. వీటన్నింటి కంటే ఎక్కువగా, ఆత్మ వేదనతో మరణించాడు. మన పాపాల నిమిత్తమై, తండ్రి చిత్తముగా, లోక రక్షణార్ధమై మరణించాడు. క్రీస్తు శ్రమలలో శక్తి, అధికారము ఉన్నవి. ధైర్యముగా శ్రమలను భరించాడు. శ్రమలను, వేదనలను క్షుణ్ణముగా తెలిసిన యేసు అవే అంతము కాదని ఆయనకు తెలుసు. మరల మూడవ రోజున సజీవుడవుతాడని తెలుసు. అందరు విడచినను, తండ్రి తనతో ఉన్నాడని తెలుసు. ఆయన విధేయత వలన తండ్రి తనకు మహిమను చేకూర్చాడు. ఆయన మరణాన్ని జయించిన మృత్యుంజయుడు!

మానవ మాతృలమైన మనము శ్రమలను పొందడం, మరణించడం ఇష్ట పడం. ఒక్కోసారి శ్రమలు, కష్టాలు, బాధలు అని వినగానే వణికి పోతూ ఉంటాము. అయితే, క్రీస్తును అనుసరించే వారికి, శ్రమలు తప్పవు. ఒకానొక  సందర్భములో యేసు తన శ్రమల గూర్చి చెప్పినప్పుడు, పేతురు వ్యతిరేకించాడు. యేసు పేతురును వారించాడు. సరైన దృక్పధముతో మన శ్రమలను అంగీకరించాలని ప్రభువు బోధించాడు. దీని అర్ధమేమనగా, క్రీస్తు దృక్పధమునే మనమూ కలిగి యుండాలి. పాపానికి మరణించాలి. దేవుని చిత్తాన్ని విధేయించాలి. కుమారుని శ్రమలను మౌనముగా భరించి, దైవ చిత్తాన్ని పాటించిన మరియ మన ఆదర్శం.

పవిత్ర శుక్రవారమున, క్రీస్తు శ్రమల, మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. కల్వరికి క్రీస్తుతో పాటు పయనిద్దాం! ఆయన తన జీవితాన్ని మనకోసం అర్పించారు. దేవునికి కృతజ్ఞతలు తెలుగు కొందాం!

పాస్కా కడరా విందు మహోత్సవము (పవిత్ర గురువారం) 28 March 2013


పాస్కా కడరా విందు మహోత్సవము (పవిత్ర గురువారం) 28 March 2013

ఈ పవిత్ర గురువారం పండుగ రోజున తల్లి తిరుసభ పాస్కా కడరా విందు మహోత్సవమును కొనియాడుతూ వుంది. ఈ కడరా విందు సమయములోనే యేసు కూడా దివ్య సత్ప్రసాదమును, గురుత్వమును స్థాపించియున్నారు. మత్తయి, మార్కు, లూకా సువార్తలు కడరా విందు సమయములోనే యేసుకి మరియు తన శిష్యులకు మధ్య ఏమి జరిగిందో చక్కగా వివరించారు. కాని యోహాను సువార్తీకుడు ఈ విషయాన్ని మరొక విధముగా వివరిస్తూ ఉన్నారు. అదే యేసు శిష్యుల పాదాలు కడగటం. ఒక్క యోహాను సువార్తలో మాత్రమే మనం దీనిని చూడవచ్చు.

ఈ నాటి మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వము నుండి విముక్తి చెంది, దేవుని వాగ్ధత్త  భూమికి సాగిన ప్రయాణములో ఏ విధముగా వారు అన్ని నియమనిభంధనలను తు.చ. తప్పకుండా పాటించాలో తెలియ జేస్తుంది. ప్రతీ సం,,ము ఒక్కో కుటుంబము వారి పొరుగు వారితో కలసి పాస్కా విందును జరుపు కోవాలి. ఈ విందు వారికి వారు ఏవిధముగా ఈజిప్టు బానిసత్వమునుండి, విముక్తి పొందారో గుర్తు చేస్తూ ఉంది. యేసు కూడా తన శిష్యులతో కలసి పస్కా విందును భుజించాలని నిర్ణయించుకొన్నాడు. ఈ పాస్కా పండుగ విందులో ఒక ముఖ్య విషయాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఈ పండుగను ఒక సంఘముగా అందరూ కలసి చేసుకొంటారు. అయితే, నూతన దేవుని ప్రజలు అందరూ కలసిపోయి స్వేచ్చను తిరిగి పొందటానికి ఈ పండుగను చేసుకొంటారు. ఈ స్వేచ్చ క్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలరు. కనుక దేవుడు మనకిచ్చే ఈ స్వేచ్చా జీవితం మన ముందు ఉన్నది. ఈ స్వేచ్చా జీవితాన్ని ప్రతీ రోజు పొందాలంటే, యేసుతో జీవితాంతం నడవగాలగాలి. ఆయన సిలువ బాటలో మనం మన సిలువలను మోసుకొంటూ ముందుకు సాగాలి. ఈ స్వేచ్చా జీవితములో ముందుకు సాగమని యేసు ఎల్లప్పుడూ మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఈనాడు జరుపుకొనే యేసు కడరా విందు మరియు ఆ తరువాతి మూడు దినాలలో మనం జరుపుకొనే అర్చన ప్రార్ధనలు, నిజమైన స్వేచ్చలో జీవించడానికి తోడ్పడతాయి. మనం జ్ఞానస్నానం ద్వారా ఈ స్వేచ్చలోనికి పిలువబడినామని ఈ పండుగలు గుర్తు చేస్తున్నాయి. హీబ్రూ ప్రజలు జరుపుకున్న పాస్కా విందు ఏవిధముగా "ఒక సంఘాన్ని" సూచించినదో మనం జరుపుకొనే నూతన పాస్కా పండుగ కూడా మన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నది.

రెండవ పఠనములో పునీత పౌలుడు ఎలాంటి పరిస్థితిలో, ఏ రీతిగా ఈ నూతన పాస్కా విందును జరుపుకోవాలో తెలియచేస్తూ ఉన్నాడు. అసూయతో విడిపోయి ఎవరికీ వారుగా జీవిస్తూ ఉన్న ఒక దైవ సంఘానికి ఆయన ఈ లేఖను వ్రాసాడు. అలాంటి వారు దివ్య బలి పూజ సమర్పించే సమయములో బయటికి పోవాలి అని చెప్పుచున్నాడు. కారణం వారిలో ఐఖ్యత,ఒకే మనసు లేనప్పుడు, స్వార్ధముతొ జీవించినప్పుడు, పూజలో పాలుగొనడములో  అర్ధము లేదు. వారు జీవించే విధానం పూజా బలికి వ్యతిరేకముగా ఉంటూ ఉన్నది. కనుక క్రీస్తు బలిని అర్పించాలంటే, దానిలో పాల్గొనాలంటే, అందరు ప్రేమలో జీవించినప్పుడే దానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది. ప్రేమ లేకుండా పూజా బలిలో పాల్గొంటే అది నిజాయితీ లేనితనం అవుతుంది. యేసు కడరా భోజనాన్ని తన శిష్యులతో పూర్తి స్వేచ్చతో మరియు సర్వమానవాళిపై అమితమైన ప్రేమతో జరుపుకొన్నాడు. కనుక మనం అదే బలిలో పాల్గొన్నప్పుడు, క్రీస్తు కలిగిన ప్రేమను, స్వేచ్చను కలిగియుండాలి అని పౌలుగారు బోధిస్తూ ఉన్నాడు. పూజా బలిలో  పాల్గొన్నప్పుడు, మనం క్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకొంటూ ఉన్నాము, ఆయన ఉత్తానములో పాలుపంచుకొంటూ ఉన్నాము మరియు మరల ఆయన తిరిగి వస్తాడన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. కనుక, ఇది అటు దేవునికి, ఇటు ప్రపంచానికి ఒక కొత్త నిబంధన. కనుక ఆయన గొప్ప ప్రేమని సర్వమానవాళి గుర్తించాలి. ఆయన అమితమైన ప్రేమను, ఉదారతను మనం అనుసరించాలి.

