Friday, December 28, 2012

తిరు కుటుంబ పండుగ, Holy Family 30 డిశంబర్ 2012


తిరు కుటుంబ పండుగ, 30 డిశంబర్ 2012
సాముయేలు 1:20-22, 24-28; 1 యోహాను 3:1-2, 21-24; లూకా 2: 41-52

క్రీస్తు జయంతి పండుగ వెలుగులో, శ్రీసభ తిరు కుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు జననం ద్వారా, దేవుడు గొర్రెల కాపరులకు చీకటిలో ఒక చిహ్నాన్ని ఇచ్చి యున్నాడు. తన ఏకైక కుమారున్ని, ఈ ప్రపంచానికి వెలుగు చిహ్నముగా ప్రసాదించాడు. అయితే, ఈ కుమారుని కర్తవ్యం, తండ్రి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం.  ఈ పనిని యేసు ప్రభువు ఈ రోజు ప్రారంభిస్తున్నాడు.

లూకా సువార్తీకుడు మాత్రమే యేసు కుటుంబం గూర్చి చెప్పియున్నాడు. మనం ఈనాటి సువిషేశములో వింటున్నాము. ఈ సంఘటన ఒక చరిత్ర గట్టముగా మనం చెప్పు కోవచ్చు. ఈ సంఘటన క్రీస్తు ప్రభువులో దాగియున్న వ్యక్తిని గూర్చి తెలియ జేస్తుంది. అయితే, ఈ సంఘటన, క్రీస్తు జయంతి పండుగకు సంబంధించినది కాదు. ఇది పాస్కా పండుగ సందర్భములో చోటు చేసుకొన్నటువంటి ఘటన. మోషే ఆజ్ఞానుసారము, యూదా మతానికి చెందిన ప్రతి మగ బిడ్డ సం,,కి కనీసం మూడు సార్లు, యెరూషలేము దేవాలయాన్ని సందర్శించు కోవాలి. అది ఒక ఆచారము. యోసేపు ప్రతి సం,,ము ఈ యాత్రకు మరియమ్మతో వెళ్ళాడు. అయితే ఈ సారి మాత్రం తన కుమారుడైన యేసును కూడా వెంట తీసుకొని వెళ్ళాలి, ఎందుకన, యేసుకు 12 సం,,లు వచ్చాయి. మోషే ఆజ్ఞ ప్రకారం, 12 సం,,లు దాటిన ప్రతి మగ బిడ్డకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ కారణం చేత, యేసు, యోసేపు, మరియమ్మలు కుటుంబ సమేతముగా వెళ్ళారు.

సువిషేశములో వింటున్న విధముగా, బాలయేసు ఆయన తల్లి దండ్రులతో కలసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ జరిగే ప్రార్ధనలో పాల్గొన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. కాని పండుగ తరువాత, తన తల్లి దండ్రులతో తిరుగు ప్రయాణం కాలేదు. అక్కడే దేవాలయములో ఉండి పోయాడు. యోసేపు మరియమ్మలు ఎంతగానో కలవర పడ్డారు, ఆయన కోసం ఎంతగానో వెదికారు. చివరికి మూడవ రోజు, దేవాలయములో ఆయనను కనుగొన్నారు. ఈ మూడు రోజులు కూడా ఆయన మరణ పునరుత్థానములను సూచిస్తుంది. యేసు సిలువపై మరణించి, సమాధి చేయబడి, మూడవ దినమున ఉత్థానం అయ్యాడు. కనుక, బాల యేసు తప్పిపోయిన మూడు రోజులను కూడా ఆయన జీవితములో రాబోయే సంఘటనలను సూచిస్తుంది.

బాల యేసును దేవాలయములో చూడగానే, మరియమ్మ, "కుమారా! ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి" (లూకా 2:48) అని ప్రశ్నించినది. అందుకు యేసు, "మీరు నాకొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా? (లూకా 2:49) అని సమాధానం ఇస్తూ తను వచ్చిన దైవ కార్యము గూర్చి తన తల్లి దండ్రులకు తెలియ జేసి యున్నాడు. గబ్రియేలు దూత మరియమ్మతో, యేసు ఈలోకానికి ఎందులకు వస్తున్నాడో ముందుగానే తెలియజేయడం జరిగింది, " ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరి పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" (లూకా 1:33). అదే విధముగా, కలలో దూత యోసేపుతో, "ఏలయన, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును" (మత్త 1:21). అయితే ఈ రోజు దేవాలయములో, యేసు స్వయముగా తన గూర్చి, తన దైవ కార్యము గురించి తెలియ జేస్తున్నాడు.

యేసు ఈ లోకములో తన తల్లి దండ్రులకు విధేయుడై జీవించాడు. వారి అడుగు జాడలలో నడిచాడు. ఆయన యోసేపు మరియమ్మ ల కుమారుడుగా గుర్తించ బడ్డాడు. అయితే ఆయన దేవుని కుమారుడుకూడా! ఆయన నిజ దేవుడు. ఈ నాడు, యేసు మాటల ద్వారా తండ్రి దేవుడు సంకల్పించిన కార్యాన్ని కొనసాగించాలని యోసేపు మరియమ్మలు గుర్తించారు. రక్షణ కార్యములో వారి సహకారం కొనసాగాలని గుర్తించారు. మనము కూడా ఈ రక్షణ కార్యములో సహకరించాలి. మరియ యోసేపులు మన ఆదర్శం!

మన సహకారం లేకుండా మనలను సృష్టించిన దేవుడు, మన సహకారం లేకుండా మనలను రక్షించలేడు. మన రక్షణ నిమిత్తమై తండ్రి దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు. ఈ రక్షణ కార్యములో మరియ యోసేపులు పాలు పంచుకొన్నారు. వారి ఆదర్శాన్ని మనము పాటించాలి. అందుకే ప్రభువు మరియను మనందరికీ ఆధ్యాత్మిక తల్లిగా ఒసగాడు. మన కొరకు ఒక తల్లిగా తండ్రి దేవునికి ప్రార్ధన చేస్తుంది.

