యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము, YEAR B, 8 ఏప్రిల్ 2012

యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము, YEAR B, 8 ఏప్రిల్ 2012
యెష 55:5-14, రోమీ 6:3-11, మార్కు 16:1-7

జయహో! యేసు నేడు లేచెను, జయహో!

మ'రణం' అనేది ఓ యుద్ధం.
ఆ యుద్ధాన్ని గెలవడమే ఉత్థానం.
ఆ యుద్ధాన్ని గెలిచాడు ఓ సమర యోధుడు
ఆ సమర యోధుడే ... యేసు.
అల్లెలూయ!!!

నలభై రోజుల కఠోర ఉపవాస ప్రార్ధనలు...
సైతానుచే శోధింపులు...
క్రూరమైన బాధలు...
సిలువపై ఘోరమైన మరణం...
మూడవ రోజు ఉత్థానం.

అదే క్రీస్తు పునరుత్థాన పండుగ సారాంశం. విశ్రాంతి దినము గడచి పోగానే యేసుకు సుగంధ ద్రవ్యములను పూయడానికి మగ్దల మరియమ్మతోపాటు మరో ఇద్దరు స్త్రీలు యేసు సమాధి వద్దకు బయలుదేరారు. కాని, అప్పటికే, ఆ పెద్ద సమాధి రాతి తొలగించ బడటము చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడే తెల్లదుస్తులతో ఉన్న ఓ వ్యక్తి వారిని గమనించి వారితో "కలవర పడకుడి. మీరు వెదకుచున్న యేసు ఉత్తానమయ్యాడు. మీరు వెళ్లి ఈ వార్తను వారి శిష్యులకు తెలియ జేయుడు" అని అనెను (మార్కు 16:1-7).

సిలువపై యేసు మరణం ఎవరికోసం? ఎందుకీ త్యాగం? నీ కోసం - నా కోసం - యావత్ మానవాళి పాప ప్రక్షాళన కోసం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళిపై తనకెంత ప్రేమ ఉందో తన రెండు చేతులు చాచి సిలువపై మరణిస్తూ మనకు చూపించాడు క్రీస్తు ప్రభువు. ఇంతకన్న గొప్ప నిదర్శనం వేరొకటి మనకు అవసరం లేదు.

సిలువను మోస్తున్నప్పుడు అతనిపై వేసిన నిందలు, శారీరక వేదన వర్ణింపతరం కానివి. "అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు" అని బిగ్గరగా వినిపించిన కేకలు అతని గుండెల్లో గునపములా గుచ్చుకొన్నాయి. ఇన్ని వేదనలను, చీవాట్లను భరించడం ఎవరితరం అవుతుందో చెప్పండి! ఆ నిందలన్నింటినీ భరిస్తూ, ఆకాశానికి భూమికి మధ్య సిలువపై రక్తపు మరకలతో వ్రేలాడుతూ "తండ్రీ, వీరిని క్షమింపుము. వీరు చేయుచున్నదేదో వీరికి తెలియదు" (లూకా 23:34) అని తన తండ్రికి మొరపెట్టుకొన్నాడు. అల్లెలూయ! ప్రేమంటే ఇదే!

ఈనాటి పఠనం యెష 54:10, "పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు" అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం దైవ ప్రేమకు ఓ చక్కటి ప్రతిరూపం. మరణం అనేది సమాప్తం కాదు. అది ఓ క్రొత్త జీవితానికి ఆరంభం మాత్రమే! ఈనాటి పఠనంలో పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటున్నారు: "ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో, ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. మనము క్రీస్తుతో మరణించి యున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను (రోమీ 6:5,8-11).
 
క్రీస్తు తన ఉత్తానము ద్వారా యావత్ మానవాళికి రక్షణను ప్రసాదించాడు. తన ఉత్థానం ద్వారా పాపాన్ని పటాపంచలు చేశాడు. "మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్ష మయ్యెను" (తీతు 2:11). ఉత్తాన క్రీస్తు యొక్క ప్రేమ, దీవెనలు మనదరితో ఉండునుగాక!

పవిత్ర శుక్రవారము

పవిత్ర శుక్రవారము: పరిశుద్ధ సిలువ ఆరాధన
యెష 52:13-53:12; హెబ్రీ 4:14-16, 5:7-9; యోహా 18:1-19:42

ఉపోద్ఘాతము:
సకల వరముల ఊటయగు ఓ దేవా! మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తముద్వారా పాస్క పవిత్ర క్రియలను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్ర పరచుడు.


ఈ రోజు పవిత్ర శుక్రవారము. ఈ రోజుని "గుడ్ ఫ్రైడే" అని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచిరోజు, పవిత్రమైన రోజు అంటున్నాము? ఎందుకనగా, క్రీస్తు మరణం మనకు విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆయనను విశ్వసించు వారందరికి జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని సంపాదించి పెట్టింది. తన మరణముద్వారా, మనలను పాపదాస్యమునుడి విముక్తి గావించారు. "నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి అమూల్యమైన క్రీస్తు బలిద్వారా మీరు విముక్తి కావింపబడితిరి" (1 పేతు 1:19).

పవిత్ర గురువారమున, క్రీస్తు శిష్యులతో కలసి, 'పైగది'లో ప్రవేశించి, దేవుని గొప్పవరమైన దివ్యసత్ప్రసాద భోజనమును స్వీకరించియున్నాము. క్రీస్తు ప్రభువుని నిజమైన శరీరరక్తములు, ఆత్మ దైవత్వమును మనం పొందియున్నాము. ఈనాడు పవిత్ర శుక్రవారమున, మన శ్రీసభకు తల్లియైన మరియమ్మతో కలసి క్రీస్తు సిలువచెంత నిలుస్తున్నాము. పవిత్ర శుక్రవారమున, గొప్ప నమ్మకముతో, ఆశతో, క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయముకొరకై వేచిచూస్తున్నాము. ఆ క్షణమున, క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆక్షణమున పరలోకములో పునీతులతో మరియు మన తోటి సహోదరీ సహోదరులతో కలసి, "లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగు చున్నది" (యెషయ 60:1) అని 
ఎలుగెత్తి స్తుతించెదము.

ఈ రోజు క్రీస్తు సిలువచెంత నిలచియున్నాము. మరియ తల్లివలె, నిర్మల హృదయముతో ఈ సిలువచెంతకు వచ్చియున్నట్లయితే, దైవప్రేమ పరమరహస్యాలలోనికి ప్రవేశిస్తాము. సిలువను గాంచుదాం. సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం. ప్రేమగల మన ప్రభువు మనకోసం తన ఇష్టపూర్తిగా ఈ సిలువ మరణాన్ని పొందారు. తన సిలువ వేదన, మరణముద్వారా మనలను రక్షించి యున్నారు. ఆయన మన మరణమునుండి రక్షించారు.

ధ్యానం: ఈరోజు మనం పాస్క పరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు సిలువ మరణం ఒక బలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించినటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే మరియు బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరిగిరిపై అర్పించిన బలి, తండ్రి దేవుని చిత్తానుసారముగా జరిగియున్నది. అందుకే, తండ్రి దేవుడు క్రీస్తును మహిమపరచి మహోన్నత స్థితికి హెచ్చించారు. మనముకూడా తండ్రికి పూర్తిగా విధేయులై, బాధామయ సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలసి పోవాలి. మన దు:ఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటిని క్రీస్తుబలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే సిలువ మార్గములో ప్రభుని అనుసరించే వారందరికి విమోచనం కలుగుతుంది.

ఈ రోజు మనం ప్రత్యేక విధముగా ప్రభువు సిలువ మరణాన్ని స్మరిస్తున్నాము. మనకోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించారు. అవమానాలను భరించారు. సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందారు.

యేసును బంధించుట (యోహాను 18:1-12): కడరాత్రి భోజనం తరువాత, యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి ఓలీవు కొండపై నున్న, గెత్సేమని తోటకు వెళ్ళెను. యేసు తరుచుగా ప్రార్ధనకై అచటకు వెళ్ళేవారు. యేసును అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియును (18:1-2). యేసు యూదాకు తెలియని స్థలమునకు వెళ్ళలేదు. ఎందుకన, యేసు తననుతాను బలిగా అర్పించు కొనుటకు సిద్ధపడ్డారు (18:4-8, 11). యేసును బంధించుటకు యూదా ఇస్కారియోతు, రోమా సైనికులు, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులు, అధికారులు వచ్చిరి (18:3) - అనగా [అవిశ్వాస, చీకటి] 'లోకమంత' యేసుకు వ్యతిరేకం అని సూచిస్తుంది. ప్రతీ పాపాత్ముడు యేసు మరణానికి కారణం. వారు చీకటిలో, వెలుగును బంధించుటకు వచ్చిరి. చివరి వరకు వెలుగులో జీవించువాడు యేసునకు ప్రియ శిష్యుడు. పేతురు ప్రధానార్చకుని సేవకుని (మాల్కుసు) కుడిచెవిని తెగనరికెను. యేసు పేతురుతో, "నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా?" (18:10-11) అని అనెను. "కత్తిని ఎత్తువాడు కత్తితోనే నశించెదరు" (మత్త 26:52). క్రైస్తవులు హింసలలో, ప్రతీకారాన్ని కోరరాదు. "ఎన్నటికిని మీరు పగ తీర్చు కొనకుడు" (రోమీ 12:19).