ఈనాటి సువార్తలో యేసు శిష్యుల పాదాలు కడుగుట ద్వారా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే అధిక ప్రేమ మరొకటి లేదు అని తను పలికిన మాటలను రుజువుచేస్తూ ఉన్నాడు. యేసు తన ప్రేమని మాటల రూపములోనే కాక క్రియల రూపములో నిరూపిస్తూ ఉన్నాడు. ఇదే సందేశాన్ని పౌలుగారు తీసుకొని నిజమైన ప్రేమ ఎలా ఉండాలో కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖలోని 13 వ అధ్యాయములో వివరించాడు.

"మానవ భాషలను, దేవదూతల భాషలను నేను మాటలాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోను, గణగణలాడెడి తాళముతోను సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్ధము చేసికోగలిగినను, సమస్త  జ్ఞానము కలిగిన వాడైనను, పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేనివానినైనచో, నేను వ్యర్దుడనే! నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్ధము  నా శరీరమునే త్యజించినను, ప్రేమలేని వాడనైనచో, అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు. సత్యముననే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును. సమస్తమును విశ్వసించును. సమస్తమును ఆశించును. సమస్తమును సహించును." అని పౌలుగారు చక్కగా వివరించి యున్నారు. ఇలాంటి ప్రేమనే మనం క్రీస్తులో చూస్తూ ఉన్నాము.

యేసు శిష్యుల పాదాలు కడగటం, సేవను సూచిస్తూ ఉన్నది. శిష్యుల పాదాలు కడుగుటలో ఉన్న నిగూఢ అర్ధాన్ని, ఆ సమయములో శిష్యులు అర్ధం చేసుకోలేక పోయారు. అందుకే పేతురు యేసును అడ్డుకొన్నాడు. వారు దానిని అర్ధం చేసుకోవాడానికి ప్రభువు ఉత్తానం వరకు వేచి ఉండవలసి వచ్చింది. శిష్యుల పాదాలు కడగటం ఒక చిహ్నం. యేసు ప్రేమ అంతిమ పరిక్ష పవిత్ర శుక్రవారం సిలువలో మరణించినప్పుడు చూస్తూ ఉన్నాము. ఉత్తానుడైన యేసు ప్రేమను జ్ఞానస్నానం ద్వారా మన పాపాలను కడిగినప్పుడు మనం పొందుతూ ఉన్నాము. దీని ద్వారా ఆయన మనలను తండ్రి దేవుని జీవితములో భాగాస్తులను చేస్తూ ఉన్నాడు. ఆయనకు దగ్గరగా మనలను చేరుస్తూ ఉన్నాడు. కనుక ఈ పవిత్ర గురువారం యొక్క సందేశం: యేసు మనలను తన స్నేహితులుగా చేసుకొంటూ ఉన్నాడు. అందుకే తనను తాను బలిగా అర్పించు కొన్నాడు. తన జీవితాన్ని, మనకు పంచుతున్నాడు. దీనిని తిరిగి మనం మన కుటుంబాలలో పంచుకొని జీవించాలి. మనం పని చేసే చోట, జీవించే చోట, ఈ ప్రేమను పంచాలి.

చివరిగా, జ్ఞానస్నానం ద్వారా, మనం అందరం యేసు గురుత్వములొ పాలుపంచుకొంటున్నాము. కాని, ఈ రోజు గురువులు యేసు గురుత్వములొ ప్రత్యేకముగా పాలుపంచు కొంటున్నారు. కారణం, యేసు కడరా విందులో గురుత్వాన్ని స్థాపించడం. యేసు ఎప్పుడైతే, "దీనిని మీరు నా జ్ఞాపకార్ధముగా జేయుడు" అని పలికాడో అప్పుడు తన శిష్యులకు, మరియు తరతరాలుగా దేవుని పిలుపును అందుకొన్నవారికి యేసు తన గురుత్వములొ పాలుపంచుకొనే విధముగా వారిని ఎన్నుకొన్నాడు. కనుక గురువు పూజా బలిని అర్పిస్తాడు, ఒక సంఘం కాపరిగా ఉంటాడు, ఆధ్యాత్మిక జీవితములో జీవిస్తాడు. కనుక ఈ రోజు మనందరి గురువుల పండుగ. వారికోసం ఈ రోజు ప్రత్యేకముగా ప్రార్ధన చేయాలి. చివరిగా, ఈ పవిత్ర గురువారం మనకు మూడు విషయాలు నేర్పుతూ ఉన్నది. 1. దివ్య సత్ప్రసాదాన్ని ఆరాధించాలి. భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని క్రీస్తు శరీరములో భాగస్తులం కావటం. 2. ప్రేమలో జీవించడం. 3. క్రీస్తు గురుత్వములొ భాగస్తులైన మన గురువులను గౌరవించి వారు చూపించిన ప్రేమ బాటలో, క్రీస్తు బాటలో, విశ్వాస బాటలో ముందుకు సాగటం. కనుక, ఈ వరాలను దయచేయమని ప్రార్ధిస్తూ, రాబోయే మూడు రోజులు కూడా క్రీస్తు సిలువను అనుసరిస్తూ ఆయన ఉత్థానం వైపు ముందుకు సాగుదాం. ఆమెన్.

పవిత్ర గురువారం (Holy Thursday)

పవిత్ర గురువారం
నిర్గమ 12:1-8, 11-14; 1 కొరి 11:23-26; యోహాను 13:1-15

ఉపోద్ఘాతము:
తపస్కాలము మనలను మనం దైవీకముగా మార్చుకొనుటకు దేవుడిచ్చిన సమయం. అలాంటి తపస్కాలమందు విభూది బుధవారము నుండి మ్రానుకొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తైతే, ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు. అటువంటి ఈ తపస్కాల చివరి వారమందు ఉత్థాన పండుగకు ముందు వచ్చు గురువారమును, పవిత్ర గురువారముగా పిలుస్తున్నాం. తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈరోజు నాలుగు ప్రధాన అంశాలను ధ్యానిస్తున్నాం: (1). యేసు శిష్యుల పాదాలను కడుగుట; (2). దివ్యసత్ర్పసాద స్థాపన; (3). పవిత్ర యాజక అంతస్తు స్థాపన; (4). నూతన ఆజ్ఞ.

మొదటి పఠన నేపధ్యం - పాస్క పండుగ, నియమములు (నిర్గమకాండము 12:1-8, 11-14): యూదులు పాస్క పండుగను 8 రోజులపాటు జరుపుకొనేవారు. ఈ రోజుల్లో, పొంగని రొట్టెలను మాత్రమే తినేవారు. పాస్క భోజనం “హల్లెల్” కీర్తనల మొదటి భాగాన్ని పాడడంతో ప్రారంభమవుతుంది (కీర్త 113,114 - పాస్క తిరునాళ్ళ పాట). ఆతరువాత, చేదు మొక్క కూరను తిని, 
“హల్లెల్” కీర్తనల రెండవ భాగాన్ని పాడేవారు (కీర్త 115-116 వందన సమర్పణ). కుటుంబములో పెద్ద, పాస్క పండుగ ప్రాముఖ్యతను వివరించేవారు. ఆ తరువాత, నిప్పులో కాల్చిన గొర్రెపిల్ల (రక్తాన్ని బలిగా ముందుగానే దేవునికి అర్పించేవారు) మాంసమును తిని, ప్రధాన “హల్లెల్” కీర్తనలను పాడేవారు (కీర్త 117-118 - స్తుతి, వందనగీతం). పాస్క (హీబ్రూ) అనగా 'దాటిపోవుట' అని అర్ధము. ఐగుప్తు బానిసత్వమును దాటుటను, ఎర్రసముద్రాన్ని దాటుటను వారు పాస్క పండుగగా కొనియాడారు.

