Friday, November 30, 2012

రక్షకుని రాక నిరీక్షణ కాలము, YEAR C మొదటి ఆదివారము, 2 డిశంబరు 2012


రక్షకుని రాక నిరీక్షణ కాలము, YEAR C
మొదటి ఆదివారము, 2 డిశంబరు 2012
పఠనములు: యిర్మియా 33:14-16, భక్తి కీర్తన 25: 4-5, 8-9, 10, 14; 1 తెస్సలో 3:12-4:2; లూకా 2:25-28, 34-36
2 డిశంబర్ 2012 న నూతన దైవార్చన సం,,తో ఆగమన కాలాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ రోజున తిరుసభ ప్రభువును స్వీకరించుటకు సంసిద్దులమై ఉండాలని ఆహ్వానిస్తుంది.  ఆగమనం అనగా ఎదురుచూడటం. మనం ప్రేమించే వారికోసం ఎంతో ఆతురతతో, ఎంత సేపైనా ఎదురు చూస్తూ ఉంటాం. దైవార్చన సం..లో ఆగమనం అనగా సంతోషముతో, ఆనందముతో ఎదురు చూడటం, ప్రేమతో ఎదురు చూడటం. ఇక్కడ మనం యేసు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన కొరకు ఆతురతో ఎదురు చూస్తున్నాం. దేవుడు మానవునిగా వచ్చు మహా గొప్ప ఘటన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము.  ఆగమన కాలరములో ప్రభువు రాకను ముందుగానే గ్రహించి ఎదురు చూస్తున్నాము.

ప్రభువు రాకలో, మూడు అంశాలు ఉన్నాయి: మొదటిగా, గతములో, 2000 సం,,ల క్రితం లోకం ఎదురు చూసిన యేసు జన్మము కొరకు ఎదురు చూడటము. రెండదిగా, ప్రస్తుతం మన అనుదిన జీవితములో ప్రభువును స్వీకరించుటకు సంసిద్దులమవటము.  వాక్కుయందు, దివ్య సంస్కారముయందు ఆయనను మనం స్వీకరిస్తున్నాము. మూడవదిగా, భవిష్యత్తులో, కాలాంతమున మహిమతో, లోక తీర్పునకు వచ్చు ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి, ఆగమనకాలములో క్రీస్తు మొదటి రాకడ గూర్చియేగాక, తన రెండవ రాకడ గూర్చి కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాము.

ప్రభువు కొరకు ఎదురు చూడటం - వాగ్ధానం, ప్రేమ, ఆయత్తం, జాగరూకత, ధ్యానం, ప్రార్ధన, క్రొత్త ఆరంభం మరియు సంపూర్ణములతో కూడియున్నది.

ఈనాటి మూడు పఠనమలు కూడా ఆగమన కాలములోని ఈ మూడు అంశాలపై మన దృష్టి సారించి సంసిద్ధుల మయ్యేలా చేస్తున్నాయి.

మొదటి పఠనములో, యిర్మియా ప్రవక్త, బలహీనమైన, అభద్రతలోనున్న ఇశ్రాయేలునకు దేవుని వాక్యాన్ని భోదిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకన, యిర్మియా ప్రవక్త ఎదుర్కొనిన రాజులు పశ్చాత్తాప పడటానికి నిరాకరించారు. వారు ఇశ్రాయేలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, భూలోక సంపదలో వారి భద్రతను చూసుకొన్నారు. ఇతర దేశాలతో ముఖ్యమైన ఒప్పందాలను ఏర్పాటు చేసుకొన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేయబడిన వినాశానమును గూర్చి హెచ్చరిస్తూనే, యిర్మియా ప్రవక్త ప్రకాశవంతమైన భవిష్యత్తు కొరకు ముందు చూపు చూస్తున్నాడు.

ఇలాంటి ముఖ్యమైన వాగ్దానానికి ఆధారం, దేవుడు గతములో చేసిన వాగ్దానాలకు కట్టుబడి యుండటం.  అబ్రహాము ఆయన సంతతితో, వారిని ఆశీర్వ దిస్తానని, వారు ఆకాశములోని నక్షత్రములవలె, సముద్ర తీరమున౦దలి ఇసుకరేణువులవలె సంతతిని విస్తరిల్ల జేస్తానని దేవుడు వాగ్దానం చేసాడు.  వారు శత్రు నగరములను వశము చేసి కొందురు (ఆది కాండము 22:17). ఆవిధముగా, సమస్త లోకము ఆశీర్వదింప బడును. ఇప్పుడు యిర్మియా ప్రవక్త ద్వారా, ప్రభువు ఇట్లనుచున్నాడు: "నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశమునుండి నీతిగల కొమ్మను చిగురింప చేయును. అతడు దేశమంతటను నీతిని, ధర్మమును పాటించును. ఆకాలమున యూదా రక్షణమును బడయును. యేరూశాలేము భద్రముగా నుండును" (33:14-16). ఆ భద్రతయే "ప్రభువు మనకు రక్షణము."