న్యాయ పీఠము ఎదుట యేసు - పేతురు బొంకు (యోహాను 18:12-27): యేసును మొదటగా అన్నా (ప్రధానార్చకుడైన కైఫాకు మామ) యొద్దకు తీసికొని పోయిరి (అన్నా క్రీ.శ. 6-15 వరకు, కైఫా క్రీ.శ. 18-36 వరకు ప్రధానార్చకులుగా పనిచేసిరి). యేసును విచారించు సమయములోనే, పేతురు, యేసు ఎవరో తెలియదని బొంకాడు (18:15-18, 25-27). పేతురు బొంకు రాత్రి చీకటిలో జరిగినది. వెలుగైన క్రీస్తుతో జీవించినను, పేతురు తన బలహీనత వలన అంధకారంలో పడిపోయాడు. ఒకవైపు యేసు "నేనే" అని సమ్మతిస్తుంటే, మరోవైపు పేతురు "నేను కాదు" అని తిరస్కరించాడు. మనం యేసు అనుచరులమే, కాని మన పాపల వలన సాతానుకు లోబడి జీవిస్తున్నాం.
ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనలను గురించి ప్రశ్నించెను (18:19). యేసు చెప్పిన సమాధానం (18:20-23), అన్నాకు ఎలాంటి పరిష్కారం దొరకపోవడముతో, యేసును ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను (18:24). యేసులో ఎలాగైనా తప్పు పట్టాలని చూసారు. అన్నా, కైఫాలు యేసులో ఎలాంటి దోషమును కనుగొనలేదు.
పిలాతు ఎదుట ప్రభువు - ప్రజలకు లొంగిన పిలాతు (యోహాను 18:28-40; 19:1-16): అందుకే, యూదుల అధికారులు యేసును కైఫా యొద్దనుండి అధిపతి మందిరములోనికి తీసికొని వెళ్ళిరి. రోమను గవర్నరు అయిన పిలాతు ఎదుట ప్రభువును నిలబెట్టిరి. ఎందుకన, మరణదండన విధించు అధికారము యూదులకు లేకుండెను (18:31). దేనిని మనం 7 భాగాలుగా చూడవచ్చు: (1). పిలాతు-యూదులు: నింద / తీర్పు (18:28-32); (2). పిలాతు-యేసు: రాజ్యము / సత్యము (18:33-38); (3). పిలాతు-యూదులు-బరబ్బ (18:38-40); (4). యేసును కొరడాలతో కొట్టెను, ముళ్ళ కిరీటము తలపై పెట్టెను, ముఖముపై కొట్టిరి (19:1-3); (5). పిలాతు-యూదులు: "ఇదిగో ఈ మనుష్యుడు" (19:4-7); (6). పిలాతు-యేసు: "నీవు ఎక్కడనుండి వచ్చితివి?" (19:8-11); (7). పిలాతు-యూదులు: "సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు" (19:12-16). 

సిలువ, మరణం, భూస్థాపితం (యోహాను 19:17-42): సిలువ, సిలువపై బిరుదము (19:16-22); యేసు అంగీకొరకు చీట్లు వేసుకొనుట (19:23-24); సిలువ చెంత మరియ తల్లి, ప్రియ శిష్యుడు (19:25-27); యేసు మరణం (19:28-30); యేసు ప్రక్కలో బల్లెపు పోటు (19:31-37); భూస్థాపితం (19:38-42).

సిలువ మరణం: 
ఆనాడు, అన్ని శిక్షలలోకెల్ల సిలువ మరణం చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది. యేసు చాలా అవమానకరమైన, అమానుషమైన, అతి భయంకరమైన, హేయమైన, బానిస మరణాన్ని, నేరస్థుని మరణాన్ని పొందియున్నాడు.
సిలువ: సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు, ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నము. సిలువను చూసినప్పుడెల్ల ఈ పరమ రహస్యమును మనము ధ్యానించాలి. ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాము. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది. కాని, వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించగలగడానికి గల కారణం, అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో మహిమకి సాధనముగా, జీవమునకు చిహ్నముగా మారియున్నది.
ఆయన సిలువ మరణాన్ని మనకోసం అంగీకరించారు: "తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటె ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు" (యో 15:13). సిలువ ప్రేమకు గుర్తు. ప్రభువు అందరి కోసం మరణించారు. సిలువ పరలోక ద్వారము. సిలువ గురుతు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుచున్నాము.
సిలువ ప్రేమకు చిహ్నం: 
సిలువ మరణం యేసుకు మనపైగల ప్రేమకు నిదర్శనం. పునీత పౌలు తన లేఖలలో, యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్ల, యేసు/దైవ ప్రేమనుగూర్చి చెప్తారు: "క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే, దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను" (ఫిలిప్పీ 5:2). యేసు మరణముద్వారా, దేవుని ప్రేమకూడా వ్యక్తమగుచున్నది. "నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా, సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెను గదా! ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు" (రోమా 5:7-8). "ఆయన తన స్వంత కుమారునికూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా?" (రోమా 8:32).
సిలువ ఆరాధన: ఈ రోజు శ్రీసభ కలువరి గిరి క్రీస్తు సిలువపై చూస్తూ ఉన్నది. ప్రతి శ్రీసభ సభ్యుడు, సభ్యురాలు, సిలువ మ్రానుద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గూర్చి ధ్యానించును. మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడము ద్వారా, సిలువద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను కృతజ్ఞులమై ఉంటున్నాము. క్రీస్తును ఆరాధిస్తున్నాము: "క్రీస్తువా! మిమ్ము ఆరాధించి, మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. ఎందుకన, మీ సిలువచేత, ఈ లోకమును రక్షించితిరే"
కార్యసాధనలో సిలువ మరణం: యేసు ఎందుకు మరణించ వలసి వచ్చినది? ఏ కారణం ఆయన మరణానికి దారితీసింది? దేవునితో మానవ సంబంధాన్ని పునరిద్దరించడానికి ఆయన ఏ లోకానికి వచ్చారు. లోకమును నీతి న్యాయం, సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించడానికి వచ్చారు. లోకమును రక్షించాలని వచ్చారు. దేవుని ప్రేమను, కరుణను, శాంతిని బోధించాలని వచ్చారు. ఈ కార్యసాధనలో ఆయన సిలువ మరణాన్ని పొందాల్సి వచ్చినది.
క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా?: "నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకేకాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతీవాడు నిత్యజీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము" (యోహాను 6:38-40). పతనమైన మానవున్ని ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాపక్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చియున్నారు.
అయితే, లోతుగా ధ్యానించినట్లయితే, యేసు పొందిన శ్రమలన్ని, దైవనిర్ణయమని అర్ధమగుచున్నది. అయితే, ఆయన గ్రుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవచిత్తం ఉంది. మనలను రక్షించాలనే ప్రేమభావం ఉంది. యేసు సిలువపై "సమాప్తమైనది" (యోహాను 19:30) అని పలికారు. దీని అర్ధం: తన శ్రమలు, మరణముద్వారా పాపాన్ని, పూర్తిగా నిర్మూలించారు. శ్రమలు, సిలువ, ముళ్ళకిరీటం అన్నీకూడా ఈ లోకములో ఇమడగలవు, లేనిచో వాటిని ప్రభువు అంగీకరించేవారు కాదు. మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టర్ ఆదివారము లేదు. మనం ఈ లోకమున మరణించినట్లయితేనే, దైవరాజ్యమున జీవించగలం. ముళ్ళకిరీటం ఉన్నచోటనే, దేవుని మహిమ ఉంది. క్రీస్తుతో మరణించినప్పుడే, ఆయనతో ఉత్థానమవుతాం. ఇదే దేవుని చిత్తం.
క్రీస్తు సిలువపై "దాహమగుచున్నది" (యోహాను 19:28) అని పలికారు. క్రీస్తు దాహము మన రక్షణము. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణము. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ (చూడుము: యోహాను 4:10-14, 6:54 -56). ఈనాడు సిలువ చెంత ఉన్న మనం, సిలువపై ఉన్న క్రీస్తు మనకోసం ఎంత దాహమును కలిగియున్నారో గుర్తించుదాం. దివ్యపూజాబలిలో తన శరీర రక్తములద్వారా, క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనం ఆయనకు సంపూర్ణముగా అర్పించుకొందాం.