ఈనాడు ఇస్రాయేలీయులు పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లను చంపి, దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు ఆజ్ఞాపించారు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్క బలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి ప్రభువు విడమరచి చెప్పియున్నారు. ఈ పాస్క గొర్రెపిల్లను ఏ విధముగా తినవలెనో కూడా యావే ప్రభువు చెప్పియున్నారు. ఆ నియమములు ఏమనగా: - తినునపుడు వారి నడుముకు దట్టి ఉండవలెను; - కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను; - చేతిలో కర్ర ఉండవలెను; - మాంసమును త్వరగా తినవలెను;

ఈ నియమములను మనము ఒక్కసారి గమనిచినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నపుడు మనలను మనము త్వరితగతిన తయారుచేసుకొంటున్నట్లుగా ఉన్నాయి. ఆ విధముగా మనము ఎంత ఉత్కంటభరితముగా దేవుని పాస్క గురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చును. ఏ విధముగానైతే ఒక అధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంటభరితముగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని పాస్క గురించి ఉత్కంటగా తయారు కావాలనేదే దేవుని ఉద్దేశ్యము! అంటే దేవుని పాస్క బలిని ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు గుణముతోను జరుపుకొనవలెను.

ఈ పాస్క బలి ఐగుప్తీయుల బానిసత్వంనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు సూచనగా జరుపుకొనేవారు. అదేవిధంగా ఈ పాస్క బలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తు బలికి సూచనగాను జరిగినట్లుగా మనము అర్ధము చేసుకోవచ్చు!

(1). శిష్యుల పాదాలను కడుగుట (యోహాను 13:1-15):
"యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను" (యోహాను 13:1; 17:1). "యేసు గడియ" సిలువపై మరణము, ఉత్థానముతో పరిపూర్తియైనది. ఇది క్రీస్తు పాస్కకు, అనగా తండ్రి యొద్దకు 'దాటిపోవుటను' సూచిస్తుంది. క్రీస్తు తన శిష్యులపైనున్న అనంత ప్రేమకు సూచన!
దైవకుమారుడు యేసు, తన పాస్క పండుగను, శిష్యుల పాదాలు కడుగుటతో ప్రారంభించారు. ఇది వినయపూర్వకమైన సేవకు, తన శిష్యులపై తనకున్న ప్రేమకు సూచన! ఇది ఆయన ప్రేమకు, సేవకు ప్రతిరూపం! "మనుష్య కుమారుడు సేవించుటకే గాని, సేవింప బడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను" (మార్కు 10:45) అన్న మాటలు మనకు స్ఫురిస్తున్నాయి. శిష్యులు కూడా అలాగే చేయాలని ఆజ్ఞాపించారు.

తాను దేవుని కుమారుడైనను శిష్యుల పాదములను కడుగుటకు సిద్ధపడగా, పేతురు ఆ దైవీక చిహ్నమును అర్ధము చేసుకోలేక నిరాకరించాడు (యోహాను 13:8). అందుకు యేసు "నేను నిన్ను (నీ పాదములను) కడుగని యెడల, నాతో నీకు భాగము ఉండదు" (యోహాను 13:8) అని చెప్పుటద్వారా శిష్యులందరు తన ప్రేషిత కార్యములోను, శ్రమలలోను, మహిమలోను భాగము పంచుకుంటారని చెప్పారు. అందుకనే యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచారు (యోహాను 15:15).

"మీరందరు శుద్దులు కాదు" అని చెబుతూనే యూదా ఇస్కారియోతు కాళ్ళను కూడా యేసుప్రభువు కడిగారు. ఎందుకనగా, యేసు యుదాతోసహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించారు (యోహాను 13:1). యుదా తనను అప్పగిస్తాడని తెలిసికూడా అతనిని ప్రేమించారు. యుదా కాళ్ళు కడగడముద్వారా తనలో యుదాకికూడా భాగముందని చెప్పకనే చెప్పారు. కాని యుదా ప్రభువు మనస్సుని అర్ధము చేసుకోలేక, ఆ భాగమును నిరాకరించి యేసుని రోమను సైనికులకు అప్పగించాడు. ఈ కార్యముద్వారా యేసుక్రీస్తు, షరతులు లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను అర్ధము చేసుకొనవచ్చు. ఈ విధముగా ప్రభువు ప్రేమకు మంచివారు, చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించుచున్నారు.

అంతేకాకుండా యేసుప్రభువు, తాను ఏవిధముగా చేసెనో తన శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును ఇచ్చారు. తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియుచున్నది. ఈ విధముగా ఈ వినమ్ర కార్యం, పరుల ప్రేమకు తార్కాణముగా నిలుస్తుందని యోహాను మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు.

(2). దివ్య సత్ప్రసాద స్థాపన (1 కొరి 11:23-26; మత్త 26:17-30; లూకా 21:7-23):
ప్రభువు కడరాత్రి భోజనమును, ప్రధమ దివ్యబలి పూజా వేడుకగా మార్చారు. ఏవిధముగా యావే దేవుడు తన పాస్క బలి నియమములను చెప్పియున్నారో, దివ్యసత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏవిధముగా జరపాలనే నియమముల గురించి, పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి, 
పునీత పౌలు మనకు తెలియజేయు చున్నారు.
కాల్చిన గొర్రెపిల్లను భుజించిన తరువాత, యేసు తన శరీర రక్తములను, రొట్టె ద్రాక్షారస రూపములో శిష్యులకు అందించారు. ఈవిధముగా, యేసు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు. ఇది స్వర్గపు శాశ్వత ఆహారానికి, నిత్యజీవానికి, దేవుని శాశ్వత సాన్నిధ్యానికి గురుతు. అలాగే, యేసుప్రభువు తాను అప్పగి౦పబడనున్న రాత్రి దివ్యసత్ప్రసాద బలిద్వారా తనను ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్య సత్ప్రసాద బలి యేసుప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తు. ఈ దివ్య సత్ప్రసాద బలిద్వారానే మనము ప్రతిదినము ప్రభువు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకొంటున్నాము. ఈ బలిలో ముఖ్య అంశములు ఏమనగా:
(i). కృతజ్ఞతాబలి: యేసుప్రభు దివ్యసత్ప్రసాద స్థాపనలో మొదటగా దేవునకు కృతఙ్ఞతలు చెల్లించారు. తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృతఙ్ఞతలు చెప్పియున్నారు. అనగా దివ్యసత్ప్రసాద బలి, యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ, దేవునికి కృతఙ్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలియుచున్నది. అందుకే దివ్య సత్ప్రసాదబలిని కృతజ్ఞతాబలిగా కొనియాడతాము.
(ii). దివ్య (ప్రాణ) బలి: దేవునికి కృతఙ్ఞతలు తెలిపిన తరువాత తన మరణమునకు సంకేతనముగా 
రొట్టెను త్రుంచి, యేసు తన శిష్యులకు ఇచ్చియున్నారు. ఈవిధముగా ప్రభువు ఇచ్చిన రొట్టె తనకే సూచనగా నిలుచుచున్నది. తాను రొట్టెను తుంచడముద్వారా తననుతాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు, తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును ధారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లము చేసియున్నారు.
(iii). దివ్య రక్తము: భోజనము తరువాత యేసుప్రభువు ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నమని చెప్పియున్నారు (లూకా 22:20). ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభువు చెప్పినవిధముగా పునీత పౌలు అభివర్ణించారు. అందువలన, ప్రతి దివ్యబలిపూజలో ద్రాక్షరసము అర్పింప బడునప్పుడు ప్రభువు మనందరి పాపములను శుద్ధిచేయుటకు చిందిన దివ్యరక్తమును జ్ఞాపకము చేసుకొనుచుందుము. అంతేకాకుండా, ఈ నాటి రెండవ పఠనములో పునీత పౌలు మనకు యేసుప్రభుని రక్తముద్వారా నిత్యమరణము నుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు. ఎందుకనగా,  ఇశ్రాయేలు సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నము. యేసుప్రభువు తన రక్తమును చిందించుటద్వారా తన జీవమును స్వచ్చందముగా అర్పించి, తద్వారా మనందరిని నిత్యమరణము నుండి శాశ్వత విముక్తులను చేసారు. యేసుప్రభు రక్తము చిందించుట మనకు మొదటి పఠనములో గొర్రెపిల్ల చంపబడుటను గుర్తుకు తెచ్చును. ఏవిధముగానైతే గొర్రెపిల్ల రక్తము గుమ్మములకు పూయడము ద్వారా ఇస్రాయేలీయుల తొలిచూలు బిడ్డలు రక్షించబడ్డారో, అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరమూ రక్షించబడ్డామని తెలియుచున్నది.
(iv). నూతన నిబంధన: మనందరికోసం యేసుప్రభువు చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకొన్న నూతన ఒడంబడిక (1 కొరి 11:25). ఈ సమయములో పాత ఒడంబడిక గురించి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. సినాయి కొండపై యావే ప్రభువు వేంచేసి, ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొనియున్నారు. కాని తరువాత ఎన్నోసార్లు ఇస్రాయేలీయులు ప్రభువు మాటను, ఒడంబడికను మీరి తప్పు చేసారు. ఐనప్పటికీ ప్రభువు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని క్షమించారు. చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిత్యనిబంధనను చేసుకొనియున్నారు. అయితే, ఈ శాశ్వత నిత్యనిబంధన ఇస్రాయేలీయులకే గాక మానవజాతి అంతటికీ వర్తిస్తుంది. అందువలన ఎవరైతే ఈ నూతన నిత్య నిబంధనలో జ్ఞానస్నానముద్వారా భాగస్తులగుదురో వారందరితోనూ ప్రత్యేకముగా నిబంధనను చేసుకొంటూ ప్రతిఒక్కరికి నిత్య జీవభాగ్యమును ఒసగుచున్నారు.