తిరు కుటుంబం, మనకు ముఖ్యముగా మూడు విషయాలను భోధిస్తుంది:
1. ప్రతీ విశ్వాసి, క్రీస్తు రక్షణలో భాగస్తులు కావాలి. ఆయన కార్యాన్ని ఈ లోకములో కొనసాగించాలి. దానిని కాపాడాలి. క్రీస్తు విశ్వాసాన్ని పొంది, దానిని ఇతరులతో పంచు కోవాలి, ఆయన రక్షణలో పాల్గొనే విధముగా చూడాలి. ఇది మన భాద్యత, కర్తవ్యం!
2. ఈ రక్షణ కార్యములో తిరు కుటుంబం, మనకు ఆదర్శముగా నిలుస్తుంది. ప్రతీ కుటుంబములో, సంతోషాలు, కష్టాలు, భాదలు, సహజం.తిరు కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించారు. అయితే, ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రార్ధనలో గడిపారు. వారి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. మనం కష్టములో ఉన్నప్పుడు, తిరు కుటుంబాన్ని ఆదర్శముగా తీసుకొందాం. అదే స్పూర్తితో, ప్రార్ధనలో, విశ్వాసములొ ముందుకు సాగుదాం.
3. "నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా?" ఈ లోకములో తండ్రి పని ఏమిటి? తన ప్రేమను, వాక్కును, రక్షణము, శాంతిని స్థాపించడం. తిరు కుటుంబం ప్రేమలో జీవించింది. దేవుని వాక్యాన్ని విని ధ్యానించింది. ఆ వాక్కు ద్వారా జీవాన్ని, శాంతిని పొందింది.

ఈనాడు శాంతి లేక, మనస్పర్ధలతో ముక్కలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తిరు కుటుంబ ఆదర్శముగా, ఆ కుటుంబాలన్నీ ఒకటి కావాలని, తిరిగి ప్రేమలో, శాంతితో జీవించాలని ప్రార్ధన చేద్దాం! ఒకరి నొకరు అర్ధం చేసుకోవాలని, ఒకరి నొకరు మన స్పూర్తిగా అంగీకరించాలని ఆ తిరు కుటుంబాన్ని వేడు కొందాం!
Fr. Inna Reddy OFM Cap
Swtzerland

మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవము, నూతన సంవత్సరము 2013, Mother of God, New Year


మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవము, నూతన సంవత్సరము 2013
1  జనవరి 2013
పఠనములు:  సంఖ్యా కాండము 6:22-27, గలతీ 4:4-7, లూకా 2:16-21

ఈ రోజు మనం మరియమ్మగారి దివ్యమాతృత్వ పండుగను కొనియాడుచున్నాము.  కన్యక అయిన మరియ దేవుని తల్లి (Theotokos). Theotokos గ్రీకు భాషలో దేవుణ్ణి మోసేవారు లేక దేవునికి జన్మనిచ్చేవారు అని అర్ధము.  431 వ సం,,లో ''ఎఫెసుస్ కౌన్సిల్'' నందు మరియ దేవునితల్లి అని అధికారికముగా ప్రకటించబడియున్నారు.  ఎందుకన, ఆమె కుమారుడు యేసుక్రీస్తు, దేవుడు - మానవుడు, మరియు దైవ స్వభావమును - మానవ స్వభావమును కలిగియున్న ఒకే వ్యక్తి కనుక. ఈ పరమరహస్యాన్ని ధ్యానిస్తూ మరో నూతన సం,,రమును ఆరంభిస్తున్నాము.  మరియ దేవునితల్లి, మరియు మనందరికీ తల్లి కూడా. మరియతల్లిపై భక్తి విశ్వాసాలను పెంపొందిచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

దేవునితల్లియైన మరియమ్మకు మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవదూత అందించిన సందేశానికి వినయ పూర్వక హృదయముతో 'అవును' అని చెప్పుటవలన, మనకి జీవితాన్ని, రక్షణను తన గర్భములోని శిశువుద్వారా తీసికొని వచ్చింది. ఈ రక్షణకార్యమునకై దేవుడు మరియమ్మను ప్రత్యేకవిధముగా, జన్మపాపరిహితగా ఎన్నుకొన్నాడు.  ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు చెబుతున్నట్లు కాలము పరిపక్వమైనప్పుడు దేవుని కుమారున్ని మోయుటకు, దేవునికి తల్లిగా మారుటకు ఆమెను ఎన్నుకొని యున్నాడు (గలతీ 4:4). 

గతమున దేవుడు తనప్రజలతో, ప్రవక్తలద్వారా మాట్లాడియున్నాడు (హెబ్రీ 2). తన యాజకులద్వారా దేవుడు తనప్రజలను దీవించియున్నాడు.  ఈనాటి మొదటిపఠనములో, యాజకులైన ఆహారోను, అతని పుత్రులు ఏవిధముగా ప్రజలపై దీవెనలు పలుకవలెనో యావే మోషేకు తెలియజేసియున్నాడు (సంఖ్యా కాం. 6:22-27). కాని, ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపియున్నాడు.  ఆయన రాజ్యమును, మహిమను తన కుమారునిద్వారా బయలుపరచియున్నాడు.  మరియు సకలమానవాళికి తన రక్షణప్రణాళికను  ఎరుకపరచియున్నాడు. (చదువుము యో 14:8-9).

యేసు, సృష్టి ఆరంభమునుండి ఎన్నుకొనిన, నడిపింపబడిన దేవుని ప్రజలనుండి ఉద్భవించినవాడు. సువిశేష పఠనములో విన్నవిధముగా (లూకా 2:21) శిశువుకు సున్నతి చేయడము ద్వారా (ఆ.కాం. 17:1-14) అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడికకు వారసుడు. మనము క్రీస్తునందు జ్ఞానస్నానము పొందుట ద్వారా దేవునికి దత్తపుత్రులుగా మారియున్నాము (కొలస్సీ 2:11; ఫిలిప్పీ 3:3). దేవుని బిడ్డలముగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములకు (ఆ.కాం. 12:3; 22:18) మనమును వారసులమగుచున్నాము (గలతీ 3:14).  యాజకుడైన ఆహారోను ఈ దీవేనలనే దైవప్రజలపై అందించియున్నాడు.  ఈనాడు ఈ దీవెనలను మనముకూడా మరియతల్లిద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా పొందుచున్నాము. ఈ గొప్ప ఆనందదాయకమైన శుభసందేశమే, దేవదూత ద్వారా గొల్లలకు తెలియజేయడమైనది (లూక 2:10).

యేసు బెత్లేహేములో జన్మించాడు.  యోసేపు, మరియమ్మలకుతప్ప ఆ విషయం ఎవరికినీ తెలియదు.  కాని, వేగముగా గొల్లలకు ఆ శుభసందేశం, లోకరక్షకుని జననపరమరహస్యం తెలియజేయడమైనది.  దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమై '' మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తుప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి  పశువులతొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు (లూక 2:10-12). దేవుడు తెలియజేసిన ఆ పరమరహస్యాన్ని గాంచుటకు గొల్లలు వెమ్మటే బెత్లేహేమునకు వెళ్ళిరి. అక్కడ పశువులకొట్టములో మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి.