మన కర్తవ్యం?: 
క్రీస్తు కడరా భోజన స్మరణద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొనవలయును (చూడుము: 1 కొరింతు 11:24-25, 1 పే 3:18). యేసు చేసిన పోరాటాన్ని, ఆయన ప్రసాదించే శక్తితో, ఆయన శిష్యులమైన మనం కొనసాగించాలి. సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధిబాధలను నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి న్యాయాలను, సోదరభావాన్ని స్థాపించాలి. ఇది మన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యంకోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. మనముకూడా అన్నీ ఓర్పుతో సహించుదాం. ఓకే సంఘముగా ప్రేమతో జీవించుదాం. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం.

పవిత్ర గురువారం, YEAR B, 5 ఏప్రిల్ 2012

పవిత్ర గురువారం, YEAR B, 5 April 2012
నిర్గమకాండము 12: 1-8, 11-14, భక్తి కీర్తన 116:12-13, 15-16,17-18
1 కొరి 11: 23-26, యోహాను 13: 1-15

Br. Kiran Kumar Avvari, OFM Cap

తపస్కాలము మనలను మనం దైవీకముగా మార్చుకొనుటకు దేవుడిచ్చిన సమయం. అలాంటి తపస్కాలమందు విభూది బుధవారము నుండి మ్రానుకొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తైతే, ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు. అటువంటి ఈ తపస్కాల చివరి వారమందు ఉత్థాన పండుగకు ముందు వచ్చు గురువారమును పవిత్ర గురువారముగా పిలవడం ఆనవాయితి.. తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈ ప్రాముఖ్యతకు గల కారణములను మనము ఈనాటి పటనముల ద్వారా గ్రహించవచ్చును.

నిర్గమకాండము 12: 1-8, 11-14 - పాస్కబలి నియమములు

ఈ పఠనము ద్వారా యెహోవా దేవుడు ఇస్రాయేలీయులతో పాస్కాబలి ఒప్పందము చేసుకొనుటను మనము చదువుచున్నాము. ఈనాడు ఇస్రాయేలీయులు పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లలను చంపి, వాటి రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్క బలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి ప్రభువు విడమరచి చెప్పియున్నారు.


ఈ పాస్క గొర్రెపిల్లను ఏ విధముగా తినవలేనో కూడా యెహోవా చెప్పియున్నారు. ఆ నియమములు ఏమనగా:
- తినునపుడు వారి నడుముకు దట్టి ఉండవలెను
- కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను
- చేతిలో కర్ర ఉండవలెను
- మాంసమును త్వరగా తినవలెను.

ఈ నియమములను మనము ఒక్కసారి గమనిచినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నపుడు మనలను మనము త్వరితగతిన తయారుచేసుకొంటున్నట్లు గోచరించును. ఆ విధముగా మనము ఎంత ఉత్కంటభరితముగా దేవుని పాస్క గురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చును. ఏ విధముగానైతే ఒక పాలనాధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంటభరితముగా ఉంటామో అంత కన్నా ఎక్కువగా దేవుని పాస్క గురించి ఉత్కంటగా తయారుకవాలనేది దేవుని ఉద్దేశ్యము. అంటే దేవుని పాస్క బలిని ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు గుణముతోను జరుపుకోనవలెను.

ఈ పాస్క బలి ఐగుప్తీయుల చెరనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు సూచికగా అవగతమగుచున్నది. అదే విధంగా ఈ పాస్క బలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తు బలికి సూచికగాను జరిగినట్లుగా మనము అర్ధము చేసుకొనవచ్చును.

1 కొరి 11: 23-26 - దివ్య సత్ప్రసాద స్థాపనము, పవిత్ర యాజక అంతస్తు స్థాపన

ఏ విధముగా అయితే మొదటి పటనములో యెహోవా దేవుడు తన పాస్క బలి నియమములను చెప్పియున్నారో అదేవిధముగా ఈ రెండవ పఠనములో పునీత పౌలుగారు దివ్య సత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏ విధముగా జరపాలనే నియమముల గురించి, పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి మనకు విశదీకరించుచున్నారు.

దివ్య సత్ప్రసాద స్థాపనము

యేసుప్రభు తాను అప్పగి౦పబడనున్న రాత్రి దివ్య సత్ప్రసాద బలి ద్వారా తనను ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్య సత్ప్రసాద బలి యేసుప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తుగా పౌలుగారు చెప్పుచున్నారు. ఈ దివ్య సత్ప్రసాదబలి ద్వారానే మనము ప్రతిదినము ప్రభు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకొంటున్నాము. ఈ బలిలో ముఖ్య అంశములు ఏమనగా :

కృతజ్ఞతాబలి

యేసుప్రభు దివ్యసత్ప్రసాద స్థాపనలో మొదటగా దేవునకు కృతఙ్ఞతలు చెల్లించారు. తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృతఙ్ఞతలు చెప్పియున్నారు. అనగా దివ్య సత్ప్రసాద బలి యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ దేవునికి కృతఙ్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలుస్తున్నది. అందుకే దివ్య సత్ప్రసాదబలిని కృతజ్ఞతాబలిగను వ్యవహరిస్తారు.
దివ్య (ప్రాణ) బలి

దేవునికి కృతఙ్ఞతలు తెలిపిన తరువాత రొట్టెను తుంచడము ద్వారా తన మరణమును గురించి సంకేతనమును యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చియున్నారు. ఈ విధముగా ప్రభు తీసుకొన్న రొట్టె తనకే సూచికగా నిలుచుచున్నది. తాను రొట్టెను తుంచడము ద్వారా తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు, తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును ధారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లము చేసియున్నాడు.
దివ్య రక్తము

భోజనము తరువాత యేసుప్రభు ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నముగా చెప్పియున్నారు (లూకా 22:20). ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభు చెప్పినవిధముగా పునీత పౌలుగారు అభివర్ణించారు. అందువలన ప్రతి దివ్యబలిపూజలో ద్రాక్షరసము అర్పింపబడునప్పుడు ప్రభు మనందరి పాపములను శుద్ధిచేయుటకు చిందిన దివ్యరక్తమును జ్ఞాపకము చేసుకొనుచుందుము. అంతే కాకుండా ఈ నాటి రెండవ పఠనములో పునీత పౌలుగారు మనకు యేసుప్రభుని రక్తముద్వారా నిత్యమరణము నుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు. ఎందుకనగా ఇస్రాయేలు సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నము. యేసుప్రభు తన రక్తమును చిందించుట ద్వారా తన జీవమును స్వచ్చందముగా అర్పించి, తద్వారా మనందరిని నిత్యమరణమునుండి శాశ్వత విముక్తులను చేసారు. యేసుప్రభు రక్తము చిందించుట మనకు మొదటి పటనములో గొర్రె చంపబడుట గుర్తుకు తెచ్చును. ఏ విధముగా ఐతే గొర్రె రక్తము గుమ్మములకు పూయడము ద్వారా ఇస్రాయేలీయుల తొలిచూలు బిడ్డలు రక్షించబాడ్డారో అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరమూ రక్షించపడ్డామని తెలుస్తున్నది.

నూతన నిబంధన

మనందరికోసం యేసుప్రభు చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకొన్న నూతన ఒడంబడికగా ప్రభు చెప్పినట్లుగా పునీత పౌలుగారు చెప్పియున్నారు (1 కోరి 11: 25). ఈ సమయములో పాత ఒడంబడిక గురించి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. సినాయీ కొండపై యావే ప్రభువు వేంచేసి ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొనియున్నాడు. కాని తరువాత ఎన్నోసార్లు ఇస్రాయేలీయులు ప్రభు మాట మీరి, ఒడంబడిక మీరి తప్పు చేయుచుంటిరి. ఐనప్పటికీ ప్రభువు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని క్షమించారు. చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిత్య నిబంధనను చేసుకొనియున్నారు. ఐతే ఈ శాశ్వత నిత్య నిబంధన ఇస్రాయేలీయులకే కాక మానవజాతి అంతటికీ వర్తిస్తుంది. అందువలన ఎవరైతే ఈ నూతన నిత్యనిభందనలో బాప్తిస్మము ద్వారా భాగస్తులగుదురో వారందరితోనూ ప్రత్యేకముగా నిబంధనను చేసుకొంటూ ప్రతిఒక్కరికి నిత్య జీవభాగ్యమును ఒసగుచున్నారు.