(3). పవిత్ర యాజక అంతస్తు స్థాపన: 
ఈ రోజు ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ఆవిష్కరించ బడిన రోజు. అదే పవిత్ర యాజక అంతస్తు స్థాపన. యేసు ప్రభువు, తాను ఆదినుండి యావే దేవుని ప్రధాన యజకుడైనను, తననుతాను సిలువపై అర్పించుకొనే, యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసికున్నారు. ఆవిధముగా తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలివస్తువుగాను అయి, తన జీవిత చరమాంకానికి తెరతీసారు. తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణద్వారా మొదలుపెట్టారు. "దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు" (1 కొరి 11:24-25; లూకా 22:19) అని శిష్యులకు ఆజ్ఞాపించి యున్నారో అప్పుడు, ఆ సమయమున అపోస్తలులందరూ యేసు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు, తద్వారా, పవిత్ర యాజక అంతస్థును స్థాపించారు. తరువాత కాలములో, అపోస్తలులు ఎవరినైతే ఎన్నుకొనేవారో, వారికి క్రీస్తు యాజకత్వం దయచేయబడినది. అందుచేత ఈ రోజు క్రైస్తవ గురువులందరి గురించి ప్రత్యేకముగా ప్రార్ధించవలసిన సుదినం.

(4). నూతన ఆజ్ఞ (యోహాను 13:31-35)
యేసు, నూతన పాస్క సాంగ్యాన్ని నూతన ఆజ్ఞను ఇవ్వడముతో ముగించారు: "నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు" (యోహాను 13:34). ప్రేమాజ్ఞ దేవునితోను, తోటివారితోను లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడం. నేటి మన బంధాలలో విశ్వసనీయత, నిబద్ధత కొరవడింది. మన బంధాలు చాలా షరతులతో ముడిపడి ఉన్నాయి. మన బంధాలు స్వార్ధము, నమ్మకద్రోహముతో కూడుకున్నవి. కనుక, సజీవ దేవునితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి మనం జీవించాలి. శిష్యరికములో ప్రేమ, విశ్వాసం ఉండాలి. యూదావలె గాక (అతని హృదయములో పిశాచము చెడు ఆలోచనను కలిగించెను), ప్రియ శిష్యునివలె (క్రీస్తుతో సంపూర్ణ సహవాసం) మనం మారాలి. తండ్రి దేవునితోను, క్రీస్తుతోను సహవాసము కలిగి జీవించాలి.
నేడు మన మధ్య ఐఖ్యత లేకపోవడానికి కారణం, యేసు వలె మనం ప్రేమించక పోవడమే! షరతులతో కూడిన ప్రేమ విభజనలను సృష్టిస్తుంది. యేసు వలె మనం ప్రేమించినపుడే, మనలో ఐఖ్యత ఉంటుంది. "మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు" (యోహాను 13:35).

ముగింపు:
చివరిగా, క్రీస్తు మొదటి పఠనములోని ప్రజలకోసం చనిపోవు మరియు లోకపపములను పరిహరించు గొర్రె పిల్లగా (బప్తిస్మ యోహాను ప్రవచనం - యోహాను 1:29, 36) సూచించబడగా, రెండవ పఠనంలో యాజకుడుగాను, బలిఅర్పణగాను సూచించబడగా, సువార్తలో వినమ్రహృదయుడుగాను వర్ణించపడ్డారు. ఈ విధముగా ఈనాటి పఠనాలద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి, క్రిస్తుని ప్రేమ గురించి విఫులముగా వివరిస్తున్నది. అనగా యేసుని ప్రేమను ఒక నాణెముగా పరిగణిస్తే, యేసుని యొక్క స్వచ్చంద బలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరొక పార్శ్వముగా అర్ధము చేసుకొనవచ్చును. అంతేకాకుండా ఈనాటి పఠనాలు, దేవుడు ఇచ్చిన పాస్క పండుగ నియమాలు, దివ్య సత్ప్రసాదక్రమము, క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏవిధముగా ఆచరించవలెనో, ఏవిధముగా జ్ఞాపకము చేసుకోవలెనో సూచనప్రాయముగా తెలియచేయుచున్నాయి. ఈవిధముగా ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారము యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ పవిత్ర గురువారమును ఎందుకు భక్తిశ్రద్ధలతో జరుపుకొనవలెనో తెలియచేయుచున్నవి.

మ్రాని కొమ్మల (శ్రమల) ఆదివారము, 24 మార్చి 2013


మ్రాని కొమ్మల (శ్రమల) ఆదివారము, 24 మార్చి 2013
యెషయ 50:4-7; ఫిలిప్పి  2:6-11; లూకా 22:14-23, 56 
పాస్కా పవిత్ర వారాన్ని క్రైస్తవులందరూ కూడా ఈ ఆదివారముతో ప్రారంభిస్తూ ఉన్నారు. తపస్సు కాలము పరిశుద్ద సమయముగా చెప్పబడుతుంది. దేవుని ఆశీర్వాదములు నిండుగా పొందుతూ ఉన్నాము. అయితే, ఈ ఆదివారముతో మనం దైవార్చన సం,,లో అతి పవిత్రమైన, ముఖ్యమైన సమయములోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మనం యేసు యెరూషలేములో   ప్రవేశించే ఘట్టాన్ని గుర్తు చేసుకొంటూ ఆరంభిస్తూ ఉన్నాము.

ప్రపంచ చరిత్రలో తప్పుచేసిన అనేక మంది శిక్షించబడటం మనం చదువుకొని యున్నాము. చాలా మంది సిలువ మరణాన్ని కూడా పొందియున్నారు. అనేక శతాబ్దాలుగా కొన్ని దేశాలలో సిలువపై మరణ దండన విధించడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. అయితే, ఇలా సిలువపై మరణించిన వారి గురించి కాని, శిక్షను పొందిన వారి గురించి కాని, మనం ఎక్కువగా మాట్లాడుకోము, చర్చించుకోము. కాని ఈ సిలువపై మరణించిన ఒక వ్యక్తి గురించి ఈనాడు ప్రత్యేకముగా ధ్యానము చేసుకొంటున్నాము. ఆ వ్యక్తి మరణాన్ని స్మరించు కొంటున్నాము. అతడే నజరేయుడైన యేసు ప్రభు. ఈ రోజు తిరుసభ ప్రత్యేకముగా యేసు శ్రమల, మరణ ఘట్టాలను చదువుకొని ధ్యానించు కొంటున్నాము.

