12 వ సామాన్య ఆదివారం, Year B

12 వ సామాన్య ఆదివారం, Year B
యోబు. 38:1, 8-11, 2 కొరి. 5:14-17, మార్కు. 4:35-41

మార్కు సువార్తికుడు, మొదటి నాలుగు అధ్యాయాలలో, యేసు ‘మెస్సయా’గా, ఈ లోకమునకు వచ్చియున్నాడని బోధించుటకు, తన అధికారపూర్వకమగు ‘మాటలతో’, శక్తిగల ‘కార్యములతో’, యేసు చేసిన స్వస్థతల గూర్చి ప్రస్తావించాడు: దయ్యములను, అపవిత్రాత్మలను పారద్రోలట (1:27,39, 3:15), స్వస్థతలు (1:29-31, 40-45, 3:10), తుఫానును గద్దించుట (4:35-41). ఇవన్ని కూడా, తాను బోధించే దైవరాజ్యమునకు సంబంధాన్ని కలిగియున్నాయి. మానవాళిని జీవము, రక్షణలోనికి పునరుద్ధరించుటకు యేసు ఈ లోకమునకు ఏతెంచాడు.

దేవుని శక్తి: యేసు తుఫానును గద్దించుట

యేసు శిష్యులు గలిలీయ సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుటకు నిశ్చయించు కొనిరి. సరస్సు దాటుచుండగా, పెద్ద తుఫాను చెలరేగెను. యేసుకూడా వారితో ఉండెను, కాని పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించు చుండెను. చనిపోవుచున్నాము అని శిష్యులు చాలా భయపడ్డారు. అందుకే, యేసును సహాయము కోరుటకై నిద్ర లేపిరి. యేసు లేచి గాలిని గద్దింపగా, గొప్ప ప్రశాంతత కలిగెను.

ఇదొక ప్రకృతికి సంబంధించిన అద్భుతం. మార్కు సువార్తలో ఆరు సరస్సు ప్రయాణాలు ఉన్నాయి: 4:35-41, 5:21, 6:32, 6:45, 8:10, 8:13). ఇవి విశ్వాస ప్రయాణాలు. ప్రతీ ప్రయాణం విశ్వాసానికి ప్రరీక్ష. ప్రతీ ప్రయాణం, పరలోక రాజ్యం వైపునకు నడిపిస్తుంది. యేసు ఎన్ని అద్భుతాలు చేసినను, శిష్యులు ఇంకను ఆయన ఎవరో గ్రహించలేక పోయారు. అందుకే, ప్రభువు, “మీకు విశ్వాసము లేదా?” (4:40) అని వారిని ప్రశ్నించాడు.

భయము మన జీవితములో భాగము. భయపడినప్పుడు, మనం చేయవలసిన కార్యాన్ని మరచిపోతూ ఉంటాము. పేతురు పడవవలె, నేడు శ్రీసభ అను పడవకూడా ఎన్నో ఒత్తిళ్లకు, ఉద్రిక్తలకు గురియగు చున్నది. మనముకూడా, యేసు మనలను వదిలేసాడని, నిద్రపోవుచున్నాడని భావిస్తూ ఉంటాము. ఎందుకు భయం? మనకు యేసునందు విశ్వాసము లేదా? మనం ప్రయాణించే పడవలో యేసుకూడా ప్రయాణం చేస్తున్నాడని తెలియదా? మన జీవితములో, ప్రాధమిక విశ్వాసము ఎంతో ముఖ్యము. విశ్వాసము మూడు ప్రమాణాలలో ఉంటుంది. మొదటిగా, విశ్వాసము అనగా “నమ్మకము”. యేసు “నాప్రభువు! నా దేవుడు?” (యోహాను. 20:28) అని వ్యక్తిగత జ్ఞానమును కలిగి యుండటము క్రైస్తవ విశ్వాసము. రెండవదిగా, విశ్వాసము అనగా “చేయడం”. నమ్మకముతో పాటు చేయడం. “నా సోదరులారా! ఏ వ్యక్తియైనను, ‘నాకు విశ్వాసము ఉన్నది’ అని చెప్పుకొనినచో. తన చేతలు దానిని నిరూపింపకున్న యెడల దాని వలన ప్రయోజనమేమి?” (యాకో. 2:14) అని యాకోబు ప్రశ్నిస్తున్నాడు. “ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించువాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తాను సారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును” (మత్త. 7:21) అని స్వయముగా యేసు ప్రభువే పలికి యున్నారు. విశ్వాసమును చేతలద్వారా నిరూపించుకోవడం అనగా, అవసరములోనున్న వారికి, ప్రేమతో సేవచేయడద్వారా సాక్ష్యమివ్వడం. మూడవదిగా, విశ్వాసం అనగా “దేవునిపై ఆధారపడటము”. దేవుని ఆజ్ఞ ప్రకారం, విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము, తన సమస్తమును విడచి, దేవునిపై ఆధారపడి జీవించాడు. పై మూడింటిని వేరుచేయలేము. అన్ని ఏక కాలములో జరగాలి. అలాంటి విశ్వాసము మనకున్నదా! ఆత్మపరిశీలన చేసుకుందాం.