పవిత్ర యాజక అంతస్తు స్థాపన

ఈ రోజు ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ఆవిష్కరించిన రోజు. అదే పవిత్ర యాజక అంతస్తు స్థాపన. యేసు ప్రభు తను ఆదినుండి యెహోవా దేవుని ప్రధాన యజకుడైనను, తననుతాను యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసినది తనను తాను అర్పించుకొనే. ఆ విధముగా తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలి వస్తువుగాను అయితన జీవిత చరమాంకానికి తెరతీసారు. తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణ ద్వారా మొదలుపెట్టారు. ఎప్పుడైతే యేసుప్రభు "దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు" (1 కొరి 11: 24-25; లూకా 22:19) అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చియున్నారో అప్పుడు, ఆ సమయమున అపోస్తలులందరూ యేసు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు. తరువాత కాలములో అపోస్తలులు ఎవరినైతే ఎన్నుకోనేవారో వారికి క్రీస్తు యాజకత్వం దయచేయబడినది. అందుచేత ఈ రోజు క్రైస్తవ గురువులందరి గురించి ప్రత్యేకముగా ప్రార్ధించవలసిన సుదినం.
యోహాను 13: 1-15 - శిష్యుల పాదాలను కడుగుట

మొదటి పఠనములో దేవుడు ఏర్పరచినటువంటి పాస్కపండుగ ముందురోజున, యేసుప్రభు తనయొక్క భోదనలకు, వాక్కులకు కార్యరూపం ఇచ్చాడు. యాజకత్వమునకు నిజమైన నిర్వచనమును తన చేతలతో మనందరికీ చూపించాడు. పునీత పౌలుగారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలోని రెండవ అధ్యాయములో చెప్పిన విధముగా దైవప్రతినిధిగా, దైవ సేవకునిగా, ప్రజాసేవకునిగా, దైవకుమారునిగా తన శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆ మహాత్కార్యమే శిష్యుల పాదాలను కడుగుట.
తాను దేవుని కుమారుడైనను శిష్యుల పాదములను కడుగుటకు సిద్ధపడగా, పేతురు ఆ దైవీక చిహ్నమును అర్ధము చేసుకోలేక నిరాకరించెను (యోహాను 13:8). అందుకు యేసు "నేను నిన్ను (నీ పాదములను) కడుగనియెడల నాతొ నీకు భాగము ఉండదు" (యోహాను 13:8) అని చెప్పుటద్వారా శిష్యులందరు తన యొక్క కార్యములోను, శ్రమలలోను, మహిమలోను భాగము పంచుకొంటారని చెప్పకనే చెప్పారు. అందుకనే యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచెను (యోహాను 15:15).

మీరందరు శుద్దులు కాదని చెబుతూనే యూద ఇస్కరియోతు కాళ్ళను కూడా యేసుప్రభు కడిగారు. ఎందువలననగా, తాను యుదాతోసహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించెను (యోహాను 13:1). యుదా తనను అప్పగిస్తాడని తెలిసికూడా అతనిని ప్రేమించెను. యుదాకాళ్ళు కడగడము ద్వారా తనలో యుదాకి కూడా భాగముందని చెప్పకనే చెప్పెను. కాని యుదా ప్రభువు మనస్సుని అర్ధము చేసుకోలేక ఆ భాగమును నిరాకరించి యేసుని రోమనుసైనికులకి అప్పగించెను. ఈ యొక్క కార్యము ద్వారా యేసుక్రీస్తుయొక్క షరతులు లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను అర్ధము చేసుకొనవచ్చును. ఈ విధముగా ప్రభు ప్రేమకు మంచివారు చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించుచున్నారు.

అంతేకాకుండా యేసుప్రభు, తాను ఏవిధముగా చేసెనో తన శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును ఇచ్చెను. తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియుచున్నది. ఈ విధముగా ఈ వినమ్ర కార్యం పరుల ప్రేమకు తార్కాణముగా నిలుస్తుందని యోహానుగారు మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు.

చివరిగా క్రీస్తు మొదటి పటనములోని ప్రజలకోసం చనిపోవుగొర్రెగా సూచించబడగా, రెండవ పఠనంలో యజకుడిగాను, బలిఅర్పణగాను సూచించబడగా, సువార్తలో వినమ్రహృదయుడిగా వర్ణించపడ్డాడు. ఈ విధముగా ఈనాటి పఠనాల ద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి, క్రిస్తుని ప్రేమ గురించి విపులముగా వివరిస్తున్నది. అనగా యేసుని ప్రేమను ఒక నాణెముగా పరిగణిస్తే, యేసుని యొక్క స్వచ్చందబలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరొక పార్శ్వముగా అర్ధము చేసుకొనవచ్చును. అంతేకాకుండా ఈనాటి పఠనాలు, దేవుడు ఇచ్చిన పాస్క పండుగ నియమాలు, దివ్య సత్ప్రసాదక్రమము, క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏ విధముగా ఆచరించవలెనో, ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవలెనో సూచనాప్రాయముగా తెలియచేయుచున్నాయి. ఈవిధముగా ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారము ప్రాముఖ్యత గురించి, ఈ పవిత్ర గురువారమును ఎందుకు భక్తిశ్రద్ధలతో జరుపుకొనవలెనో తెలియచేయుచున్నవి.

మ్రానికొమ్మల ఆదివారము - క్రీస్తు పాటుల స్మరణోత్సవము - 1 April, 2012



మ్రానికొమ్మల ఆదివారము - క్రీస్తు పాటుల స్మరణోత్సవము - 1 April, 2012
యెరుషలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినము
Year B: యెష 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 15:1-39


"దావీదు పుత్రునకు హోసాన్న. ఏలినవారి నామమున వేంచేయువారు ఆశీర్వదింపబడినవారు, ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్న" (మ 21:9).

పాస్కాయత్తకాల ప్రారంభమునుండి మన హృదయాలను పాశ్చాత్తాపము, తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయత్తము చేసికొనిన పిదప, ఈ దినము తిరుసభయంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమైయున్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుటకై క్రీస్తు యెరుషలేము నగరమును ప్రవేశించెను. ఆకారణమున మన సంపూర్ణ భక్తి, విశ్వాసమును ఉపయోగించుకొని, ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుని వెంబడించి, సిలువ ఫలిత కృపయందు భాగస్తులమై, ఆయన పునరుత్థానమందును భాగమును పొందుటకు యోగ్యులమగుదముగాక.

మ్రానికొమ్మల ఆదివారముతో పవిత్రవారములోనికి ప్రవేశించియున్నాము. పవిత్రవారము మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకన, ఈ వారములో క్రీస్తుప్రభువు భూలోక జీవితములోని చివరి ఘట్టాలను ధ్యానిస్తూ ఉన్నాము. ముఖ్యముగా, దివ్య సత్ప్రసాదస్థాపన, శ్రమలు, సిలువమరణం మొ,,గు పరిశుద్ధ కార్యాలతో, ప్రభువు దేవునికి-మానవునికి మధ్య సఖ్యతను, సమాధానమును చేసియున్నాడు. పవిత్ర వారములోని సాంగ్యాల ద్వారా, మన రక్షణ కార్య ఘట్టాలను అనుభవించెదము, మన విశ్వాసాన్ని నూత్నీకరించెదము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచెదము. మన విశ్వాస యాత్రలో ఓ నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక కన్నులతో చూచెదము. ఈ యాత్ర ఈనాటి మ్రానికొమ్మల ఆదివారముతో మొదలవుతుంది. ఇది రక్షణకార్య పరమరహస్యాలను చేరుటకు తోడ్పడుతుంది. తద్వారా, విశ్వాసములో ఎదిగి క్రీస్తుకు దగ్గర కాగలము.

ఈ రోజు యేసుక్రీస్తు యెరుషలేము విజయ పురప్రవేశమును గుర్తుకు చేసుకొంటున్నాము (లూకా 19:28-40, మార్కు 11:1-11, మత్తయి 21:1-15). ప్రజలు ప్రభువును ఒక మెస్సయ్యగా, రాజుగా ఆహ్వానించారు. ఆయన గాడిద పిల్లపై ముందుకు సాగిపోవుచుండగా, దారిలో తన వస్త్రములను పరిచారు, మ్రానికొమ్మలతో జేజేలు పలుకుతూ స్వాగతించారు. "ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక! పరలోకమున శాంతియు, మహోన్నతమున మహిమయు కలుగునుగాక" అని దేవుని స్తుతించారు.