గొల్లలవలె మనముకూడా వేగముగా మరియ యోసేపులతో యేసును కనుగొనుటకు త్వరపడుదాం. గొల్లలు తాము వినినవానిని, చూచినవానిని గురించి దేవునివైభవమును శ్లాఘించిరి (లూ 2:20). దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దీవెనలకి మనముకూడా ఆయనను మహిమపరచుదాం.  మరియతల్లివలె, దేవునివాక్యమును మనస్సున పదిలపరచుకొని ధ్యానించాలి.  క్రీస్తుసందేశము మనహృదయాలలో సమృద్ధిగాఉండాలి (కొలస్సీ 3:16).  అప్పుడే దేవదూతవలె, గొల్లలవలె, జ్ఞానులవలె మనుమును ఈ గొప్ప సందేశాన్ని, దీవెనని , పరమరహస్యాన్ని ఇతరులకు ఇవ్వగలం.

దేవుడు మనకి ఒసగిన మరో గొప్ప వరం 'మరో నూతన సంవత్సరం'. 2013 వ సం,,న్ని ఒక గొప్ప నమ్మకము, ఆశతో చూద్దాం.  మన సమాజములో అభివృద్దితో పాటు, చెడుకూడా పెరుగుతూ ఉంది.  భయము, ఆధ్యాత్మికలేమి పెరగుతూ ఉన్నాయి.  స్వార్ధము రోజురోజుకి పెరుగుతుంది.  రాజకీయఅంధకారం, పేద-ధనిక భేదం, వ్యభిచారం, రాష్ట్ర విభజన, మాదక ద్రవ్యాలు, కుల వర్గ భేదాలు మొ,,గు సమస్యలతో సతమతమగుచున్నాము.  ఇలాంటి పరిస్థితులలో గొప్ప ఆశగల నమ్మకముతో ముందుకు సాగాలి.  దేవునిపై ఆధార పడాలి.  ఆయన వైపు చూడాలి.  మన సమస్యలన్నింటికీ ఆయనే పరిష్కారం.  ఈ నమ్మకానికి గొప్ప ఆశ మన యువత.  సమాజానికి వారు ఎంతో అభివృద్ధిని తేగలరు. తల్లిదండ్రులు, భోదకులు, యువతపై దృష్టి సారించి విద్యావంతులను చేయడానికి కృషిచేయాలి. ప్రభుత్వము, మీడియా, సంస్థలు యువత అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే, పాశ్చాత్య దేశాలలో ఆర్ధికసమస్యలు ఉన్న సమయములో మన భారతదేశ ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడిఉంది. అయితే, అధికశాతం అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని మరచిపోరాదు. కొంతకాలముగా, వ్యవసాయదారులు ఎన్నోకష్టాలను ఎదుర్కొంటున్నారు. నూతన సంవత్సరములో వారి మంచికోసం ప్రార్ధన చేద్దాం.

అన్నింటికన్నా ఎక్కువగా, మనమందరం మంచి మానవతాసంబంధాలను కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్ధంచేసికొంటూ, సహాయం చేసికొంటూ ముందుకు సాగాలి. నిజమైన స్వేచ్చ, సత్యములను కనుగొని జీవించుదాము. న్యాయముతో, సామాజిక, నైతికవిలువలతో జీవించుదాము.  శాంతిస్థాపన మరో ముఖ్యఅంశం, ధ్యేయం.  ''శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలనబడుదురు (మ 5:9).

Thursday, December 20, 2012

ప్రభువు మనకోసం జన్మించెను, 25 December 2012


ప్రభువు మనకోసం జన్మించెను, క్రిస్మస్ 25 December 2012

ఈరోజు, ఒకజ్యోతి మనపై ప్రకాశించెను, ప్రభువు మనకోసం జన్మించెను. ఆయన, దేవునిమహిమయొక్క ప్రకాశవంతమైన జ్యోతి. తన శక్తివంతమైన ఆజ్ఞతో ఈ లోకం పోషింపబడుతున్నది.

క్రీస్తుజయంతియొక్కఅర్ధము ఏమిటి? ప్రాముక్యత ఏమిటి? మనసృష్టికర్త మనకి దూరములో లేడు, అతడు మనకు తెలువనంటివాడుకాదు అన్ననిజాన్ని ఎరిగి ఆనందముతో సంబరాన్ని చేసుకుంటున్నాము. దేవుడు మనకి అతిసమీపములోనే, మనచెంతనే ఉన్నాడు. ఎంతదగ్గర అంటే, ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఇప్పుడు, స్వతంత్రముతో, నమ్మ్మకముతో, దేవున్ని సమీపించవచ్చు. మనం ఆయనతో మాట్లాడవచ్చు. మన సమస్యలను ఆయనతో పంచుకోవచ్చు. ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మనకు సాధ్యమైనతీరులో ఆయనతో సంభాషించవచ్చు. దేవుడు ప్రేమించేతండ్రిగా, దయగలరక్షకునిగా, కరుణగలఆప్తునిగా బయలుపరచబడ్డాడు. దేవుడు మనలను తెరచినకరములతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే, మనం ఆయన దరికి వెళ్దాం.

ప్రభువా, మా హృదయాలను ప్రేమతో మీ కొరకు విశాలము చేయండి.  అమ్మ మరియవలె, ''అవును'' అని చెప్పుటకు మమ్ములను బలవంతులనుగా చేయండి.  ముఖ్యముగా, జీవితాలలో ప్రేమసుగుణాన్ని మరచిపోయినవారిని ఆశీర్వదించండి.  వారిని తాకండి. తద్వారా, ఈ క్రిస్మస్ రోజున వారుకూడా మిమ్ములను ఆహ్వానించెదరుగాక.  మీకు మాఅందరిపైఉన్న ప్రేమను నిజముచేయులాగున మమ్ములను చేయండి.

క్రిస్మస్ సందేశము

''మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్ప వరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోక రక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మన మధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్ప శుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను:

''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ,
భూలోకమున ఆయన అనుగ్రహమునకు
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14).

''మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి  '' (యెషయా 9:6). క్రీస్తు పూర్వం 8 వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియ దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగ గొట్టబడునని, భుజముల మీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్య భారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననం పట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనంకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం.

క్రీస్తు జన్మము ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయా 65:17; 2 పే 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు.

జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యో 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యో 1:11). మనమందరము ఆయనకు చెందినవారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ కి అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యో 1:12).