బైబులులో ‘పెనుగాలి’, ‘సముద్రము’ అవ్యక్త స్థితికి (గందరగోళం) సూచనలు (ఆది. 1:1, కీర్తన. 34:5-6, 65:8, 107:23-30, సామె. 30:4, యోబు. 28:25). ప్రకృతిలోని గందరగోళ స్థితిపై, సాతాను దుష్టశక్తులపై యేసుకు శక్తి, అధికారము ఉన్నది. పాత నిబంధనలో, ‘తుఫాను’ దేవుని శక్తికి, ఘనతకు సాక్షాత్కారం. అలాగే, మానవ నిస్సహాయతకు, ఏమిలేమితనానికి నిదర్శనం. సముద్రములోని తుఫానులు, నిజ జీవితములోని సవాళ్ళతో పోల్చవచ్చు. జీవితములో పాపము సముద్రములోని తుఫానువలె మనలను నాశనం చేయును.

నేటి మొదటి పఠనములో, నీతిమంతుడైన యోబు, తన శ్రమలకు కారణం తెలుసుకోవడానికి ప్రభువును ప్రశ్నించినపుడు, “ప్రభువు తుఫానులో నుండి యోబుతో పలికెను” (38:1). యోబు, తన శ్రమలకు పరమార్ధాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. కాని, అతనికి లభించిన సమాధానం: సర్వశక్తిమంతుడైన దేవుని ప్రశ్నిచడానికి యోబు ఎవరు? సువార్తలో సమాధానం దొరుకుతుందేమో చూద్దాం!.

మార్కు సువార్త, క్రైస్తవ విశ్వాసుల (గ్రీకులు-రోమనుల) హింసల నేపధ్యములో వ్రాయబడినది. శ్రమలను, హింసలను దేవుని శక్తియుందు సంపూర్ణ విశ్వాసముతో ఎదుర్కోవాలి. ఈ అద్భుతం, శ్రమలను, హింసలను నిర్భయముగా ఎదుర్కొనుటకు కావలసిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగజేయును. పడవలోని శిష్యుల సమూహం, శ్రమలను, హింసలను ఎదుర్కొంటున్న క్రైస్తవ సంఘాన్ని సూచిస్తుంది. పడవలో “యేసు నిద్ర” దేవునిపై పరిపూర్ణ నమ్మకాన్ని సూచిస్తుంది (సామె. 3:23-24, కీర్తన. 3:5, 4:8, యోబు. 11:18-19). మన శ్రమలకు, హింసలకు, అవమానములకు సరియైన సమాధానం దొరికిన, దొరకకపోయిన, మనం యేసునందు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం కలిగి యుండాలి. ఆయనను అంటిపెట్టుకొని యుండాలి. ఆయనయందే మన సంపూర్ణ సంరక్షణ, రక్షణ!

నేటి రెండవ పఠనములో, పౌలు, తనకు, మనందరి జీవితాన్ని మార్చిన ‘ఆధ్యాత్మిక పరివర్తన’ గురించి చెప్పుచున్నాడు: “మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింప బడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమిగదా! అనగా, మానవులు అందరును ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము. జీవించుచున్నవారు, ఇక మీదట కేవలము తమ కొరకు కాక, ఆయన కొరకే జీవించుటకుగాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి, పునరుత్థానము చెందినది వారి కొరకే గదా!” (5:14-15).

సముద్రాన్ని గద్దించిన ప్రభువు, మన జీవితములోని తుఫానులైన శోధనలను, శ్రమలను, హింసలనుకూడా గద్దించగలరు. విశ్వాసులు మరణం గురించి భయపడకూడదు. యేసు వారిమధ్యలోనే యున్నాడు. విశ్వాసము, భయాన్ని అధిగమించాలి. క్రమముగా విశ్వాసములో ఎదగాలి. యేసు మనలను ప్రశ్నిస్తున్నారు: మీరింత భయపడుచున్నారేల? మీకు విశ్వాసము లేదా? మరి, నా సమాధానం ఏమిటి!