అలా ప్రభువును స్తుతించిన ప్రజలే కొన్ని రోజుల తర్వాత 'ప్రభువును సిలువ వేయుడు' అని, 'బరబ్బాను విడుదల చేయుడు' అని అరిచారు. వారు హృదయాలతో ప్రభువును స్తుతించలేదు. ఈ రోజు ప్రభువుని స్తుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో సిలువ చెంత ఉన్నారు? గుంపులో ఉండటం చాలా సులువు. కాని, వ్యక్తిగతముగా ప్రభువుతో ఆయన శ్రమలలో, సిలువయాత్రలో ఉండినవారు ఎంతమంది? ప్రభువునకు వారి అవసరం ఉన్నప్పుడు వారు ఆయన సిలువ చెంతకు వెళ్ళలేదు.

కడరాభోజన సమయములో పేతురుగారు ప్రభువుతో చెరసాలకుపోవుటకు, మరణించుటకు సైతము సిద్దముగా ఉన్నానని (లూకా 22:33) చెప్పాడు. కాని కొన్ని గంటల తరువాత అదే రోజు రాత్రి ప్రభువును ఎరుగనని బొంకాడు (లూకా 22:56-62). ఎంత త్వరగా అతను తన మనసును మార్చుకొన్నాడు? మనము కూడా ప్రభువుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం. కాని, శోధనలకు, బలహీనతలకు దాసులమై, వాటిని మరచిపోతూ ఉంటాం. కనీసం పేతురుగారు కోడికూతను విని (లూకా 22:60), ప్రభువు మాటలు గుర్తుకువచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు. పాశ్చాత్తాప పడ్డాడు. కాని, మనం జీవిస్తున్న ఈ లోకములో, ఏ స్వరాన్ని, ఏ కూతని మనం వినలేక పోతున్నాం. అంతగా, పాపములో కూరుకొని పోయియున్నాము. మన అంతరాత్మ ఘోషను మనం వినలేకపోతున్నాము.

ప్రభువు శ్రమలగూర్చి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చలించడములేదు!

ఈనాటి మొదటి పటనములో, ప్రభువు శ్రమలను గూర్చిన ప్రవచనాలను వినియున్నాము:
"నేను అతనికి అడ్డు చెప్పలేదు. అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకొంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనైతిని" (యెష 50:5-6).

ఈనాటి కీర్తనలో కూడా ప్రభువు శ్రమల గూర్చిన ప్రవచనాలను వినియున్నాం:
"నా వైపు చూచిన వారెల్ల నన్ను గేలిచేయుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను. అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో, అతడు ఇతనిని కాపాడునేమో చూతము. శునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్టబృందము నా చుట్టు క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటిని లెక్క పెట్టుచున్నారు. శత్రువులు సంతసముతో నావైపు చూచుచున్నారు. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసికొనుచున్నారు" (కీర్తన 22:7-8, 16-18).

ఒక పట్టణములో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నవాడు ఎప్పుడూ జులాయిగా తిరుగుచూ, త్రాగుచూ రోజూ ఇంటికి ఆలస్యముగా వచ్చేవాడు. అన్న ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదు. ఒక రోజు చేతిలో పిస్తోలు, రక్తపు మరకలతో రాత్రి ఇంటికి వచ్చాడు. 'నేను ఒక వ్యక్తిని చంపాను... నేను కావాలని చంపలేదు. నాకు చావాలని ఇష్టము లేదు' అన్నాడు. అప్పుడే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు. తమ్ముడి కోసం అన్న తమ్ముడి బట్టలు వేసికొని పోలీసులకు లొంగి పోయాడు. అతన్ని విచారించి, మరణ దండన విధించారు. తమ్ముడి కోసం అన్న మరణించాడు. తమ్ముడు జీవించాడు.

ఇదంతా ప్రేమకోసమే! అలాగే క్రీస్తుకూడా మన మీద ప్రేమ వలన మనకోసం మరణించాడు. మన శిక్షను ఆయన భరించాడు. మన పాపభారం ఆయన మోసాడు. ఈ అనంతమయిన ప్రేమకు మనం ఎలా స్పందించాలి. పైన సంఘటనలో తమ్ముడు అన్నపట్ల ఎంతో కృతజ్ఞుడై ఉండవచ్చు. అలాగే మనము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అంతేగాక, మన పాతజీవితానికి, పాపజీవితానికి స్వస్తి చెప్పాలి. క్రీస్తులో నూతన జీవితాన్ని జీవించాలి. తమ్ముడు తన జీవితాన్ని మార్చుకోకపోతే, అన్న మరణానికి అర్ధమే ఉండదు. అలాగే క్రీస్తు మరణం. క్రీస్తు మరణములో మనం జీవిస్తున్నాము. కనుక, దానిని సమృద్ధిగా, పవిత్రముగా జీవించుదాం. మన ఈ జీవితం, క్రీస్తు మరణము వలన పొందిన భిక్ష అని ప్రతీ క్షణం జ్ఞప్తియందు ఉంచుకొందాం.

క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి, ఎందుకన ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి. ఆయన శ్రమలకు పెద్దలు, రోమను సైనికులు మాత్రమే కాదు, మన పాపజీవితం. "అతడు మన తప్పిదములకొరకు గాయపడెను. మన పాపములకొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్షద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బలద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను" (యెష 53:5).

మనం పాపం చేసినప్పుడెల్ల, ప్రభువును సిలువ వేస్తున్నాము. ఈ రోజు, క్రీస్తుపాటుల స్మరణోత్సవ దినము. క్రీస్తుశ్రమల స్మరణ మన జీవితాలు చలించాలి. మన హృదయాలు కరగాలి. మనం పాపజీవితాన్ని విడచి పెట్టాలి. పవిత్రవారములో పాపసంకీర్తనము ద్వారా మరల మనం ప్రభువు చెంతకు తిరిగి రావాలి. దేవునిలో పాశ్చాత్తాప పడాలి, సఖ్యత పడాలి. క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చును గాక. ఈ పవిత్ర వారాన్ని మనం వృధాచేయకూడదు. క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడుపుదాం. పవిత్ర గురువారమున ప్రభువు ఏర్పాటు చేసిన సత్ప్రసాదవిందులో పాల్గొందాం. పవిత్ర శుక్ర వారమున, ప్రభువు శ్రమలలో పాల్గొందాం. అలాగే పవిత్ర శనివారమున పాస్కా జాగరణ.

క్రీస్తు శ్రమలతో పోలిస్తే, మన బాధలు, కష్టాలు ఏపాటివి? యేసుక్రీస్తు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మనలో ఒకనిగా జీవించాడు. మన కష్టాలను, బాధలను ఆ ప్రభువునకు అర్పించుదాం. వాటినుండి పారిపోక (ఆత్మహత్య), ఎదుర్కొను శక్తినివ్వమని, దైవ చిత్తమే జరగాలని ప్రార్ధిద్దాం. దేవుని కుమారుడే శ్రమలను పొందవలసి వచ్చింది. కనుక, మనము కూడా మన జీవితములో వచ్చే కష్టాలను, బాధలను ఎదుర్కొనుటకు దేవుని సహాయమును కోరుదాం.

సర్వ శక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా! మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యావతారమెత్తెను. సిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్తులమగునట్లు మాకు అనుగ్రహింపుడు. ఆమెన్.

తపస్కాల ఐదవ ఆదివారము, YEAR B, 25 MARCH 2012


తపస్కాల ఐదవ ఆదివారము, YEAR B, 25  
మార్చి 2012
ఇర్మియా 31:31-34; భక్తికీర్తన 51:1-2, 10-13; హెబ్రీ 5:7-9; యోహాను 12:20-30

ఓ సర్వేశ్వరా! మా విరోధులగు దుర్మార్గులమధ్య చిక్కుకొనియున్న నన్ను రక్షించి మీ ధర్మ తీర్పులను వెల్లడి చేయుడు.  పాపాత్ములు, మోసగాండ్రు, తంత్ర కాండ్రనుండి   విడుదల చేయుడు.  ఎందుకన, నాకు శక్తి సామర్ధ్యములిచ్చు దేవుడు మీరే!

ఈనాటి మొదటి పటనములో యిర్మియా ప్రవక్తను గురించి వినియున్నాం.  దేవుడు యిర్మియాను పిలచి తన ప్రవక్తగా నియమించారు.  యావే ప్రభువు ఇస్రాయేలు ప్రజలతో సీనాయి పర్వతముపై చేసికొన్న ఒడంబడిక ప్రకారం వారు నడవలేదు.  ప్రభువైన దేవునిపై అధారపడటానికి బదులు ఈజిప్టు పాలకులతో చేసికొన్న ఒప్పందము మీద ఆధారపడ్డారు.  అందువలన, యావే ప్రభువు యొక్క సంరక్షణ, సహాయం వారు పోగొట్టుకున్నారు.  అందుకు ఫలితముగా ఇస్రాయేలీయులు అనేక కష్టాలకు గురైనారు.