క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండి యున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండి ఉన్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్త పాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యేరుషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటువంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్య బాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించ గలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్య బాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభ మైనది, లేత మొక్క అంకురించియున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యము గూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు.

16 వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞాన వనరులను కల్గియున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరి జ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మిక లేమి, హృదయ శూన్యత సంతరించుకొంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది.

ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగులేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యో 1:9). వాక్కు మానవుడై నందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీ సభ పదే పదే భోదిస్తుంది.

ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొ,,గు దుష్ట శక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉంది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది ఒక్కటే: పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం.

క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకొన్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది.

రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999 వ సం,,రములో, త్రికాలజపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000 ల సం,,ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం,,ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి.

క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి మరియు దేవుని రక్షణ. ఆమెన్.

Wednesday, December 19, 2012

ఆగమనకాల నాలుగవ ఆదివారము, 23 డిశంబరు 2012


ఆగమనకాల నాలుగవ ఆదివారము, 23 డిశంబరు 2012
మీకా 5:1-4, హెబ్రీ 10:5-10, లూకా 1:39-44

ఓ ఆకాశములారా! మేఘములారా! మాకు రక్షకుని స్వర్గమునుండి పంపుడు. ఓ భూతలమా! తెరచుకొని రక్షకుని పంపుము.
ఈ రోజు నాలుగవ ఆగమన ఆదివారము. ఈ వారముతో క్రిస్మస్ పండుగకు మన ఆయత్తం ముగుస్తుంది. మన ప్రార్ధనలన్నీ కూడా "ఇమ్మానుయేలు" (దేవుడు మనతో ఉన్నాడు) అను అంశముపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన మనలో, మన శ్రమలో, మన జీవితములో ఒకనిగా, మనతో లోకాంత్యము వరకు ఉండటానికి మరియు ఆయన స్వభావాన్ని మనతో పంచుకొనడానికి ఆశించియున్నాడు. ఈనాటి పఠనాలు క్రిస్మస్ పండుగకు మనలను మరింత దగ్గరగా తీసుకొని వస్తున్నాయి. మూడు పఠనాలు, మూడు కోణాలలో ఈ పరమ రహస్యాన్ని మనకు అర్ధమయ్యేలా విశదపరుస్తున్నాయి. దేవుడు తన ప్రణాళికను, ఆయన ఎన్నుకొన్న వ్యక్తుల ద్వారా నెరవేర్చడం ద్వారా, సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాము. ప్రభుని రాక, ఇంత ముందుగానే సమస్త లోకానికి తెలియజేయడమైనది.

మొదటి పఠనము మీకా గ్రంథమునుండి వింటున్నాము. మీకా ప్రవక్త యిస్రాయెలు ప్రజలకు రాబోవు గొప్ప రాజు గూర్చి ప్రవచిస్తున్నారు. బెత్లెహేము నుండి యిస్రాయెలు పాలకుడు ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములో నరులెల్లరు అతని ప్రాభవమును అంగీకరింతురు. అయితే, ఆ రాజు ఎప్పుడు వచ్చునో పరలోక తండ్రి మాత్రమే ఎరిగియున్నాడు. రక్షకుడు వచ్చినప్పుడు, సమస్త లోకానికి శాంతిని ఒసగును. దైవ ప్రజలు పాప బానిసత్వము నుండి విడుదలై స్వతంత్రులుగా జీవించెదరు.

యేసుక్రీస్తు మనలో ఒకనిగా వచ్చిన ఆ పరమ రహస్యాన్ని, క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి మరియు ఆయన విధేయత వలన మాత్రమే సంపూర్ణముగా అర్ధము చేసుకోవచ్చని రెండవ పఠనము తెలియ జేస్తుంది. యేసు క్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక తండ్రి చిత్తాన్ని నేరవేర్చ ఆశించాడు. దేవుడు జంతు బలులను, అర్పణలను కోరలేదు. దహన బలులకు, పాప పరిహారార్ధమయిన అర్పణలకు ఇష్ట పడ లేదు. పాత బలులను అన్నింటిని తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు బలిని నియమించెను (హెబ్రీ 10:5-6,10). ఈ పరిశుద్ధ  కార్యానికి క్రీస్తు తనను తాను త్యజించి, తండ్రి దేవుని చిత్తానికి విధేయుడై, మన పాపపరిహారార్ధమై తనను తాను బలిగా అర్పించు కొనుటకు ఈ లోకములో జన్మించియున్నాడు. ఆయన జన్మము మనకు జీవమును, శాంతిని, సమాధానమును, స్వతంత్రమును ఒసగు చున్నది. మన జీవితము వెలుగులో ప్రకాశింప బడుచున్నది. క్రీస్తు బలి ద్వారా మనలను ఆయనలో ఐక్యము చేసి పవిత్రులనుగా చేసియున్నాడు.

"ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

సువిశేష పఠనము మరియమ్మ ఎలిశబెతమ్మను దర్శించిన సంఘటనను తెలియ జేస్తుంది. యేసు జనన సూచనను దూత ప్రకటించిన కొద్ది సమయములోనే మరియమ్మ ఎలిశబెతమ్మను సందర్శించింది. గబ్రియేలు దూతే ఈ సందర్శనను సూచించినది. "నీ బంధువు ఎలిశబెతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము" (లూకా 1:36). ఆ విషయము గ్రహించిన మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళినది.

మరియమ్మ పవిత్రాత్మ శక్తివలన అప్పుడే గర్భము ధరించినది. దైవ కుమారున్ని ఈ లోకానికి స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడినది. దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన భాద్యతను ఆమె గుర్తించినది. తన ద్వారానే లోక రక్షకుడు ఈ లోకానికి రావలసి యున్నదని గుర్తించి, దేవుని చిత్తాన్ని అంగీకరించినది. "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

మరియమ్మ జెకర్యా ఇంటిలో ప్రవేశించి  ఎలిశబెతమ్మకు వందన వచనము పలికింది. పవిత్రాత్మతో నింపబడి ఆ వందన వచనములను పలికింది. దైవ కుమారుడిని, లోక రక్షకుడిని గర్భము ధరించి నప్పటికిని, మరియమ్మ తనే స్వయముగా  ఎలిశబెతమ్మను సందర్శించినది. యేసు, ఈ లోకానికి సేవింపబడుటకుగాక, సేవ చేయడానికి వస్తున్నాడన్న విషయం స్పష్టముగా తెలుస్తుంది. సేవ ద్వారా ఈ లోకం ఆయనను ప్రభువుగా గుర్తిస్తుంది. ప్రభువు సన్నిధిలో, వందన వచనములు  ఎలిశబెతమ్మ చెవిన పడగానే, ఆమె గర్భ మందలి శిశువు (బప్తిస్మ యోహాను) గంతులు వేసెను.