ఈనాటికి కూడా మనం ఆయనను గురించి తలంచి, ఆయన శ్రమలను, మరణాన్ని గురించి మాట్లాడు కొంటున్నాము. ఆయనే దేవుని ఏకైక కుమారుడు. ఈ లోకానికి ఒక చిహ్నాన్ని, ప్రేమ చిహ్నాన్ని ఇవ్వడానికి, ఈ లోకానికి రక్షణను, విమోచనమును ఇవ్వడానికి, తన తండ్రి చిత్తం ప్రకారముగా శ్రమలను, సిలువ మరణాన్ని అనుభవించాడు, భరించాడు.

ఆయన తన జీవితాన్ని సర్వ మానవాళి కోసం సమర్పించాడు.  దైవ కుమారుడిగా దేవుని ప్రేమను గురించి మాట్లాడాడు. ఆ ప్రేమతోనే అనేక మందికి స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆ ప్రేమ కారణం చేతనే దేవుని కరుణను, ఓదార్పును పంచి పెట్టాడు. చివరికి ఆ ప్రేమ కారణముగానే, శ్రమలను, సిలువ పాటులను తన పూర్తి స్వేచ్చతో అంగీకరించి, మన దరికి కూడా నిజమైన ప్రేమ ఎలా ఉండాలో చూపించాడు. ఈ చిహ్నాన్నే యేసు సిలువ, శ్రమల పాటుల ద్వారా ఇస్తూ ఉన్నాడు.

మానవుని జీవితం, వెలుగు చీకటిల మధ్య ఒక సమరముగా చూస్తూ ఉన్నాము. కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు. అవి అందరి జీవితాలలో ఒక భాగం ఈ కష్ట సుఖాలు అనేక రకాలుగా మనకు తారస పడతాయి. అయితే యేసు ఈ లోకానికి వచ్చింది మనకు కష్టం రాకుండా ఆపడానికి కాదు. ఆయన వచ్చింది మన కష్టాలలో పాలు పంచుకోవడానికి, మన కష్టాలలో మనతోఉండటానికి, మనతో జీవించడానికి, మన మధ్య జీవించడానికి, తన సన్నిధానముతో మనలను నింపడానికి.  ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మనతో ఉండుట వలన, మనం శక్తిని, బలాన్ని పొందుతూ ఉన్నాము.

కనుక, మనం ఎక్కడ ఉన్న ఎలా ఉన్న, క్రీస్తు వైపు చూడటానికి ప్రయాస పడదాం! క్రీస్తు మనలను తన వెలుగులోనికి, ఉత్తాన పండుగ సంతోషములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని అందుకొని, ధైర్యముగా ముందుకు సాగుదాం.

యేసు యేరుషలేము పట్టణ మార్గాన్ని ఎంచుకొని, ఆ పట్టణ ములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆయనకు జయ జయ ధ్వానాలు పలికారు. అయితే, యేసు యేరుషలేము ప్రయాణాన్ని ఈనాడు మనదరి జీవితాలలో పోల్చుకోవాలి. ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ఎన్నుకున్నది యేరుషలేము మార్గము. అయితే ఈ మార్గమే ఆయనను సిలువ మరణానికి గురి చేసింది. ఈనాడు యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించ డానికి, జ్ఞానస్నానం పొందిన ప్రతీ బిడ్డను ఎన్ను కొంటున్నాడు. యేసు ఏవిధముగా యేరుషలేము పట్టణములో ప్రవేశించాడో, అదే విధముగా మనందరి హృదయాలలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవిత బాటలో ప్రయాణిస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్న, ఆయన మన చెంతకు వస్తూనే ఉంటాడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. కనుక మన కష్ట బాధలను ఆయనతో పంచుకొందాం. ఈ పవిత్ర వారములో ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నిద్దాం. ఆయన మనలను ఎన్నటికి మోసం చేయడు. కారణం, ఆయన మన తండ్రి మరియు ఆయన ప్రేమ స్వరూపుడు.

ఐదవ తపస్కాల ఆదివారము, YEAR C

ఐదవ తపస్కాల ఆదివారము
పఠనాలు: యెషయా 43:16-21; ఫిలిప్పీ 3:8-14; యోహాను 8:1-11
క్రీస్తులో నూతన జీవితం 

పవిత్ర వారానికి ఒక వారం దరిలో మాత్రమే ఉన్నాము. పవిత్ర వారములో క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా దేవుని యొక్క ప్రేమను ధ్యానిస్తూ ఉంటాము. తపస్కాలములో ప్రత్యేకముగా దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము. మనం చేయవలసినదెల్ల, మనలను మనం మార్చుకొని దైవాను చిత్తముగా జీవించాలి. ఆయన యందు మన బలహీనతలను అంగీకరించి, ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడని విశ్వసించాలి. తపస్కాలం ఓ ఆనందకరమైన కాలం, ఎందుకన, క్రీస్తు ఉత్థాన మహిమలో, ఆనందములో ఆశీర్వాదములో భాగస్తులమవుటకు మనలను మనం సిద్ధపరచుకొను కాలం. మనం ఎంతటి పాపాత్ములమైనను, ప్రభువు మనలను క్షమించుటకు సిద్దముగా ఉన్నారు. అందుకు ఉదాహరణ ఈనాటి సువిషేశములో విన్నట్లుగా వ్యభిచారమున పట్టుబడినదని ప్రభువు చెంతకు తీసుకొని రాబడిన స్త్రీని ప్రభువు సంపూర్ణముగా క్షమించడమే!

మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యాలను, చూపిన ప్రేమను చూస్తూ ఉన్నాము. మోషే నాయకత్వములో, వారిని వాగ్దత్త భూమి వైపుకు నడిపించారు. ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఫరో సైన్యాన్ని నాశనము చేసి, ఈజిప్టు బానిసత్వము నుండి కాపాడారు. పాపములో పడిన ప్రతీసారి, తన ప్రజలను సరిచేసి కాపాడుకొన్నారు.

అయితే, గతాన్ని చూడక, ముందుకు సాగిపోవాలని యెషయా ప్రవక్త ద్వారా తెలియ జేయుచున్నారు. గతం ఎప్పుడు కూడా మన మనస్సులను మూసివేసి, ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా చేస్తుంది. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు: "మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర లేదు. పాత సంఘటనలను తలచుకోనక్కరలేదు" (యెషయ 43:18). "ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసెదను" (యెషయ 43:19) అని వాగ్దానం చేసి యున్నారు. అనగా దేవుడు ఎప్పుడుకూడా మనకోసం నూతనత్వాన్ని సృష్టిస్తూ ఉంటారు. నూతన అవకాశాలను కల్పిస్తూ ఉంటారు.

రెండవ పఠనములో కూడా, పునీత పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో, గతాన్నుండి బయట పడాలని తెలియ జేస్తున్నారు. పౌలుగారు, క్రీస్తును మాత్రమే పరిగనిస్తున్నాడు. మిగతా వాటన్నింటిని, ముఖ్యముగా గతాన్ని చెత్తగా భావించాడు. "నా ప్రభు యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును తెలిసి కొనవలెనని, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనని నా వాంఛ" (ఫిలిప్పీ 3:8,10). పౌలు పరిపూర్ణతను వెదకుటలో ఒక పరిసయ్యునివలె ధర్మశాస్రమును విధేయించాడు. కాని, చివరికి క్రీస్తులో ఆ పరిపూర్ణతను కనుగొన్నాడు. అప్పుడు క్రీస్తుకై సమస్తమును విడనాడాడు. క్రీస్తును పొందడం అనగా కేవలం జ్ఞానమును కలిగి యుండుట మాత్రమేగాక, క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని కలిగి యుండటము. క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని పొందియున్నప్పుడు, మన శ్రమలన్ని కూడా ఆశీర్వాదాలుగా మారతాయి.

మనలను మనం ప్రశ్నించుకొందాం
1. తండ్రి యావే దేవుడు మనకు గతములో ఎన్నో చేసాడని, అలాగే మన కొరకు ప్రతీ క్షణం నూతనత్వాన్ని సృష్టిస్తున్నాడని విశ్వసిస్తున్నామా?
2. ఆ తండ్రి దేవుడు సృష్టించిన ఆ నూతనత్వం క్రీస్తునిలో మన జీవితం అని విశ్వసిస్తున్నామా?
3. ఆ క్రీస్తు కొరకు సమస్తమును విడనాడుటకు సిద్దముగా ఉన్నామా?
4. పౌలువలె, క్రీస్తు పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనను వాంఛను కలిగియున్నామా?