11 వ సామాన్య ఆదివారం, Year B

11 వ సామాన్య ఆదివారం, Year B
యెహెజ్కె. 17:22-24, కీర్తన 91, 2 కొరి. 5:6-10, మార్కు. 4:26-34

దైవ సమయం

మనమంతా తక్షణమే పనులు జరిగిపోవాలన్న శకంలో ఉన్నాం. సమాచార విప్లవం, ఆధునిక పరికరాలతో క్షణాల్లో అటువైపు ఉన్న ఖండాల వారితో మాట్లాడుతూ, పనులు చేస్తున్నాము, చేపించుకొంటున్నాము.

మాది ఒక చిన్న గ్రామం. నా బాల్యములో, దగ్గరిలో ఉన్న పట్టాణానికి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు నడచి బస్సు ఎక్కేవాళ్ళం. కొన్ని సం.రాలకు మా ఊరికే బస్సు వచ్చింది. తర్వాత ఆటోల ప్రభావం. అందరికి సమయం విలువ తెలిసిపోయింది. ఫలితం - అసహనం, ఇతరుల కోసం ఎదురు చూడలేక పోవటం.

కలుపు గింజలు మొలకెత్తి పెరిగి, పెద్దవి అయ్యేవరకు యజమాని ఎలా ఎదురు చూశాడో, ప్రేమగల దేవుడు మన కోసం అలా ఎదురు చూస్తున్నాడు. దేవుడు కోపగించడానికి, శిక్షించడానికి తొందర పడడు; వేచిచూస్తాడు. పాపి పశ్చాత్తాపానికి మరో అవకాశం ఇస్తాడు. మన లోపాలను భరిస్తాడు. పరితాప హృదయం కోసం ఎదురుచూస్తాడు. మనంకూడా దైవస్వభావంలో పాలుపంచు కోవాలి. ప్రభువు మనస్తత్వాన్ని కలిగియుండాలి (ఫిలిప్పీ. 2:5).

బంగారు భవిష్యత్తుకోసం అందరం కలలు కంటాం. ఆశగా ఎదురు చూస్తాం. 'మంచి రోజులు ముందున్నాయి' (ముఖ్యంగా నేడు కరోన నేపధ్యములో) అన్న ఆశే మనలను ముందుకు నడిపిస్తుంది. ఈ ఆశకు, దైవరాజ్య పరిపక్వతకు చాలా దగ్గరి సంబంధం ఉంది.

ఈనాటి సువిషేశములో యేసు ప్రభువు ఇలా సెలవిస్తున్నారు: "దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పనిపాటులతో మునిగిపోయెను. వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమిమీదనుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును" (మార్కు. 4:26-28).

ఎదుగుదల, పెరుగుదల, అభివృద్ధి - నిరంతరం జరిగే ప్రక్రియ. పుట్టిన పిల్లవాడు రోజురోజుకు పెరుగుతూనే ఉంటాడు. ఇది అనుదినం మన కళ్ళముందే జరిగే విషయం, కాబట్టి మనకు తెలియకుండానే ఈ మార్పు జరుగుతుంది. అలాగే, దైవరాజ్యం దేవుని కృప, అనుగ్రహము. అదికూడా క్రమక్రమంగా ఈ లోకములో విస్తరించును. దేవుని చిత్తమును మనం నెరవేరిస్తే, ఆ దైవరాజ్యంలో అది భాగమే అవుతుంది. 

కనుక, దైవరాజ్యం, దాని విలువలు మన హృదయాల్లో, కుటుంబాల్లో, గ్రామాల్లో, దినదినం పెరుగుతూ, విస్తరిస్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, మన అనుదిన నిర్ణయాల్లో దేవునివైపు మరింతగా మ్రొగ్గుచూపుతూ ఉండాలి. "మన నిరీక్షణయందు విశ్వాసము కలవారమై ధైర్యము వహించినచో, మనమే ఆయన గృహము" (హెబ్రీ. 3:6).  ఈ బృహత్తర దైవకార్యములో దైవాశీస్సులు మనకు తోడైయుండునుగాక!