క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో సంతోషము, ఆనందము తప్పక ఉంటాయి. క్రీస్తు మన హృదయములో నున్నప్పుడు, జన్మించినప్పుడు, మన హృదయాలు, మనస్సులు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రభువు మనతో ఉంటె, మనకు ఆశీర్వాదము, శాంతి సమాధానాలు ఉంటాయి.

పవిత్రాత్మ వరముతో,  ఎలిశబెతమ్మ గర్భములోనున్న శిశువు గంతులు వేయడమే గాక,  ఎలిశబెతమ్మ కూడా ఎలుగెత్తి ఇలా పలికింది: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింప బడెను". మరియమ్మ జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను, ధన్యతను పొందినది. దీనికి ముఖ్య కారణం, "ప్రభువు పల్కిన వాక్కులు నేరవేరునని మరియమ్మ విశ్వసించినది" (లూకా 1:45). మరియ ద్వారా ఈ లోకానికి వచ్చు ఆ శిశువు "యేసు" అను పేరు పొందును. మహనీయుడై, మహోన్నతుని  కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు, తండ్రియగు దావీదు సింహాసనమును పొందును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు (లూకా 1:31-33). గబ్రియేలు మరియమ్మతో పలికిన వాక్కులు.

ప్రభువు మనతో కూడా ఈనాడు మాట్లాడు చున్నాడు. ఆయన పలుకులు తప్పక వేరవేరుతాయని విశ్వసించుదాం. ఆ విశ్వాసము వలననే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మరియమ్మ తన జీవితాంతము దేవునికి విశ్వాసపాత్రురాలుగా జీవించినది. ఆమె విశ్వాసము వలననే, దేవుని ప్రణాళికకు, చిత్తానికి  "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెప్ప గలిగినది.

మన అనుదిన జీవితములో, ప్రభువు మనలో తన ఉనికిని గ్రహించుటకు అనేక ఆనవాళ్ళను ఇస్తూ ఉంటాడు. అనేక సంఘటనల ద్వారా, వ్యక్తుల ద్వారా, తన ఉనికిని చాటుతూ ఉంటాడు. జ్ఞానస్నానములోను, భద్రమైన అభ్యంగనమున పొందిన పవిత్రాత్మ, మనం విశ్వాస కన్నులతో చూచునట్లు సహాయం చేయును. దైవ రాజ్యమును స్వీకరించుటకు సిద్ధపడునట్లు చేయును.

క్రిస్మస్ దినమున, పభువును స్వీకరించుటకు ఆయత్త పడుదాం!

ఆద్యంత రహితులైన ఓ సర్వేశ్వరా! మా మనసులను మీ కృపతో నింపుడు. ఈ విధమున మీ దూత సందేశము ద్వారా, మీ కుమారుని మనుష్యావతార వార్తనందుకొనిన మాకు ఆయన సిలువ పాటుల ఫలితమున ఆయన పునరుత్థాన మహిమలో చేరు భాగ్యము లభించును గాక!

Monday, December 17, 2012

CHRISTMAS NOVENA

క్రిస్మస్ నవదిన ప్రార్ధనలు
మొదటి దినము: 16 డిశంబర్
దేవుని ప్రేమ ఆయన మనుష్యావతారమునందు బయలుపరచడమైనది.

ధ్యానాంశం:  ఆదాము తన అవిధేయతవలన ఏదేనుతోటనుండి గెంటివేయబడ్డాడు.  దేవుని అనుగ్రహమును కోల్పోయి ఉన్నాడు. మరియు, అతనిపై అతని సంతతిపై శాశ్వత మరణమను శిక్షను తీసుకొనివచ్చాడు. కాని, దైవకుమారుడు, ఇలా జీవితమును కోల్పోయిన మానవున్ని రక్షింపకోరాడు.  దీనినిమిత్తమై, మానవస్వభావమునుదాల్చి, శిలువపై దోషిగా నిందింపబడి, మరణవేదనను పొందియున్నాడు.  మన రక్షణనిమిత్తమై అన్నింటిని సంతోషముగా భరించియున్నాడు. ఆయన ప్రభువు అయినప్పటికిని, పాపమువలన మానవుడు పోగొట్టుకున్న జీవితము అను దైవానుగ్రహమును ఒసగుటకు మానవుని స్వభావమును ధరించడానికి నిర్ణయించుకున్నాడు.

ప్రార్ధన:  ఓ దైవ సుతుడా!  మానవుని చేత ప్రేమింపబడుటకు, మానవరూపమును దాల్చియున్నావు.  కాని, ఆ ప్రేమ ఎక్కడ? మా ఆత్మలను రక్షించుటకు, నీ రక్తమును చిందించియున్నావు. అయినప్పటికిని, మేము మిమ్ములను పరిపూర్ణముగా ప్రేమించలేక పోతున్నాము.  ప్రభువా! అందరికన్న ఎక్కువగా, నేను మిమ్ములను నొప్పించియున్నాను.  నా పాపములను క్షమించండి.  నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను.  నీ ప్రేమను నాకు ఒసగండి.
ఓ మరియమ్మా, దేవుని మాత, నా తల్లి, నా కొరకు మీ కుమారున్ని ప్రార్ధించండి.  తద్వారా, మీ దివ్యకుమారున్ని, ఎల్లప్పుడూ, నా మరణాంతము వరకు ప్రేమించే అనుగ్రహమును పొందుదునుగాక!  ఆమెన్. 
రెండవ దినము: 17 డిశంబరు
దైవ ప్రేమ దివ్యబాలుని జన్మము ద్వారా బయలు పరచడమైనది

ధ్యానాంశం: దైవ కుమారుడు మన కొరకు పవిత్రాత్మ శక్తివలన దివ్య బాలునిగా ఈ లోకమున జన్మించియున్నాడు.  ఆయన ఆదామును ఒక యువకునిగా చేసినట్లు తను కూడా ఒక యువకునివలె ఈలోకమున అవతరించియుండవచ్చు, కాని ప్రభువు మన అందరిలాగే పసికందై మరియ గర్భమున జన్మించియున్నాడు.  చిన్న బిడ్డలంటే, అందరికీ చాలా ఇష్టం మరియు ప్రేమ.  దేవుడు ఆ ప్రేమను పొందుటకు, ఆయనకు బయపడక ఉండుటకు, మరియు ఆ గొప్ప ప్రేమను మనదరికి నేర్పించుటకు తన మొదటి దర్శనాన్ని పసి బాలుడై జన్మించడాని పునీత పీటర్ క్రిసోలోగుస్ చెప్పియున్నారు.  దైవ కుమారుడు ఒక చిన్న బిడ్డవలె జన్మించునని యెషయ ప్రవక్త ఎన్నో సంవత్సరముల క్రితమే ప్రవచించియున్నాడు.