ఈనాటి సువిశేష పఠనమును ధ్యానిద్దాం
పర్ణశాలల పండుగకు, యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యేసు ఓలీవు పర్వతమునకు వెళ్లి తెల్లవారగనే దేవాలయమునకు రాగా, ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన వారికి కూర్చుండి బోధించుచుండగా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని (యోహాను 8:1-11) యేసు చెంతకు తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టిరి. ఆమెపై తీర్పు విధించమని, లేదా తన అభిప్రాయాన్ని చెప్పమని యేసును అడిగారు. ఇటువంటి స్త్రీలను రాళ్ళతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెనని గుర్తుకు చేసారు (ద్వితీ 22:23-24; లేవీ 20:10; యెహెజ్కె 23:43-47). వ్యభిచారం చాలా తీవ్రమైన నేరం అని అర్ధమగుచున్నది. పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, యేసు మాటలలో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై అట్లు అడిగారు (8:6). అప్పటికే వారు యేసును చంప ప్రయతించుచున్నారు (యోహాను 7:1). ఆయనను బంధించుటకై అధికారులను పంపిరి (7:32). 

ఒకవేళ, చట్టం ప్రకారం చేయుడు అని యేసు చెబితే, పాపులపట్ల కనికరం, ప్రేమకలవాడని చెరగని ముద్రవేసుకున్న పేరును కోల్పోతాడు! ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రోమను అధికారులతో విబేధాలు ఎదురవుతాయి, ఎందుకన, ఆ రోజుల్లో, రోమను ప్రభుత్వానికి మాత్రమే మరణశిక్ష విధించే అధికారం ఉండేది. ఒకవేళ ఆమెను చంపవద్దు అని యేసు చెబితే, చట్టానికి, సంప్రదాయాలకు విరుద్ధముగా వెళుతున్నాడని అతనిని నిందించవచ్చు. ఎలాగైనా యేసును ఇరకాటములో పెట్టాలన్నదే వారి ఉద్దేశ్యం! వారి కుటిల బుద్ధి స్పష్టముగా కనిపిస్తుంది. యేసు ప్రభువుకు ఇది సాతాను శోధన లాంటిదే! అప్పుడు యేసు వంగి వ్రేలితో నేలమీద వ్రాయసాగెను (7:6). అయితే, ప్రభువు వారి ఉచ్చులో పడలేదు. "వారు పదేపదే అడుగగా, యేసు లేచి వారితో, "మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును" (7:7) అని చెప్పి వారికి బుద్ది చెప్పారు. యేసు చెప్పిన ఈ మాటలు, పదునైన ఖడ్గములా, తూటాల్లా వారి హృదయాలకు తాకాయి. తాముకూడా పాపులమే అని గుర్తుకు చేసాయి. "దోషిని చంపునపుడు సాక్షులే మొదట రాళ్ళు రువ్వవలయును. తరువాత జనులెల్లరు రాళ్ళు రువ్వి ఆ వ్యక్తిని వధింతురు" (ద్వితీ 17:7) అని చట్టం నిర్దేశిస్తుంది. మరల యేసు వంగి నేల మీద వ్రాయుచుండగా, అందరు అక్కడనుండి వెళ్ళిపోయారు.

ఈ సన్నివేశాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు మొట్టమొదటిగా, ఇతరులపై మనం ఎలాంటి తీర్పు చేయరాదని గుర్తించాలి. ఇతరులలో తప్పులను వెదకి వారిని నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము! దీనిని టైం పాస్ వలె భావిస్తూ ఉంటాం! "పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు... నీ కంటిలోని దూలమును గమనింపక, ఇతరుల కంటిలోని నలుసును వ్రేలేత్తి చూపెదవేల?" అని యేసు చెప్పారు (మత్త 7:1-5). అలాగే, మన ఈ ప్రస్తుత సమాజములో స్త్రీలపట్ల ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్త్రీని గౌరవించడం నేర్చుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది! ఈ సన్నివేశములో, ఒకవైపు ధర్మశాస్రబోధకుల కుటిలబుద్ధి, మరోవైపు యేసు క్షమాగుణం చూస్తున్నాము. అలాగే ఆ స్త్రీతో, "ఇక పాపము చేయకుము" అని చెప్పియున్నారు. అ స్త్రీకి నూతన జీవితాన్ని ఒసగారు.

యేసు ఆ స్త్రీని ఖండించలేదు అంటే, ప్రభువు పాపాన్ని సమర్ధిస్తున్నట్లు కాదు. యేసు పాపాన్ని ఖండిస్తారు, కాని పశ్చాత్తాపము చెంది, మారుమనస్సు పొందే పాపిని ఆయన క్షమిస్తారు. నూతన జీవితాన్ని ప్రసాదిస్తారు.

ఈ సన్నివేశాన్నుండి, మనము నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది
1. ప్రభువును నిందించేవారు, ఆయనను దూషించేవారు, ఆయనను పరిహసించేవారు తప్పక ఒడిపోయెదరు.
2. ప్రభువు తప్పక క్షమిస్తారు. అయితే మనలో తప్పకుండ ఉండవలసినది పశ్చాత్తాపం, మారుమనస్సు. ఆ స్త్రీ పశ్చాత్తాపముతో చివరి వరకు ప్రభువు క్షమకొరకు వేచియున్నది కనుక, ఆమె ప్రభువు క్షమను పొందియున్నది. పుణ్య స్త్రీగా జీవించినది. ప్రభువు అందరిని క్షమిస్తారు. ఆమెను నిందించడానికి ఎంతోమంది వచ్చారు. అందరూ పాపాత్ములే. ఎప్పుడైతే ప్రభువు వంగి నేలమీద వ్రేలితో వ్రాయసాగెనో, ప్రభువు మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్లి పోయారు. వారి పాపాలను ప్రభువు బట్టబయలు చేసినను వారిలో ఒక్కరు కూడా పశ్చాత్తాప పడలేదు. ఆ పాప జీవితానికే తిరిగి వెళ్లి పోయారు. పశ్చాత్తాప పడియుంటే, ప్రభువు తప్పక వారిని క్షమించియుండేవారు, వారికి నూతన జీవితాన్ని ఒసగియుండేవారు. మనముకూడా మన పాపాలకు పశ్చాత్తాప పడదాం. క్షమించుటకు, నూతన జీవితాన్ని, హృదయాన్ని ఇచ్చుటకు ప్రభువు ఎప్పుడూ సిద్ధమే.
3. ఎవరిపై తీర్పు చేయరాదు. ఎందుకన, మనం అందరం పాపాత్ములమే (రోమీ 3:23). మరియు మనం ఖండించే వారి హృదయములో ఏముందో మనకు తెలియదు; వారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. నిజమైన తీర్పరి దేవుడు మాత్రేమే. ఇతరులు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది ప్రభువు సన్నిధిలో జీవించులాగ చేయగిలిగితే మనం నిజముగా అదృష్టవంతులమే! ప్రభువు మనలను ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం: "మనము ఆత్మపరిశీలనము కావించుకొనినచో, మనము దేవుని తీర్పునకు గురికాము" (1 కొరి 11:31).
4. వ్యభిచారం మహాపాపం. ఆ స్త్రీ ఏ పాపము చేయలేదని ప్రభువు శిక్షించలేదు. కాని, ఆమెలో పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను క్షమించారు. "ఇక పాపము చేయకుము" అని చెప్పి వ్యభిచారం పాపం అని చెప్పారు. శారీరక వాంఛలకు లోనుకాకూడదన్నదే పౌలు బోధనలలో కూడా చూస్తున్నాం. "పాపము యొక్క వేతనం మరణం, కాని, దేవుని కృపానుగ్రహము, మన ప్రభువగు క్రీస్తుయేసు నందు శాశ్వత జీవనము" (రోమీ 6:23).
5. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రభువుతో వ్యక్తిగత అనుభూతిని కలిగియుండుట మన జీవితాన్ని మారుస్తుంది. ప్రభువుతో ఒకసారి వ్యక్తిగత అనుభూతిని పొందినట్లయితే, మనం ఎప్పటికీ పాపములో ఉండము. క్రీస్తులో ఓ నూతన జీవితాన్ని జీవిస్తాం. దీనికి ఉదాహరణ, పునీత పౌలు మరియు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ. మనకుకూడా అలాంటి అనుభూతి ప్రభువుతో ఉండాలి. అప్పుడు మన జీవితాలలో నిజమైన మార్పును చవిచూస్తాం.