"దేవుని రాజ్యము" గురించి ఇంకా తెలుసుకో తలచిన, ఈ క్రింది వ్యాసమును చదువుము:

దేవుని రాజ్యము - మన యోగ్యత

క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగ, Year B

క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగ, Year B
నిర్గమ. 24: 3-8; హెబ్రీ. 9:11-15;  మార్కు. 14:12-16, 22-26

వారిని పుష్టికర ఆహారముతో పోషించి, రాతి నుండి రాబట్టిన తేనెతో నేను వారిని సంతృప్తి పరచితిని   -   కీర్తన 81:16

ఒక సంఘటన, దాని స్మరణ, వర్తమానములో ఆచరణ. అదే పండుగ. అలా జరిగితేనే ఉంటుంది అది నిండుగా. క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగ దినమున మనం ఏ సంఘటన స్మరించుతున్నామో, ఏ సందేశమును ఆచరించాలనుకొంటున్నామో, ఒక సారి ధ్యానించుదాం!

ఈనాటి మొదటి పఠనములో (నిర్గమ. 24: 3-8) ఇశ్రాయేలీయులు కానాను దేశమున (వాగ్ధత్త భూమిలోనికి) ప్రవేశించే ముందు, దేవుడు వారితో చేసికొన్న ఒప్పంద (ఒడంబడికను) గూర్చి వినియున్నాము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినుచు, దాని ప్రకారం నడచుకొంటూ, వాగ్ధాన భూమిలో దేవుని ప్రజలుగా నియమనిబంధనలకు బద్దులమై జీవిస్తామని ముక్తకంఠముతో సమాధానమిస్తున్నారు.  దేవునికి, దేవుని ప్రజలకు మధ్య కుదిరిన సయోధ్యకు గుర్తుగా మోషే వధింపబడిన జంతువుల రక్తాన్ని ప్రోక్షించి, ఆ ఒడంబడిక అమలులోనికి వచ్చినట్లు ప్రకటిస్తున్నాడు. చిందిన ఒక జంతువు రక్తము దీనికి సాక్ష్యము. అంటే రక్తం జీవమునకు గుర్తు.  ఆ జీవమునకు మూలాకారకుడైన దేవుని సాక్షిగా కుదిరిన ఒప్పందం.  ఇది ఒక నాటి మాట.

రెండవ పఠనములో (హెబ్రీ. 9:11-15) రచయిత, క్రీస్తు రక్తపు అర్పణ గూర్చి వివరిస్తున్నారు. జంతువుల రక్తం సాక్షిగా జరిగిన ఎన్నో ఒప్పందములు రద్ధయినాయి.  అందుకే దూడల రక్తం కంటే, మేకల రక్తం కంటే శ్రేష్టమైన తన రక్తమును (జీవమును) చిందించుటకు, మనకోసం (నీ కోసం, నా కోసం) మనుష్యావతారం ఎత్తి, సిలువలో తన రక్తమును, శరీరమును బలిగా యేసు అర్పిస్తున్నాడు.  దేవునికి, ఆయన బిడ్డలకు మధ్యవర్తిగా, మనిషిగా, దేవుడిలా అర్పణ చేస్తున్నాడు.  అతని ప్రేమ, త్యాగ వ్యక్తీకరణే ఈ క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగ.

అందుకే, ఆయన ఇహలోకపు చివరి పాస్కా పండుగ స్మరణ సమయములో (సువార్తా పఠనం మార్కు 14:12-16, 22-26) రొట్టెను అందుకొని, ఆశీర్వదించి, త్రుంచి తన శిష్యులకిచ్చుచూ "దీనిని తీసుకొని మీరు భుజింపుడు. ఇది నా శరీరము" అనెను.  ఆ విధముగనే పాత్రమునందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించి "ఇది అనేకుల కొరకు చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము" అనెను.  ఈ విధముగా మన జీవం కోసం, మన విధేయత కోసం, మన విడుదల కోసం, మన విముక్తి కోసం, మన రక్షణ కోసం, తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని అర్పించాడు.

ఆ ప్రేమను, త్యాగాన్ని, స్మరిస్తూ, కోనియాడబడుచున్నదే 'దివ్య బలి సమర్పణ (దివ్యబలి పూజ)'. మనం సమర్పించే రొట్టె, రసములను తన శరీర రక్తములుగా మార్చి మనకు జీవమును యిస్తున్నాడు.  ఈ రొట్టె రసములలో మనం ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తున్నాం! ఆయన ప్రేమను పొందుతున్నాం!ఈ గొప్ప ప్రేమ, త్యాగ స్మరణే మన ఈ క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగ.  ఈ గొప్ప సంఘటన యొక్క స్మరణ, ఆచరణగా మారినప్పుడు ఇంకా నిండుగా ఉంటుంది.  ఎలా?