ఆ దివ్యబాలుడు రాజభవంతిలోగాక, వెముకలు కొరికే చలిలో, ఒక పశువుల గాటిలో, నిరుపేదత్వములో జన్మించుటకు నిర్ణయించుకున్నాడు.  నా దేవా, నా ప్రభువా!  నిన్ను ఈ స్థితికి తీసుకొని రావడానికి గల కారణమేమిటి?  'ప్రేమే' అని పునీత బెర్నార్డు గారు అంటున్నారు.  మనపై గల దేవుని ప్రేమే ఈలోకమున ఈ స్థితిలో జన్మించుటకు కారణమైయున్నది.

ప్రార్ధన: ఓ దివ్య బాలయేసువా! నీవు ఎవరికోసం ఈ లోకమునకు వచ్చియున్నావు?  నీవు ఈ లోకమున ఎవరి కోసం వెదకుచున్నావు?  అవును. నాకు తెలుసు.  నన్ను నరకమునుండి రక్షించుటకు, నా కోసం మరణించుటకు వచ్చియున్నావు.  తప్పిపోయిన గొర్రెయైయున్న నన్ను వెదకుటకు వచ్చియున్నావు.  తద్వారా,  నేను నీనుండి పారిపోక, నీ ప్రేమగల హస్తములలో సేద తీరెదనుగాక!  నా యేసువా!  నీవే నా సంపద, నా జీవితం, నా ప్రేమ, నా సర్వస్వం.  నిన్ను తప్ప నేనింక ఎవ్వరిని ప్రేమించగలను?  నీకన్న మిన్నగా ప్రేమించే స్నేహితుడు, తండ్రి నాకెక్కడ దొరకును?

ప్రియ తండ్రీ!  నేను మిమ్ము అధికముగా ప్రేమిస్తున్నాను.  నిన్ను ప్రేమించని క్షణాలకు మిక్కిలిగా చింతిస్తున్నాను.  నా ప్రియ రక్షకుడా!  హృదయపూర్వకముగా క్షమించుమని వేడుకొంటున్నాను. నన్ను క్షమించండి. మిమ్ములను ఎన్నటికిని విడువకుండునట్లు మరియు మిమ్ములను సదా ప్రేమించుటకును  మీ అనుగ్రహాన్ని దయచేయండి.  నన్ను నేను సంపూర్ణముగా మీకు అర్పించుకొనుచున్నాను.  నన్ను త్రోసివేయక, నీ హక్కున చేర్చుకొనండి.

మరియ, నిత్య సహాయమాతా!  మీ కుమారుని చిత్తమే నాకు జరుగునట్లు, మరణ సమయమువరకు ఓర్పును దయచేయమని నాకోసం ప్రార్ధించండి. 

Monday, December 10, 2012

ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C, 16 డిశంబర్ 2012, Third Sunday Advent


ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C, 16 డిశంబర్ 2012
పఠనాలు: జెఫన్యా 3:14-18, ఫిలిప్పీ 4:4-7, లూకా 3:10-18

ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను! ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు.

సంతసం

సంతోషంగా ఉండాలని అందరు కోరుకొంటారు
అందరు సంతోషంగా ఉండాలని కొందరు కోరుకొంటారు
తమ సంతోషం కొరకు, ఇతరుల సంతోషం కొరకు అం(కొం)దరు శ్రమిస్తారు.

ఆ సంతోషమునే ధ్యేయముగా, లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి పఠనాలు ప్రభోదిస్తున్నాయి: మారు మనస్సు, మరో మార్గం, మంచి మార్గం, మంచి జీవితం అని ఎడారిలో బోధిస్తున్న యోహాను యొక్క సందేశమును వినుటకు వచ్చిన వారు, యోహాను సందేశమునకు స్పందించి, ఆ సంతోష జీవితమును పొందుటకు "మేము ఏమి చేయవలెనను" అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను ఈనాటి ధ్యానంశముగా చేసుకొని, ఈ ప్రశ్నకు సమాధానమును సువార్తలోను మరియు మొదటి రెండు పఠనాలలోనూ చూద్దాం!

సంతోషమునకు కారణములెన్నో ఉన్నాయి (ఉంటాయి). ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్ధం చేసుకొనే వారున్నప్పుడు... ఇలా ఎన్నో!

మొదటి పఠనములో జెఫనయ ప్రవక్త ఇస్రాయేలీయులతో "ఆనందించండి, హర్ష ద్వానము చేయండి, నిండు హృదయముతో సంతసించండి." ఎందుకంటే, మీకు విధించబడిన తీర్పు, శిక్ష తొలగించబడినవి. మీ శత్రువును ప్రభువు చెల్లా చెదరు చేసెను. అన్నటికంటే ముఖ్యముగా "ప్రభువు మీ మధ్యనే ఉన్నారు." ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతో ఉన్నారు. అందుకే భయపడకుడి. దైవ భయం (భీతి) తప్ప మీలో ఏ భయం  ఉండకూడదు. నిర్భయముగా ఉండండి. మీ చేతులను వ్రేలాడ నీయకుము, (చేతులను వ్రేలాడనీయడం అనగా శక్తి లేక, బలము లేక పోరాడక చేస్తున్న పనిని వదిలి వేయడం). నీలో సత్తువ సన్నగిల్లినను, నీలో(తో) ఉన్న ప్రభువు నీచేత మంచి కార్యములు జరిగిస్తాడు. నీ సంతోషమును నీ ద్వారా ఇతరులకు సంతోషమును కలుగ జేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన నీ పైనే (నా పైనే) ప్రభువు అండగా ఉండి సంతోషమును కలుగ జేస్తారు.

అందుకే ఇశ్రాయేలు జనమా, యేరూషలేము నగరమా, సియోను కుమారి, సంతసించండి. సంతోషముగా ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయన మీ (నా) తో, మీ(నా)లో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మన (నా)తో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి. ఎవరులేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషముగా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలదా?