అయినప్పటికినీ, ఇస్రాయేలీయులపట్ల ప్రభువైన దేవునికిగల ప్రేమ ఎంత అపారమైనదో యిర్మియా ప్రవక్తకు తెలుసు: కనుకనే దేవుని ఆదేశం మేరకు భవిష్యత్తులో దేవుడు ఇస్రాయేలీయులతో కుదుర్చుకొన్న "నూతన ఒప్పందం" గురించి యిర్మియా ప్రవక్త ప్రవచించాడు.  ఈ నూతన ఒప్పందము గురించి ఈనాటి మొదటి పటనములో చదువుతున్నాం. రెండవ పటనములో క్రీస్తు ప్రభువు తన జీవితములో ఆవేదన, బాధలను ఎలా అనుభవించాడో చదువుతున్నాం. యేసు ప్రభువు ఎన్నడూ తన బహిరంగ జీవితములో పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడలేదు.  యేసు మానవ రక్షణార్ధం, తనను తాను తండ్రికి బలిగా అర్పించాడు.

క్రీస్తు మరణం ద్వారా తనను తాను సంపూర్తిగా అర్పించుకొన్నాడు.  మానవులందరి తరుపున బలి అర్పించాడు.  క్రీస్తు మనందరి తరుపున బలి అర్పించాడు. గేత్సేమని తోటలో రక్తచమట చెమర్చుతూ యేసు ప్రభు చేసిన ప్రార్ధన, అనంతరం సిలువపై ఆయన అనుభవించిన శ్రమలు, మరణం వర్ణణాతీతం!  ఈ విధముగా ఆయన మనకొక సుమాతృకను నేర్పించారు.  నిత్య జీవన మార్గమును చూపించారు.

ఈనాటి సువార్త పటనములో, "గోధుమగింజ భూమిలోపడి నశించిననే తప్ప అది ఒక గింజగానే యుండును" అని చదువుచున్నాం. గోధుమగింజ భూమిలో పడవలసినదే!  తగిన మార్పు చెందవలసినదే! కానిచో, అది గింజగానే ఉంటుంది.  గింజ నలిగి రూపు లేకుండా చనిపోయినప్పుడే దానిలోనుండి జీవముగల మొక్క పైకి వస్తుంది.  క్రీస్తు ప్రభువు కూడా అట్టి గోధుమ గింజయే!

తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కాని, ఈ లోకమున తన ప్రాణమును ద్వేశించువాడు, దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును.  అని ప్రభువు పలుకుచున్నాడు.  అంటే, తనను తాను పరిత్యజించు కొనుటయే రక్షణమార్గమని మనము నేర్చుకోవాలి.  తనలో ఉన్న గర్వమును అనచుకోవడము చేత, ఈ లోకపు ఆశలను వదలి పెట్టడం చేత మాత్రమే రక్షణ కలదు. కాని, తన జీవితాన్ని ఈ లోకానికి అంటి పెట్టుకొనుట ద్వారా కాదు.  ఈ లోకములో జీవించినంత కాలం, ఈ ప్రపంచ జీవితము కంటే, నిత్య జీవము మేలైనదని మనము గ్రహించడానికి సిద్దముగా ఉండాలి.

నేటి సమాజములో అన్ని రంగాలలో అభివృద్ధిని చూస్తున్నాం.  నేటి సమాజం అన్ని విధాలుగా మనిషిని తన వైపునకు ఆకర్షిస్తుంది.  మనిషి ఈ లోకం ప్రసాదించే భోగాలకు బానిసయై, ఈ లోకాశాలకు దగ్గరై కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు.  ఈ ప్రపంచముకంటే, నిత్యజీవితం మేలైనదని గ్రహించ లేక పోతున్నాడు.

ఈ లోకములో ఎవరైతే తన జీవితాన్ని అసహ్యించుకొంటారో, నిత్య జీవితానికి దానిని కాపాడుకొంటారు.  క్రీస్తు ప్రభువు, తపస్కాల ఐదవ ఆదివారమున ఈ పిలుపును మనకు ఇస్తున్నాడు.  త్యాగ జీవితం జీవించడం ద్వారా తనను వెంబడించి తన మహిమను పొందుటకు మన సిలువను ఎత్తుకొని తనతో నడువమంటున్నాడు.

తండ్రిని విధేయించి, క్రీస్తు ప్రభువు సిలువ బాధలలో భాగం పంచుకోవడానికి సంసిద్ధులైన వారికి దేవుని మహిమలో భాగముంటుంది.  విధేయత అంటే - స్వార్ధాన్ని వదులుకోవడం.  సుఖభోగాలకు స్వస్తి చెప్పడం.  క్రీస్తు రక్షణలో భాగస్తులమవడం.

తపస్సుకాలం, ఓ పరిశుద్ధ కాలం. కావున, ఆధ్యాత్మిక ఎదుగుదలపై శ్రద్ధ ఉంచాలి. అనుదినం మనం జరుపుకొనే దివ్యబలిపూజ ద్వారా క్రీస్తును, రక్షణ అనుగ్రహాలు పొందుతున్నాం. క్రీస్తు శరీర రక్తాలతో బలపడి, ప్రేమ పూరితమైన జీవితాన్ని జీవిద్దాం.

తపస్కాల నాలుగవ ఆదివారము, Year B, 18 March 2012

తపస్కాల నాలుగవ ఆదివారము, Year B, 18 March 2012
దిన చర్య 36:14-16, 19-23, ఎఫే 2: 4-10, యోహాను 3: 14-21