రెండవ పఠనము, పౌలు గారు తెస్సలోనీయులకు వ్రాసిన మొదటి లేఖలో, ప్రభువు రాక కొరకు ప్రజలు తమను తాము ఎలా సిద్ధపడాలో సలహాను ఇస్తున్నాడు. పౌలుగారు ప్రభువు రెండవ రాకడ గూర్చి ముందుగానే చూస్తున్నాడు. ప్రభువు రాకడ, సకల పరిశుద్దులతో మహా గొప్పగా ఉంటుంది. ప్రభువును స్వీకరించుటకు పౌలుగారు అందరిని ఆహ్వానిస్తున్నారు. ప్రభువు శిష్యులు, విశ్వాసులు బెత్లేహేములో ప్రభువు రాకడ (జన్మము) ను అంగీకరించి, ఇప్పుడు ప్రభువు రెండవ ఆగమనము కొరకు ఎదురు చూస్తున్నారు. ఇచ్చట ముఖ్య విషయం: వారు పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. దేవుని సంతోషపెట్టు జీవితాన్ని జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. వారి ప్రేమ స్నేహితులపై మాత్రమే గాక, శత్రువులపై కూడా ఉండాలి. ఎందుకన, వారుకూడా దేవుని బిడ్డలే, వారు కూడా దేవుని పోలికలో సృష్టింపబడ్డారు. పరిశుద్ధత విషయమై, నిందారహితులుగా జీవించాలి; దీనిని సాధించుటకు, పరిశుద్ధ పరచే పవిత్రాత్మతో కలసి నడవాలి. దేవుని సహవాసములో జీవిస్తూ, మరి ఎక్కువగా క్రీస్తువలే మారాలి. సంపూర్ణ విశ్వాసమున్నప్పుడే, ఇది సాధ్యం.

సువిశేష పఠనము, లోకంత్యము గూర్చి, మనుష్య కుమారుని పునరాగమనముగూర్చి, అప్రమత్తత గూర్చి తెలియ జేస్తుంది. లూకా 21 వ అధ్యాయం లోకాంత్యమునకు ముందు జరగబోవు సంఘటనల గూర్చి చర్చిస్తుంది. "అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘారూడుడై వచ్చుటను వారు చూచెదరు (21:27). ఈలోకములో మన జీవితం ఒక యాత్ర అని గుర్తుకు చేస్తుంది. ఈ భూలోకం మన చివరి గమ్యం కాదు. ఈ సంఘటనలు ప్రభువు రాకను గూర్చి మెలకువగా, సంసిద్దులుగా ఉండునట్లు చేస్తాయి. ప్రభువు మహిమయందు నిలబడుటకు కావలసిన శక్తి కొరకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్ధన చేయాలి. "ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చి పడును" (21:35) అని ప్రభువే చెప్పియున్నారు. ప్రభువు రాకడ తీర్పుతో ఉంటుంది. కనుక, పశ్చాత్తాపములో, సేవలో జీవించాలి.

ప్రతీ దైవార్చన సం,,ర ఆరంభమున ఆగమన కాలాన్ని కొనియాడుచున్నాము. అయితే, ఆగమన కాల చివరిలో మన జీవితాలను పరిశీలిస్తే, అంత మామూలుగా ఉన్నట్లే, ఎదో ఒక నియమిత చర్యగా, వాడుకగా (రొటీన్) కనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తే, మన సంసిద్ధతలో ఏదో లోపం ఉన్నట్లే! ఆగమన కాల నిజమైన అర్ధాన్ని మనం గ్రహించనట్లే! అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే, ఈ రోజునుండే మన సంసిద్ధత పరిపూర్ణముగా ఉండాలి.

అల్లెలూయ, అల్లెలూయ.
ప్రభూ! నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము. నీ రక్షణమును మాకు దయచేయుము.
అల్లెలూయ!

No comments:

Post a Comment