ఇదే సంతోషాన్ని పునీత పౌలుగారు కూడా ధృఢపరుస్తున్నారు. అనుభవపూర్వకముగా ఆయన మనకిస్తున్న సందేశమిది. క్రీస్తు సందేశమును భోధించినందుకు, ఖైదీగా ఉండి, శిక్ష (మరణ శిక్ష) విధించబడి, ఆ శిక్ష అమలుకొరకు ఎదురు చూస్తున్న పౌలు వ్రాసిన సందేశమిది. ఆయనలో విచారం లేదు, దు:ఖం లేదు, ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే, ఈ సమయములోనే ప్రభువు యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవముతో చెప్పిన (వ్రాసిన) సందేశమే. "ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి." ఎందుకంటే, ప్రభువుకు సాధ్యము కానిది ఏది లేదు (చూ. లూకా 1:37, యిర్మియా 32:27). ఆయన ఆధీనములో లేని పరిస్థితి ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యముగా ఎదుర్కొనండి. విచారించకండి. అది మిమ్ము, మీనుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి, కృతజ్ఞతతో కూడిన ప్రార్ధనతో దేవునికి దగ్గరగా రండు. ఆయన మీ (నీ)తో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానం, దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రముగా ఉంచుతుంది. ఇంతకంటే, ఇంకా ఏమి కావాలి సంతోషముగా ఉండటానికి?

అదే మాటను బాప్తిస్మ యోహానుగారు తనదైన శైలిలో సుంకరులతోను, రక్షక భటులతోను అంటున్నారు. వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహానుగారు చెప్పడం లేదు. దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటి వరకు వీరు "ఎంత ఎక్కువ ఇతరుల నుండి పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని" అనుకొన్నారు. దానికి భిన్నముగా యోహానుగారు నిజమైన సంతోషం 'ఇవ్వడములో'ఉన్నదని బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పొందాలని (ఎక్కువ పొందాలని) తమ వారినుండి దూరమయ్యారు. ఇప్పటినుండి ఇస్తూ, తమకున్న దాన్ని ఇతరులతో పంచుకొంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను (సన్నిధిని) అవసరం ఉన్న ప్రతీ సోదరిలోను, సోదరునిలోను గుర్తించి, అనుభవించండని పిలుపునిస్తున్నాడు.

మొదటి పఠన౦ : ఆయన మీ మధ్యన ఉన్నాడు
రెండవ పఠన౦ : ఆయన నాతో (లో) ఉన్నాడు.
సువార్త పఠన౦ : అవసరం ఉన్న ప్రతి సోదరి, సోదరునిలో ఆయన నీకై ఎదురు చూస్తున్నాడు.
వెళ్ళు! ముందుకెళ్ళు! ఆయనను, ఆయన సన్నిధిని గుర్తించు!
ఇవ్వు! నీకు సాధ్యమైనంత!
అనుభవించు ఆ సంతోషమును.
అదే క్రిస్మస్ నీకూ, నాకు.

త్రిలోక అధినేతవైన ఓ సర్వేశ్వరా! ఈ ప్రజలు రక్షకుని రాకకై ఉత్సాహముతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను, ఆ ఉత్సవములను ఎల్లప్పుడు గొప్ప వేడుకతో చేసికొనను, మాకు మీ కృపను ప్రసాదింపుడు.
  
Fr. John Antony Polisetty OFM Cap

Friday, December 7, 2012

Second Sunday Advent, ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C, 9 డిశంబర్ 2012


ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C, 9 డిశంబర్ 2012
బారూకు గ్రంధము 5:1-9; ఫిలిప్పీ 1:4-6,8-11; లూకా 3:1-6

సియోను వాసులారా! వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపజేయును.

ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బాప్తిస్మ యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త మరియు చివరి ప్రవక్త బాప్తిస్మ యోహాను. ప్రవక్తల మొదటి కర్తవ్యం, దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని మనసారా స్వీకరించి, దైవ ప్రజలకు అందించడం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి.

అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు, బాప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" అని ప్రవక్త పలికిన ఈ మాటల ద్వారా బాప్తిస్మ యోహాను దైవ ప్రజలను ప్రభువు మార్గములోనికి ఆహ్వానించి యున్నాడు. ప్రభువు రాక కోసం మార్గమును సిద్ధము చేయాలని కోరుతున్నాడు. యోహాను ప్రభువు రాక కోసం ప్రజలను సిద్ధము చేసాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గముల ద్వారా ప్రజలను సిద్ధము చేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపము గూర్చి ప్రకటించడం యోహానుగారి పాత్ర. మరియు ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.

Wednesday, December 5, 2012

Immaculate Conception of Mother Mary, నిష్కళంకోద్భవిమాత మహోత్సవము


నిష్కళంకోద్భవిమాత మహోత్సవము
డిశంబర్ 8

"సర్వేశ్వరుని యందు నేను ఆనందించి సంతోషించెదను. నా ఆత్మ నా దేవుని యందు ఆనందించుచున్నది. ఎందుకన, ఆయన నాకు రక్షణ వస్త్రములను తొడిగెను. ధర్మమునే   ఆభరణముగా చుట్టి పెండ్లి కుమార్తె తన భర్తకై తయారైన విధమున నన్ను తయారు చేసెను."

తల్లి తిరుసభ నిష్కళంకోద్భవిమాత మహోత్సవమును ప్రతీ దైవార్చన సం,,లో డిశంబర్ 8 న కొనియాడుచున్నది. "నిష్కళంకము" అనగా "పాపరహితము." ఈ మహోత్సవము ద్వారా మరియతల్లి  పాపరిహితముగా జన్మించినదని లేక జన్మపాపము లేక జన్మించినదను విశ్వాసమును కొనియాడుచున్నాము..

దశాబ్దాలనుండి కూడా శ్రీసభ, మరియ తల్లి దేవుని ద్వారా "అనుగ్రహ పరిపూర్ణురాలు" అని, ఆమె జన్మపాపము లేకుండా ఉద్భవించిన మాత అను విశ్వాసమును బోధిస్తున్నది. ఈ విశ్వాసాన్ని, అధికార పూర్వకముగా 9 వ భక్తినాధ పాపుగారు 8 డిశంబర్ 1854 వ సం,,లో ప్రకటించియున్నారు. "మిక్కిలిగా ఆశీర్వదింపబడిన పరిశుద్ధ కన్య మరియమ్మ, తను గర్భములో పడిన క్షణమునుండి, సర్వశక్తి మంతుడైన దేవుని ఏకైక అనుగ్రహము, ఆశీర్వాదము, అనుమతి వలన, లోక రక్షకుడైన యేసు క్రీస్తు నాధుని సుకృత పుణ్యముల ద్వారా, ఆదిపాపము అను మచ్చ నుండి ఆమె పరిశుద్ధముగా ఉంచబడియున్నది."