నిర్లక్ష్యం చేస్తే...
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెల 11 వ తారీఖున, జపాను దేశములోని పుకుషిమా పట్టణములో వచ్చిన భూకంపం, సునామీ కారణముగా గొప్ప అణువిస్ఫోటనం జరిగింది. ఎందరినో నిరాశ్రయులను చేసింది. ఈ దుర్ఘటనములో మానవ తప్పిదము ఏమీ లేదని చెప్పవచ్చు. కాని దాదాపు 25 సం,,ల క్రితం ఉక్రెయిన్ దేశములోని (అప్పటి రష్యా) చెర్నోబిల్ లో జరిగిన అణువిస్ఫోటనం మాత్రం ఖచ్చితముగా మానవ తప్పిదమే! ఏమరుపాటుతనముతో, నిర్లక్ష్యముతో చేసిన పని. రోజూ చేసే పని కదా అనే చులకనభావం. ఈ ఏమరుపాటుతనముతో, చులకన భావముతో, నిర్లక్ష్యముగా, ఒక మీటను వత్తబోయి ఇంకో మీటను వత్తాడు అక్కడ భాద్యతలు నిర్వహిస్తున్న కార్మికుడు. ఆ నిర్లక్ష్యము వలన ఎంతో మంది మరణించారు, బాధ పడ్డారు, పడుతూనే ఉన్నారు.
'నిర్లక్ష్యం' - ఇది ఒక చిన్న పదమే కాని, దీని ఫలితం మాత్రం చాలా పెద్దది. దీనిని అలవాటు చేసుకొన్నవారిని, ఎంత గొప్ప వాడైనా సర్వ నాశనం చేస్తుంది. వారిని మాత్రమే కాకుండా, చుట్టూ ప్రక్కల ఉన్న వారిని కూడా.
నిర్లక్ష్యం= నిర్+లక్ష్యము. 'నిర్' అనగా వదిలి వేయడం, దూరముగా ఉండటం. అనగా లక్ష్యమును వదలి వేయడము లేదా దూరముగా ఉండటం. ఇదే మాటకు సాధారణ పరిభాషలో, 'లెక్క చేయక పోవడం', 'మాట వినకపోవడం', 'పెడ చెవినపెట్టడం' అనే అర్ధాలు ఉన్నాయి. ఇంకా వివరముగా చెప్పాలంటే, మనకు ఎవరన్నా ఏదైనా చెబుతూ ఉంటే, మాటలు వినబడుతున్నా, వినబడనట్లు ప్రవర్తించడం. మనుషులు కనబడుతున్న, కనబడనట్లు ప్రవర్తించడం. అన్ని కలిపి, మన ప్రక్కన ఉన్న మనిషిని, అతని ఉనికిని, మనిషిని మనిషిగా గుర్తించక పోవడం.
ఈ నాటి మొదటి పటనములో, నిర్లక్ష్యము వలన ఇస్రాయేలుకు కలిగిన ఫలితం, మనకి వివరించబడినది. ఇస్రాయేలీయుల రాజులు, యాజకులు, మరియు ప్రజలు ( రా. దినచర్య. 36:14-16). దేవున్ని, దేవుని మందిరమును, దేవుని మాటను (ప్రవక్తలను), దేవుని బాటను నిర్లక్ష్యము చేసారు. దేవుడు వారికి ఏర్పరచిన ప్రణాళికను (ఇతర జాతుల, జనుల మధ్య, నిజ దేవుడైన యావేకు, ప్రతీకలుగా, నీతి న్యాయము చొప్పున నడచుకొను వారిగా ఉండాలని) నిర్లక్ష్యము చేసారు. దేవాలయమును అమంగళము చేసారు (36:14), దేవుని ప్రవక్తలను ఎగతాళి చేసారు (36:16), ప్రవక్తలను, ప్రభువు వాక్యమును, దేవుని స్వరమును త్రుణీకరించారు (36:16).
ఎప్పుడైతే వారు దేవున్ని త్రుణీకరించారో, అప్పటినుండే వారి పతనం ఆరంభమయ్యింది. ఏ అధికారమును, ప్రతిభను, ఏ సంపదను, ఏ భూమిని, ఏ మందిరమును, చూసి వారు మురిసిపోయారో, గర్వ పడ్డారో, వాటన్నింటిని ప్రభువు వారినుండి దూరం చేసారు. సింహాసనమునుండి రాజులు త్రోయబడ్డారు. దేవాలయమునుండి యాజకులు వెలివేయబడ్డారు (చంపబడ్డారు). ప్రజల సంపద అంతా దోచుకొనబడినది. నాది, మాది అనుకున్నవాటినుండి దూరం చేయబడ్డారు, వేరు చేయబడ్డారు. అన్నీ కోల్పోయి మిగిలియున్నవారిని, బాబిలోనియా రాజు తనకు తన ప్రజలకు, దాసులుగా, దాసీలుగా ఊడిగం చేయించుకొనుటకు తీసుకొని వెళ్ళాడు. దాసులుగా, బానిసలుగా, పేరులేనివారిగా, గౌరవము లేనివారుగా, బాబిలోనియాలో జీవించారు.
తాము ప్రభువునుండి వేరు చేయబడ్డామని, ప్రభువుకు దూరముగా ఉన్నామని, ప్రభువు మాకు కావాలి, మా జీవితములోనికి రావాలి. మాతో ఉండాలి, మమ్ము నడిపించాలి అని తెలుసుకోవడానికి, కనువిప్పు కలుగడానికి వారికి పట్టిన సమయం 70 సం,,లు. నిర్లక్ష్యము మారి, నిజ లక్ష్యము ప్రభువేనని తెలుసుకోవడానికి పట్టిన మనస్థాప కాలం. దేవునితో ఉండాలని, ఆయన తోడుకావాలని, సాన్నిధ్యం, సహవాసం, స్నేహం, అనుభవించాలని ఆయన కీర్తనలు పాడి స్తుతించాలనే కోరిక వారిలో రగులుతుంది (చూడుము 137:5-6).
వారి దు:ఖమును, పశ్చాత్తాపమును, కోరికను గుర్తించిన ప్రభువు, పారశీక రాజు కోరేషు ద్వారా, మందిర నిర్మాణమును పూనుకొంటున్నాడు. ఇది నిశ్చయముగా ప్రభువు కార్యమేనని రెండవ పటనం స్పష్టం చేసింది. ఇది ప్రభువు స్వయముగా, స్వతహాగా, కలుగజేసుకొంటున్న కార్యం. ఎందుకంటే, ఆయన కృప అపారం. తన ప్రజల పట్ల ఆయన ప్రేమ అమితం (ఎఫే 2:4). అది మన ప్రతిభ కాదు, దేవుని కృపయే (ఎఫే 2:8).
ఎందుకన, ప్రభువింత కరుణను ప్రేమను చూపుచున్నాడు? మన తప్పులను సరిదిద్ది తన వైపునకు మరల్చుకొంటున్నాడు? కారణమొక్కటే: ఆయన మనలను క్రీస్తు యేసు ద్వారా, సత్కార్యములు చేయు జీవితమునకై సృజించెను (ఎఫే 2:10). సత్కార్యములు చేయుటయే మన లక్ష్యము, లక్ష్యమార్గము.
ఎక్కడికి వెళ్తున్నదీ మార్గము:
వెలుగును సమీపించుటకు, వెలుగులో జీవించుటకు, వెలుగుతో జీవించుటకు, వెలుగై జీవించుటకు...
సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తాను సారముగా చేయబడినవని ప్రకటితమగుటకు వెలుగును సమీపించును.
మనలను మనం ప్రశ్నించు కొందాం:
ఈ సమయమున నేను గాని, నా కుటుంబము గాని, బాధలలో గాని, భయములో గాని జీవిస్తున్నానా/దా? ఆర్ధిక సమస్యలలోగాని, అనుబంధ సమస్యలలోగాని సతమత మవుతున్నదా?
కుటుంబమునుండిగాని, కుటుంబ సమస్యలనుండిగాని, స్నేహితుల నుండిగాని, వేరుచేయబడ్డానా?
ఒంటరిగా, దిక్కులేని వానిగా, ఆప్యాయత లేనివానిగా ఉన్నానా? ఆలోచించు!
కారణం ఏమై ఉండవచ్చు?
గతమున పనే లోకముగా జీవించానా? పదవే లక్ష్యముగా, డబ్బే ముఖ్యమని, ఆ తరువాతే అన్నీ అని అనుకొన్నానా?
నా ప్రతిభ ద్వారా, నా బలం ద్వారా, అన్నీ చేయగలనని అనుకొన్నానా?
డబ్బు ద్వారా అన్నీ కొనగలను అని అనుకొన్నానా?
ఇవే లక్ష్యముగా చేసికొని, రోజూ చేసే ప్రార్దనే కదా! ప్రతీ ఆదివారం పాల్గొనే పూజే కదా! ఎప్పుడూ చదివే బైబులే కదా! ఎప్పుడూ వినే (చెప్పే) ప్రసంగమే కదా! ఎప్పుడూ చేసే సేవే కదా! ఎప్పుడూ ఉండే కుటుంబమే కదా!
అని ఏమరుపాటుతనముతో, నిర్లక్ష్యముతో ఉన్నానా?
అలాగయితే, ఇలా ప్రతిబబూనుదాం:
ప్రభువు ఈనాటి నుండి నిన్నే లక్ష్యముగా చేసికొని,
నీ తరువాతే అన్నీయని, నీ తోటే అంతటాయని,
నీ కొరకే నాకున్నదంతయని, జీవిస్తా!
నీ వైపే నా పయనం సాగిస్తా!
నీ దగ్గరికే అందరిని నడిపిస్తా!

తపస్కాల మూడవ ఆదివారము, YEAR B,

తపస్కాల మూడవ ఆదివారము, YEAR B
నిర్గమ కాం. 20: 1-17 ; 1 కొరింథీ 1: 22-25; యోహాను 2: 13-25


మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు శుభ్రముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి, ప్రతి వస్తువును చక్కబెట్టుకొంటాం. ప్రతీ రోజు స్నానాలు చేస్తూ ఉంటాం. మురికి అయిన దుస్తువులను ఉతుకుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కొంతమంది తమనుతాము శుభ్రముగా ఉంచుకోవడానికి గంటల తరబడి సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. కారణం, ఎవరుకూడా మురికి, వాసన వచ్చే విధముగా ఉండటానికి ఇష్టపడరు. మనం మురికిలో జీవిస్తే, తరువాత అది అనేక వ్యాధులకు దారి తీస్తూ ఉంటుంది. ఒక్కసారి జబ్బుపడితే, అది మన ప్రాణాలకే ప్రమాదముగా తయారవుతుంది. కనుక, శారీరక పరిశుభ్రత, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రముగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.

ఈనాటి పఠనాలు, మనం క్రీస్తు విశ్వాసులుగా మన ఆధ్యాత్మిక జీవితములో ఏవిధముగా పరిశుభ్రముగా ఉండాలో నేర్పుతూ ఉన్నాయి. మొదటి పఠనములో, యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏర్పరచుకున్న ఒడంబడికను గూర్చి వింటున్నాము. ఈ ఒడంబడిక ద్వారా యావే దేవుడు మనలను పరిశుద్ధ జీవితమునకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఒడంబడిక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాక, ఈనాడు ప్రతీ వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉన్నది. మనం దేవుని దృష్టిలో పరిశుభ్రముగా, పవిత్రముగా ఉండటానికి దేవుడు పది ఆజ్ఞలను మోషే ప్రవక్త ద్వారా ఒసగుచున్నాడు. తన ఒడంబడిక ద్వారా యావే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని యున్నాడు. వారిని ఇతర జాతులతో కలవకుండా కాపాడగలిగాడు. ఇతర దేవుళ్ళనుండి వారిని కాపాడాడు. ఈ ఒప్పందం ద్వారా, వారిని తన బిడ్డలుగా చేసుకొని, పరిశుద్ధమైన, సక్రమైన మార్గములో వారికి తోడుగా ఉంటూ, వారిని ముందుకు నడిపించాడు.