నాలుగవ తపస్కాల ఆదివారము, Year C

నాలుగవ తపస్కాల ఆదివారము, Year C
యెహోషువా 5: 9a, 10-12; 2 కొరింతు 5:17-21; లూకా 15:1-3, 11-32

తపస్కాలములోని నాలుగవ ఆదివారముతో, పాస్కా పండుగకు మనం మరింత చేరువయ్యాము. ఈ సమయములో, మనం మరింతగా దృష్టి సారించవలసినది, మన పాప జీవితానికి పశ్చాత్తాపపడి, పాస్కా పండుగకు సిద్ధపడటము.

బాప్తిసంద్వారా దైవపుత్రులముగా చేయబడినాము. మరియు క్రీస్తునిలో నూతన సృష్టిగా చేయబడినాము. దైవ బిడ్డలముగా, మన జీవితములో ఎల్లప్పుడూ నిజమైన ఆనందము కొరకు వెదకాలి. క్రీస్తు ఆనందానికి సూచిక. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమికి చేరుకొన్నప్పుడు, దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించారు. పౌలుగారు నిజమైన ఆనందం క్రీస్తులో పొందుతాము అని చెప్పియున్నారు.

నిజమైన వెలుగును, ఆనందాన్ని పొందాలంటే, ఈజిప్టులాంటి పాపదాస్యమునుండి బయటపడాలి. ఎర్రసముద్రములాంటి శోధనలను దాటాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆనందాన్ని పొందడానికి 40 సం,,లు పట్టింది. మనం ఈనాడు 40 రోజుల తపస్కాలములో ఉన్నాము. మనం ఎంతవరకు ఆ ఆనందానికి చేరువయ్యామో ఆలోచిద్దాం!

ఈనాటి సువిశేష పఠనములో "తప్పిపోయిన కుమారుని" కథను ప్రభువు చెప్పడం వింటున్నాము. దుడుకువాడైన చిన్నవాడు, ఈ లోకములో సంతోషాన్ని వెదకడం కోసం, తన ఆస్తిని తీసుకొని, తండ్రినుండి దూరముగా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ధనములో సంతోషం ఉంటుందని భావించాడు. తనను మోసం చేసిన స్నేహితుల దగ్గర ఆనందం ఉంటుందని భావించాడు. కాని, నిజమైన ఆనందం అతను ఎక్కడా పొందలేక పోయాడు.

మనము కూడా, అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. కుటుంబ సభ్యులకన్న, నిజమైన ఆనందము, ఆధ్యాత్మిక విషయాలకన్నా, మనకు వచ్చే ఆస్తిపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటాము. దాని కొరకై ఏమైనా చేయడానికి సిద్ధ పడుతూ ఉంటాము. మన చుట్టూ ఉన్న చెడు పరిస్థితులను, చెడు స్నేహాలను గమనింపక, వాటిలో నాశనమై పోవు చున్నాము.

ఈ కథలో, ఒక తండ్రి, మన పరలోక తండ్రి ప్రేమను చూస్తున్నాము. లోక వ్యామోహాలలో, పాపములో పడిన తన బిడ్డలు మారుమనస్సు పొంది, తిరిగి తన చెంతకు రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు, మన గతాన్ని గాని, మన పాప జీవితాన్ని గాని ప్రశ్నింపక, మనలో ఉన్న మారు మనస్సు, పశ్చాత్తాప హృదయాన్ని మాత్రమే చూసి, తన హక్కున చేర్చుకొనే తండ్రిని, మరియు తిరిగి తన కుటుంబములో పూర్వ వైభవాన్ని ఒసగడానికి చేతులు చాచి, ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తున్నాము. ఇలాంటి గొప్ప, అనంతమైన ప్రేమ కలిగిన తండ్రి ఒడిలో ఒదిగిపోవడానికి ఈ తపస్కాలం మంచి సమయం.

మనం చేయవలసినదల్లా, దుడుకు చిన్నవానివలె, తండ్రికి, కుటుంబాలకు దూరమై, బిజీ బిజీగా ఉన్న మనం, ఎన్నో సమస్యలతో ఉన్న మనం, ఒక్కసారి ఆగి, ఆత్మ పరిశీలన చేసికొందాం. ఎందుకు నా జీవితం ఇలా ఉన్నది? ఎందుకు నాలో ఆధ్యాత్మిక లేమితనం? మనం అందరం పాపాత్ములమే. మనలో పశ్చాత్తాపం కలగాలి. అప్పుడే, తండ్రి యొద్దకు చేరుకోగలం.

ఈ కథలో, నాకు నచ్చినది, తండ్రి తన పెద్ద కుమారునితో చెప్పిన మాట: "నాకున్నదంతయు నీదే కదా". మనతో కూడా ప్రభువు ఈ మాటను అంటున్నారు. ఏవిధముగానైతే, తండ్రి బయటకు వచ్చి, చిన్న కుమారుని ఆహ్వానించాడో, అదేవిధముగా, పెద్ద కుమారుడు అలిగినప్పుడు కూడా, తండ్రి బయటకు వచ్చి ఆహ్వానించాడు, పండుగలో పాలుగొనమని పిలిచాడు. మన నిజమైన ఆనందం ఇదే: "నాకున్న దంతయు నీదే."

మనంకూడా, మన జీవితములో, ఇతరులు మనకన్న ఎక్కువ అనే భావనతో ఉంటాము. ఈ భావనతో, పెద్ద కుమారుని వలె, మనలో మనం భాదపడుతూ ఉంటాము. దేవుని దృష్టిలో అందరం సమానులమే. అందరం ఆయన సృష్టియే, అందరం ఆయన బిడ్డలెమే! మనమే, ఆస్తి, కులం, మతం, భాష, ప్రాంతం, రంగు మొ..గు వాటితో, ఎక్కువ, తక్కువ అనే భావనలతో జీవిస్తున్నాం! ఇది సరైనది కాదు! ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భావనతో జీవింపక, అందరినీ సమానత్వముతో గౌరవిస్తూ, మనలో ప్రేమించే శక్తిని బలపరచుటకు ప్రయత్నిద్దాం!

ప్రభువు, తప్పిపోయిన కుమారుని కథ ద్వారా, మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉన్నదని తెలియ జేస్తున్నారు. పాత జీవితాన్ని విడచి పెట్టి, క్రీస్తు అయిన క్రొత్త జీవితములోనికి వచ్చే గొప్ప అవకాశం ఉన్నది. ఎప్పుడైతే, దేవునివైపు మరలాలి అని అనుకొంటామో, అది దేవునికి మనపై ఉన్న ప్రేమను సూచిస్తుంది. ఎందుకంటే, మనలో ఎవరినీ కోల్పోవడం ఆయనకు ఇష్టం లేదు.

ఆయన మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన దరికి వచ్చిన మనలోని పాపాలను కడిగి వేస్తాడు. మారు మనస్సు-పశ్చాత్తాపం చెందుదాం. పాస్కా పరమ రహస్యాన్ని నిజమైన ఆనందముతో కొనియాడటానికి సంసిద్దులమవుదాం!

తపస్కాల మూడవ ఆదివారము, YEAR C

తపస్కాల మూడవ ఆదివారము, Year C 
పఠనములు: నిర్గమ 3:1-8అ,13-15; 1 కొరి 10:1-6,10-12; లూకా 13:1-9. 
పిలుపు - మలుపు ªహృదయ పరివర్తనము)
"హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" (లూకా 13:3, 5).