గబ్రియేలు దూత పలికిన "దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము" అను శుభ వచనములను మనము ప్రతీ రోజు జపిస్తున్నాము. గబ్రియేలు దూత వచనముల ద్వారా, దేవుని యొక్క పరమ రహస్యము పరిపూర్ణముగా, నిండుగా మరియమ్మపై ఉన్నదని విదితమగు చున్నది.

St. Ambrose, పునీత అంబ్రోసు - పీఠాధిపతి, వేద పండితుడు


పునీత అంబ్రోసు - పీఠాధిపతి, వేద పండితుడు (330 - 4 ఏప్రిల్ 397)
నిర్భంద స్మరణ, డిశంబర్ 7

"ఈ పుణ్య పురుషుని నిష్కపట ప్రేమ కారణమున ప్రభువు వీరినెన్నుకొనెను. వీరికి నిత్య మహిమ ప్రసాదించెను. వీరి సందేశ కాంతి వలన శ్రీసభ మెరయుచున్నది."

అంబ్రోసు కతోలిక కుటుంబములో జన్మించాడు. తండ్రి అవురేలియుస్ అంబ్రోసు. తల్లి జ్ఞానవంతురాలు మరియు భక్తి పరురాలు. తండ్రి మరణానంతరం, రోము నగరములో విద్యను అభ్యసించాడు. అతను వివాహరహితుడు.

అంబ్రోసు, 33 వ ఏటనే, తన జీవితములో న్యాయవాదిగా, మిలాను (ఇటలీ దేశం) గవర్నరుగా, చక్రవర్తికి మంచి స్నేహితునిగా ఎన్నో విజయాలను చవిచూసాడు.

374 వ సం,,ర కాలములో, ఎన్నో భిన్నమతాభిప్రాయాలు ప్రబలిపోతూ ఉండేవి. ముఖ్యముగా, "క్రీస్తు దైవత్వము" గూర్చి అనేక భిన్నాభిప్రాయాలతో ఉన్నవారు (ఏరియన్లు) కతోలిక చర్చికి సవాలుగా ఉండెడివారు. వీరు చర్చిని వినాశనము చేయబూనియున్నారు. అలాంటి సమయములోనే మిలాను పీఠాధిపతి మరణించారు. ఆయన ఏరియన్ల అభిప్రాయాలను ఏకీభవించాడు. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏరియనా? లేక కతోలికుడా? ఇరు వర్గాలవారు కధిద్రల్ లో సమావేశమయ్యారు. వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. మిలాను గవర్నరుగా అంబ్రోసు అక్కడికి రావడం జరిగింది. ఉద్వేగభరితమైన ప్రసంగముతో ఇరు వర్గాల వారిని శాంతింప జేశాడు. కలహాలు లేకుండా  పీఠాధిపతిని ఎన్నుకొనవలసినదిగా వారిని ఆజ్ఞాపించాడు.

Tuesday, December 4, 2012

Blessed Devasahayam Pillai, ధన్యజీవి దేవసహాయం పిళ్ళై, వేదసాక్షి


ధన్యజీవి దేవసహాయం పిళ్ళై, వేదసాక్షి
(1712 - 1752)
దేవసహాయం పిళ్ళై (అసలు పేరు నీలకండ) 23 ఏప్రిల్ 1712 వ సం,,లో ప్రస్తుత నాగర్కోయిల జిల్లా, తమిళనాడు, నట్టాలం (Nattalam) అను గ్రామములో వాసుదేవన్ నంబూదిరి, దేవకి అమ్మ దంపతులకు జన్మించాడు. వారిది సుసంపన్నమైయిన నాయర్ కులమునకు చెందిన కుటుంబము. తండ్రి ప్రస్తుత కేరళ రాష్ట్రములోని కాయంకుళం మరియు తల్లి కన్యాకుమారి జిల్లాలోని తిరువత్తర్ వాస్తవ్యులు. తండ్రి శ్రీ ఆది కేశవ పెరుమాళ్ దేవాలయములో పూజారిగా పనిచేసియున్నాడు. ఆనాటి నాయర్ కుటుంబ ఆచారాల ప్రకారం, పిళ్ళై తన మేనమామ దగ్గర పెరిగి, హిందూ విశ్వాస ఆచారాలను నేర్చుకొనియున్నాడు.

దేవసహాయం వారి కుటుంబానికి, ట్రావన్కోర్ (Travancore) మహా రాజైన మార్తాండవర్మ రాజకొలువులో ఎంతో పలుకుబడి ఉన్నది. అందుకే, యువకునిగానే, దేవసహాయం పిళ్ళై రాజకొలువులో సేవకై వెళ్లియున్నాడు. అతని శక్తి సామర్ధ్యాలు, ఉత్సాహాన్ని చూసి,  ట్రావన్కోర్ మంత్రి అయిన రామయ్యన్ దలవ క్రింద రాజ వ్యవహారాల భాధ్యతలను అప్పజెప్పియున్నారు.

క్రైస్తవ మత విశ్వాస స్వీకరణ

1741 వ సం,,లో డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ట్రావన్కోర్ ఆదీనములోనున్న కలచేల్ (Colachel) పోర్టును ఆక్రమించుకొని అక్కడ వర్తక వ్యాపారాలను స్థాపించుటకు, డచ్ నావికా కమాండర్ కెప్టెన్ యుస్తాకియుస్ ది లన్నోయ్ (Captain  Eustachius De Lannoy) ని పంపడం జరిగింది. డచ్-ట్రావన్కోర్ వైరి పక్షాల మధ్య జరిగిన యుద్ధములో (Battle of Colachal) డచ్ బలగాలు ఓడిపోయాయి. కెప్టెన్ యుస్తాకియుస్, అతని సహాయకుడు దొనాడి (Donadi) మరియు ఇతర డచ్ సైన్యాన్ని బంధించి చెరసాలలో వేయడం జరిగింది. ఆ తరువాత, ట్రావన్కోర్ సైన్యములో పనిచేయాలన్న షరతుతో వారిని క్షమించడం జరిగింది. తరువాతి కాలములో రాజు గారి నమ్మకాన్ని చవిచూసిన యుస్తాకియుస్ సాయుధ దళాల కమాండర్ గా ఎదిగి, ఎన్నో యుద్ధాలు గెలిచి, అనేక పొరుగు ప్రాంతాలను ట్రావన్కోర్ సామ్రాజ్యములో కలిపాడు.