ప్రభు భోజన స్మరణ సమయములో, రొట్టె రసములో క్రీస్తు నిజ ప్రత్యక్షతను ఆస్వాదిస్తున్న, అనుభవిస్తున్న మనం, మన ద్వారా, మన మాటలలో, మన చేతలలో, మన నడవడికలో, మన సహవాసములో, మన సాన్నిహిత్యములో, ఇతరులు ఆ క్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, కరుణను, మన్నింపును అనుభవించినట్లయితే, ఇంకా క్రీస్తు జీవిస్తున్నాడని, రొట్టె రసములలో తనను తాను ప్రత్యక్ష పరచుకొంటున్నాడని, ఆయన నిజముగా మన మధ్య ఉన్నారని ఇతరులు విశ్వసిస్తారు.  అప్పుడే, ఆ గత స్మరణ వర్తమానములో నిజమని రూడి అవుతుంది.  అప్పుడే క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగను యోగ్యముగా కొనియాడినట్లు, క్రీస్తు ప్రేమను, త్యాగమును ఘనముగా కొనియాడినట్లు .

క్రీస్తు శరీరములో భాగమైన మనమందరం, ఆ పిలుపును వినాలని, మేలుకొలుపును వినాలని, మేలుకొలుపును పొందాలని ప్రార్ధిస్తూ...

పరమ పవిత్ర త్రిత్వైక దేవుని మహోత్సవము, Year B

పరమ పవిత్ర త్రిత్వైక దేవుని మహోత్సవము, Year B
ద్వితీ.కాం.4 :32-34,39-40; రోమీ 8:14-17; మత్త 28:16-20

మనం చిన్నతనములో ఉన్నప్పుడు మన తాత అమ్మమ్మ లేక నాయనమ్మలు మనకు సిలువ గుర్తు ఏవిధముగా వేయాలో నేర్పించారు. దాని అర్ధం మనకు తెలియక పోయిన, అది అర్ధం కానప్పటికిని వారు చెప్పింది నేర్చుకున్నాము. తరువాత సత్యోపదేశం నేర్చుకున్నప్పుడు, దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారే పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు; వారు వేరువేరు వ్యక్తులు అయినప్పటికిని, ఒకే దేవునిగా లేక వ్యక్తిగా ఉన్నారు అని తెలుసుకొన్నాము. ఇదే త్రిత్వైక దేవుని మహిమ, పరమ రహస్యం అని గుర్తించాము. కాని, తరువాత మనం జీవితములో ఎదిగేకొద్ది, మన జీవితములో పిత, పుత్ర, పవిత్రాత్మ దేవునితో బంధాన్ని ఏర్పరచుకొని, చివరకు త్రిత్వైక దేవుడే మన జీవితానికి పునాదిగా నిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మన గ్రహించాలి! అదే, ఈ త్రిత్వైక దేవుని ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాని, ఒకే దేవుడు అను పరమరహస్యాన్ని మనం మానవుని తెలివి తేటలతో అర్ధం చేసుకోలేము అని గ్రహించి, మన హృదయముతో ఆయనను అంగీకరించి, విశ్వసించి, ఆయన అనుభూతిని పొందగలగాలి. ఆ త్రిత్వైక దేవుని ప్రేమ బంధములో జీవించినప్పుడు మాత్రమే, అది మనకు సాధ్యపడుతూ ఉంది.

ఈ ఆదివారము తల్లి తిరుసభ పరమ పవిత్ర త్రిత్వైక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. “దేవుని యొక్క మహిమను” జరుపుకుంటూ ఉన్నాము. మన దేవుడు ప్రేమగలవాడు. అందుచేత ఒక “ప్రేమ బంధము”లో మాత్రమే ఆయన తననుతాను ఈ ప్రపంచానికి చాటుకుంటూ ఉన్నాడు. కనుక, ఈ పండుగ రోజున దేవుని మహిమగల ప్రేమ బంధాన్ని గురించి ధ్యానం చేసికొందాం.