"ఆయన పిలుస్తాడు
పిలుపుతో మలుస్తాడు
మరలిన వారికి బయలు పరుస్తాడు
వారు ప్రతీ అడుగులో బలపరుస్తాడు."

తపస్కాలములోని 3 వ ఆదివారమున ప్రభువు మనకు ఇచ్చు సందేశమిదే!

ఈనాటి మొదటి పఠనమునందు ప్రభువు మోషేను తన పనికొరకు, తన ప్రజలకొరకు, వారి విముక్తికొరకు ఎన్నుకొంటున్నారు. మోషే యొక్క బలహీనతలను తెలిసికూడా అతనిని తన పనికొరకు ఎన్నుకొంటున్నారు. బలహీనుడైన మోషేను, బలపరచి తన ప్రజల యొద్దకు పంపుతున్నారు. ఎందుకంటే, బలహీనుడైన అతడే తన ప్రజల బలహీనతలను బాగా అర్ధం చేసుకోగలడని ప్రభువు యొక్క నమ్మకం. పిలచిన అతన్ని మలస్తున్నారు, తన సేవకుడిగా మార్చుకొంటున్నారు. అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. "బలహీన సమయమందు బలపరచుటకు నేనున్నాను" అని ధైర్యమును నూరి పోస్తున్నారు. అందుకే, తనను తాను ఉన్నవాడుగా బయలు పరచుకొంటున్నారు. అందుకే, "నా ప్రజల బాధను చూచాను, వారి ఆక్రందనను విన్నాను, వారు వేదనను తెలుసుకొన్నాను" అని పలుకుతున్నారు.

బాధలలో ఉన్న తన ప్రజలకు ప్రేమతో స్నేహాస్తాన్ని అందిస్తున్నారు. మోషే ద్వారా, వారిని తిరిగి తన అక్కున చేర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నారు. 'పెక్కు విధములుగా, పెక్కు మార్లు' (హెబ్రీ 1:1) తన జనులు తనతో ఉండాలని ఆశించి, వారిని పిలుస్తున్నారు.

రెండవ పఠనము, ప్రభువుయొక్క పిలుపును, ఆ పిలుపును పెడచెవిన పెడితే జరిగే ఫలితం తెలియజేయబడినది. రెండవ పఠనములో పౌలుగారు కొరింతు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇశ్రాయేలీయులలోని కొందరిని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వారు ప్రభువు నీడలో రక్షణను అనుభవించారు. ఎర్ర సముద్రమును ప్రభువు అండతో, మహిమతో దాటారు. నమ్మశక్యం కానివిధముగా, శిలనుండి నీటిని త్రాగారు. ప్రేమతో ప్రభువు చేసిన ఇన్ని అద్భుత కార్యములను చూసికూడా, వారు తమ మనసులను, మార్గములను మార్చుకోలేదు. వారి హృదయ కాఠిన్యమును చూచి ప్రభువు సంతోషించలేదు. అందుకే వారి ప్రేతములు ఎడారినందు చెల్లాచెదరయ్యాయి (1 కొరి 10:5). 

ఇదే సందేశాన్ని ప్రభువు సువార్త పఠనములో తిరిగి వక్కాణిస్తున్నారు: "హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" (లూకా 13:3, 5). హృదయ పరివర్తనం అనే ఫలంకొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. మనలనుండి ఆయన ఆశిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారు అంజూరపు చెట్టువలె తీసుకొనే వారిగా మాత్రమే ఉన్నారు తప్ప ఇచ్చే వారిగా మారలేదు.  అంజూరపు చెట్టుకు తోటమాలి పాదుచేసి, ఎరువువేసి నీళ్లు పోసాడు. అయినను మూడేండ్లనుండి ఎటువంటి ఫలాలను ఇవ్వలేదు. అందుకు ఆ యజమాని ఆ చెట్టును నరికి పారవేయమన్నాడు. నాశనం చేయమన్నాడు. కానీ తోటమాలి మరొక్క ఏడు చూద్దామని, ఓపిక పట్టమని చెప్పాడు. మనం కూడా అంజూరపు చెట్టువలె మన జీవితం, ప్రవర్తన ద్వారా ఎలాంటి ఫలాలను దేవునికి ఇవ్వకపోతే, దేవుడు మనలను కూడా నరికి పారవేస్తాడు. అయితే, ఫలించడానికి మనకు కావలసినంత సమయాన్ని ఇస్తారు. ఆయన దయగలవారు. కనుక, మనం హృదయ పరివర్తనం చెందాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. శ్రీసభ నాయకులు తోటమాలి వలె, తోటయైన శ్రీసభను సంరక్షించాలి, కాపాడాలి. వారి ఆధ్యాత్మిక పోషణకై సర్వత్రా కృషి చేయాలి. అవసరమైతే, దేవుని ఓపిక కొరకు, దయ, కరుణ కొరకు ప్రాధేయ పడాలి.

మనం ఎలా ఉన్నాము? ఒకసారి హృదయపు లోతులలో పరిశీలించుకొందాం! ఇచ్చే వారిగా, ఫలించే వారిగా ఉన్నామా? లేదా పొందే వారిగా మాత్రమే ఉన్నామా? మన మార్పు కొరకు, హృదయ పరివర్తన కొరకు ప్రభువు ఎదురు చూస్తున్నారు. మోడుపోయిన అంజూరపు చెట్టువలె మన జీవితాలు ఉండకూడదు. ఫలించే అంజూరపు చెట్టువలె మన జీవితాలు ఉండాలి. ఫలించని అజూరపుచెట్టు దేవుని వాక్యాన్ని ఆలకించక పోవడాన్ని, ప్రజల అవిశ్వాసాన్ని సూచిస్తుంది. మన జీవితాలను, దేవుని వాక్కుతో పోషించాలి.

మనం సువార్త పఠనములో విన్నట్లుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, వాటిలో నశించువారు (పిలాతు సైన్యం గలిలీయ దేశీయులను చంపడం, సిలోయము బురుజు కూలి పదునెనిమిది మంది మరణించడం), లేదా నష్టపోయిన వారు పాపులా? కాదా? అని ఆలోచించడంమాని (ఇతరులపై తీర్పు చేయడం మాని), అవి మనకు ఎటువంటి సందేశాన్ని, మననుండి ఎటువంటి ప్రతిచర్యను, మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో తెలుసుకోవాలి. ఎటువంటి మార్పును ప్రభువు మననుండి కోరుతున్నారో తెలుసుకోవాలి (1 కొరి 10:11-12). 

ఎందుకంటే, ప్రభువు "ఎవరును వినాశనము కావలెనని కోరడు. అందరు పాపమునుండి విముఖులు కావలెనని ఆయన వాంఛ (2 పేతురు 3:9)." ఎవడు చనిపోవుట వలన ఆయన సంతోషించరు. పాపమునుండి వైదొలగి బ్రతుకుటయే ఆయన మననుండి ఆశించునది (యెహెజ్కెలు 18:32).

వైరసులు, ప్రకృతి విపత్తులు, రోగాలు... దేవుని నుండి వచ్చేవి కాదు. అవి మానవ తప్పిదాల వలన సంభవిస్తున్నాయని మనం గ్రహించాలి. ఎవరికైనా ఏదైనా విపత్తు జరిగితే, వారేదో పాపం చేశారని, అందుకే దేవుడు వారిని శిక్షించాడని అనుకోడం తప్పు. అటువంటి మూఢ నమ్మకాలను వదిలేయాలి.

మన మార్గాన్ని మార్చుకొని, తన వైపుకు మరలమని ప్రభువు మనలను పిలుస్తున్నారు. మలపుకోరే, ఆ పిలుపు సందేశం మనకు వినబడిందా? మనం తపఃకాలములో ఉన్నాము. ఇది పరివర్తన చెందు కాలం. దేవుడు మనకు తగిన సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకొను సమయం. మన తప్పులను మనం తెలుసుకొని సరిచేసుకొను సమయం. పాపాలకు పశ్చాత్తాప పడి, దేవుని వైపునకు మరలుదాం! దేవునితోను, తోటివారితోను సఖ్యత పడుదాం.