Friday, February 1, 2013

నాలుగవ సామాన్య ఆదివారము, YEAR C, 03 FEBRUARY 2013


నాలుగవ సామాన్య ఆదివారము, YEAR C, 03 FEBRUARY 2013
యిర్మియా 1:4-5, 17-19; 1 కొరిం 12:31-13:13; లూకా 4:21-30

ఈనాటి దైవార్చన ముఖ్యాంశం: దేవుడు మనలనందరిని వ్యక్తిగతముగా పిలుస్తున్నాడు.  ఈ పిలుపు ద్వారా, తన ప్రేమ సందేశాన్ని అందజేస్తున్నాడు. యోహాను సువార్తీకుడు ఇలా అంటున్నాడు: "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించిన ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవము పొందుటకై అట్లు చేసెను (3:16). ఈ ప్రేమ త్యాగపూరితమైనది మరియు సంరక్షణతో కూడినది. ఈ ప్రేమ ఇతరులను అంగీకరించుటకు, క్షమించుటకు, అర్ధం చేసికొనుటకు, ఓర్పు, ఓదార్పును కలిగియుండుటకు మనలను బలవంతులను చేయును. మన జీవితములో ఎదురయ్యే ప్రతీ ఛాలెంజ్ ను ఎదుర్కొనుటకు శక్తిని, ధైర్యమును ఒసగును. దేవుడు ప్రతీ ఒక్కరిని కాపాడును. అందుకే తననుతాను మనలకు ఇస్తున్నాడు. ఇదే దేవుని ప్రేమతో, ఈ లోకాన్నికూడా మనం బలపరచాలి, ప్రేమతో నింపాలి. అందకే దేవుడు మనలను ఈనాడు పిలుస్తున్నాడు.

ఈనాటి మొదటి పఠనములో చూస్తునట్లుగా, దేవుడు తన వాక్యముద్వారా, యిర్మియాను ప్రవక్తగా తన సేవకు పిలుచుకొంటున్నాడు. ఈ దైవ కార్యములో ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుందని, వాటిని ధైర్యముగా ఎదుర్కొన సిద్ధము కావలయునని యిర్మియాకు తెలియజేయడం జరిగింది. మాతృ గర్భమున రూపొందింపక మునుపే యిర్మియాను దేవుడు అభిషేకించాడు.దేవుని పిలుపులో ఎంతో ప్రేమ కనిపిస్తున్నది. దేవుడే మొదటి యత్నాన్ని చేస్తూ యిర్మియాను ప్రవక్తగా ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రవక్త దేవుని స్వరం. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, దేవుడు ఆజ్ఞా పించిన దాన్ని ప్రజలకు తెలియచేయాలి. పిలుపును విన్న యిర్మియా భయపడినప్పుడు, నేను బాలుడిని అని చెప్పినప్పుడు, "నేను నీకు తోడుగా ఉంది నిన్ను కాపాడుచుందును" అని తండ్రి దేవుడు చెప్పియున్నాడు. ప్రభువు చేయి చాచి, యిర్మియా నోటిని తాకి ఆయన పలుకులను యిర్మియా నోట పెట్టి యున్నాడు.

రెండవ పఠనములో పునీత పౌలు గారు ఆత్మ వరములు, వాని ప్రాముఖ్యతను గూర్చి తెలియ చేయుచున్నాడు. ఆత్మ వరములలో కెల్ల, ప్రేమ అన్నింటికన్నా ముఖ్యమైనదని చెప్పుచున్నాడు. ప్రేమ ఓ వరం. దేవుని ప్రేమ గొప్పది. అనంత మైనది. దేవుని ప్రేమ ప్రతీ ఒక్కరిపై అమితముగా ఉంటుంది. ప్రేమ లేనిచో మిగతా వరాలకు విలువ లేదని పౌలు గారు చెప్పుచున్నారు. ప్రేమ లేనిచోట అంతా శూన్యముగా ఉంటుంది. జ్ఞానము, విశ్వాసము ఉన్నను ప్రేమ లేనిచో వ్యర్ధమే! ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయకాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్ధ పరత్వము కాని, కోప స్వభావము కాని, ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు. సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును. సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది.

యేసు ఓ మెస్సయ్యగా, ప్రవక్తగా, దేవుని కుమారునిగా ఈ లోకమునకు వచ్చాడు. దేవుని స్వరమును, వాక్యమును ప్రజలకు అందించాడు. తండ్రి ప్రేమను చాటాడు. ఆయన మాటలను విన్న ప్రజలు మొదటగా ఆశ్చర్యచకితులైనారు... కొందరు విశ్వసించారు... కొందరు ద్వేషించారు. ఆయనను నాశనము చేయబూనారు.

మన పిలుపుకు యేసే ఆదర్శం. ఎన్ని కష్టాలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినను, తన తండ్రి చిత్తాన్ని ఈ లోకములో పరిపూర్ణముగా పూర్తి చేసారు. ప్రేమ లోకానికి నాంది పలికారు. తండ్రి దేవుడు మనకు ఇచ్చిన పిలుపును మనం ఈ లోకమున పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి బాధ్యతలను వారు గుర్తెరిగి నిర్వహించినప్పుడు, మన కుటుంబములో గాని, సమాజములో గాని, రాష్ట్రములోగాని, ఇన్ని అసమానతలు, నిరాశలు, చావులు, అక్రమాలు, హింసలు, హత్యాచారాలు ఉండవు. ప్రతీ పిలుపులో ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమ లేనప్పుడు, ఎన్ని అధికారాలు ఉన్న, ఎన్ని ప్రణాలికలు ఉన్న, ఎంత డబ్బు ఉన్న, అంతా శూన్యమే, అంతా వ్యర్ధమే. ప్రేమతో జీవించుదాం, ఆ ప్రేమను లోకానికి పంచుదాం. మన సమాజములో ఉన్న చెడును నిర్మూలించాలంటే అది కేవలం ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది.

No comments:

Post a Comment