మన దేవుడు ఒంటరితనాన్ని కోరుకోడు. ఆయన ఒక కుటుంబము లాంటివాడు. ఆ కుటుంబములో పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు కలసి ఒక సంఘముగా జీవిస్తూ ఉన్నారు.  వారు ముగ్గురు కూడా సరిసమానులు, వారిలో హెచ్చుతగ్గులు లేవు. తారతమ్యాలులేవు. ఎవరి భాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ముగ్గురుకూడా ప్రేమలో జీవిస్తూ, వారి ప్రేమనే ఈ ప్రపంచానికి పంచుతూ ఉన్నారు. తండ్రి దేవుడు “ఈ లోకమును ఎంతో ప్రేమించెను” అని మనం యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుకనే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. దానిని ప్రేమించాడు.  దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు అని చెప్పటానికి నిదర్శనం, తన ప్రియమైన, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించటం. యేసుప్రభు తన తండ్రికి ప్రియమైన కుమారుడిగా, తండ్రికి విధేయుడుగా ఈ లోకానికి తండ్రి దేవుని గురించి తెలియ చేసాడు. ఆయన ప్రేమను తెలియ చేసాడు. దేవుని రూపం ఎలా ఉంటుందో, ఆయన ఈ ప్రపంచాన్ని, సర్వమానవాళిని ఎంత గాడముగా ప్రేమిస్తున్నాడో తెలియ జేసాడు.  చివరికి, ఈ లోకాన్ని, పాపపు సంకెళ్ళ నుండి రక్షించడానికి తన ప్రాణాన్ని సైతము ఫణంగా పెట్టి, మానవాళికి రక్షణను, పరలోక ప్రాప్తిని ప్రసాదించాడు. తన సిలువ రక్తంద్వారా, సర్వ మానవాళిని తండ్రి ప్రేమకు అర్హులను చేసాడు.  మానవాళి రక్షణ క్రీస్తు ప్రేమ ఫలంగా మనం గుర్తించాలి.

మరణ పునరుత్థానాల తరువాత మోక్షారోహాణమైన క్రీస్తు, నేను మిమ్ములను అనాధలుగా విడిచి పెట్టను అని చెప్పి తన పరిశుద్ధాత్మను వాగ్ధానము చేసాడు. “లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును” అని అభయ మొసగాడు. ఈ మాట ప్రకారము, తండ్రి కుమారుల ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని రూపములో మూడవ వ్యక్తిగా మనలో ఎల్లప్పుడూ వసిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్దాత్మ దేవుడే మనలో విశ్వాసాన్ని, ప్రేమను కలిగింప జేసి, మనలను విశ్వాస మార్గములో ముందుకు నడుపుచున్నాడు.

ఈ విధముగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రేమ బంధం, వారి జీవితం మన జీవితాలకు ఆదర్శముగా నిలుస్తూ ఉంది. మనలను కూడా వారి ప్రేమ బంధములోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక తండ్రి దేవుడు క్రీస్తుద్వారా, మనకు ఈ పవిత్ర దేవుని ప్రేమను తెలియజేస్తే, దానిని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో నింపుతూ ఉన్నాడు. కారణం, దేవుడు మనలను తన రూపములో సృష్టించాడు. కాబట్టి, మనము కూడా, ఆయన ప్రేమ కలిగి, ఆ ప్రేమలో జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ దేవుని ప్రేమలో మనం జీవించాలంటే, మనముకూడా ఇతరులను అంగీకరించాలి. ఇతరులను ఆదరించాలి. వారితో సహనముతో మెలగాలి. మనకు ఉన్నదానిని సంతోషముగా ఇతరులతో పంచుకోవాలి. అందరికి శాంతిని, ప్రేమను పంచగలగాలి. మనం అంతా సహోదరి, సహోదరులం అన్నవిధముగా జీవించ గలగాలి.

ఈ నాటి సువిశేషములో, క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఈ విధముగా చెప్పుచున్నాడు: “ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కనుక మీరు వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు.” ఈ రక్షణ సువార్తను ప్రపంచానికి చాటమని, ఆయన ప్రేమను తోటివారితో పంచమని చెప్పటానికి ప్రభు ఈనాడు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోకములో పిత, పుత్ర, పరిశుద్ధాత్మల ఐక్యతకు, స్నేహానికి, వారి ప్రేమకు సాక్షులుగా ఉండమని, జ్ఞానస్నానం పొందిన ప్రతీ బిడ్డను కోరుతూ ఉన్నాడు. మన ప్రయాణంలో ఆత్మ దేవుని తోడ్పాటుతో ముందుకు సాగుదాం. దేవుని ప్రేమ చిహ్నాలుగా వర్దిల్లుదాం!