కనుక మనం కూడా ఈనాడు ఈ పది ఆజ్ఞలను లేక ఈ ఒడంబడికను ఒక ఆహ్వానముగా స్వీకరించి, దానికి అనుగుణముగా నడచుకోవడానికి ప్రయత్నం చేయాలి. "నిత్యజీవాన్ని పొందగోరినచో దైవాజ్ఞలను అనుసరింపుము" అని మత్తయి 19:17లో  క్రీస్తుప్రభువు ధనికుడగు యువకునితో చెప్పియున్నాడు. ఆ పది ఆజ్ఞలే ఈ దైవ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను పాటించి, నిత్యజీవితములోనికి ప్రవేశించడానికి ప్రయత్నం అచేద్దాం.

"అంత:కలహాలతో విభక్తమయిన ఏ రాజ్యమైనను నాశనమగును" (మత్తయి 12:25) అను యేసు వాక్యము యెరూషలేము దేవాలయంద్వారా నిజమవుతున్నది. ఈనాటి సువిషేశ పఠనములో మనం చదువుకున్న యెరూషలేము దేవాలయ పరిస్థితిని, మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. కొన్నికొన్ని దేవాలయ పండుగలలో ఈ దృశ్యం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. దేవుని పండుగలు, దేవాలయ ఆవరణాలు, వ్యాపార స్థలాలుగా చేయబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆ పండుగ నిజమైన అర్ధాన్ని కూడా మరిచి పోతూ ఉంటాం. ప్రార్ధన, దైవభక్తి, సోదరప్రేమ, సేవ, నిజాయితీగా ఉండవలసిన ఆలయాలు, గుడులు, వ్యాపార స్థలాలుగా మారుతూ ఉన్నాయి. పండుగ పేరు చెప్పి అనేక చెడు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులనే యేసు తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవాలయము అనునది ప్రార్ధన చేసుకోవడానికి, దేవున్కని కనుగొనడానికి, ఆయన సన్నిధిలో జీవించడానికి అని మనం మరువకూడదు. ఏ దేవాలయము అయినా, దాని ముఖ్య ఉద్దేశ్యాన్ని మరచినట్లయితే, చివరకు అది వినాశనమునకు దారి తీస్తూ ఉంటుంది. పుణ్యకేంద్రమునకు బదులుగా పాపకేంద్రముగా తయారవుతూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువు వ్యాపారము చేసేవారందరినీ అక్కడనుండి పంపి వేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. "వీనిని ఇక్కడనుండి తీసికొని పొండు" (మత్తయి 2:16) అను ఈ వాక్యం మన ఆలయాలలో భక్తిని, గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. మన దేవాలయాలను దేవునికి ప్రతి బింబాలుగా గుర్తించి గౌరవ మర్యాదలతో నడచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

యేసు యెరూషలేము దేవాలయమునుండి వ్యాపారస్తులను వెళ్ళగొట్టడం చూసి, యూదప్రజలు యేసుపై అరాచకానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, వారు యేసును తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ఒక గుర్తును కూడా అడుగుతూ ఉన్నారు. కాని యేసు సమాధానం "ఈ ఆలయాన్ని మీరు పడగొట్టుడు, నేను దీనిని మూడు దినాలలో తిరిగి నిర్మించెదను" అని వారికి సమాధానమిచ్చాడు. ఇక్కడ యేసు తన దేహాన్ని గురించి చెప్పుచున్నాడు. యెరూషలేము దేవాలయములో క్రీస్తు పారద్రోలిన వ్యాపారస్తులందరూ కూడా పాతనిబంధన ఒడంబడికను తుడిచి వేయడాన్ని సూచిస్తూ ఉన్నది. పాతనిబంధన ఒడంబడిక ఈ నూతన ఒడంబడికతో తుడిచి వేయబడుచున్నది. ఈ నూతన ఒడంబడిక క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా సాధ్యమగుచున్నది. ఈ కారణం చేతనే క్రీస్తు శరీరమునే నిజమైన దేవాలయముగా చూస్తూ ఉన్నాం. మానవ రక్షణ కార్యములో క్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు ఫనముగా పెట్టి, తన రక్తంద్వారా మనలను రక్షించుకున్నాడు. తన సిలువ మరణము ద్వారా, ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. పాత ఒడంబడికలో జంతు రక్తాన్ని చిందిస్తే, ఈ నూతన ఒడంబడికలో క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనలను తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే క్రీస్తు శరీరమును ఒక దేవాలయముగా చూస్తూ ఉన్నాము.

క్రీస్తు శరీరము, అనగా "తిరుసభ" లేక "శ్రీసభ". క్రీస్తు నామములో జ్ఞానస్నానము పొందిన ప్రతీ వ్యక్తి కూడా ఆయన శరీరములో ఒక భాగముగా చేయబడుతూ ఉన్నారు. "మనము చాలా మందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరమూ ఒకే శరీరము" (రోమీ 12:5). క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయాన్ని ఏవిధముగా ప్రార్ధనాలయముగా గుర్తించి దానిని పరిశుభ్ర పరిచారో అదేవిధముగా తిరుసభను కూడా మనం రక్షించుకోవాలి. అనేకమైన సైతాను శక్తులు, ప్రాపంచిక విషయాలు క్రీస్తుసంఘం అయిన తిరుసభను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కనుక ప్రతీ క్రైస్తవుడు కూడా శ్రీసభ రక్షణలో పాలుపంచు కోవడానికి ప్రయాస పడాలి. "క్రీస్తు తన శరీరము అయిన శ్రీసభకు శిరస్సు" (కొలస్సీ 1:18). కనుక ఆయన శరీరములోని వేరువేరు అవయవాలుగా, ఆయన నుండి వచ్చే శక్తిని, బలాన్ని స్వీకరిస్తూ మనల్ని మనం పవిత్రముగా ఉంచుకొంటూ శ్రీసభను పరిశుద్ధముగా చేయడానికి ప్రయత్నించాలి.

మన దేహము పరిశుద్దాత్మకు ఆలయము. ఎంత అద్భుతం! అందుకే పునీత పౌలుగారు "మీరు ఆత్మయందు జీవింపుడు" (గలతీ 5:16) అని చెప్పుచున్నాడు. రెండవ పఠనములో చెప్పబడినట్లుగా మనం "సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు చున్నాము" (1 కొరి 1:23) కనుక క్రీస్తు సిలువ మనలను పరిశుద్ధులనుగా చేస్తుంది. కనుక మన దేహములతో వ్యాపారాలు చేయకూడదు. మన హృదయాలను, ఆలోచనలను వ్యాపార స్థలములుగా మార్చకూడదు. మన శరీరం దేవుని ఆలయం. కనుక ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వాలి. సైతాను శోధనలనుండి దానిని కాపాడాలి. దీనిని పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము ద్వారా మాత్రమే సాధించగలం.

నేడు మన జీవితమనే దేవాలయాలలోనికి క్రీస్తు ప్రవేశిస్తున్నాడు. మనలోని 'వ్యాపార స్థల' బుద్ధిని మార్చడానికి, ప్రక్షాళన చేయుటకు వేంచేయు చున్నారు. 'వ్యాపార బుద్ధి' వస్తువులను కొనుగోలు చేయడం, మన కోరికలను సంతృప్తి పరచుకోవడం, లాభాలను గడించడం. వీటికోసం, స్వార్ధం, జగడాలు, అనారోగ్యకరమైన పోటీతత్వం, అబద్ధాలు, అసత్యం, నిజాయితీ లేకపోవడం, మోసం, విరోధం, శతృత్వం...మొదలగునవి మన జీవితములోనికి ప్రవేశిస్తాయి. మనం దేవాలయానికి వచ్చినపుడు, ఇలాంటి 'వ్యాపార బుద్ధి'తో వస్తున్నామా? ఈ బుద్ధి, మనస్తత్వంనుండి దూరముగా ఉంటున్నామా? దేవుని ఆలయాలమైన మనం మనం పవిత్రముగా జీవిస్తున్నామా? కనుక నేడు మన జీవితాలను శుభ్రపరచుటకు యేసు వచ్చుచున్నాడు. "మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన, దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము" (1 కొరి 3:16-17). సత్కార్యములతోను, ప్రార్ధనలతోను మన జీవితాలు పవిత్ర పరచ బడాలి.  పాపము, అవిదేయతనుండి దూరముగా ఉండాలి.

తపస్కాల మూడవ ఆదివారం క్రీస్తు ఏర్పాటు చేసిన నూతన ఒడంబడికను మనకు గుర్తుచేస్తూ ఉంది. క్రీస్తును అనుసరించి మనం కూడా పాపాన్ని త్యజించి, పరిశుద్ధ జీవితం జీవించుటకు ప్రయాస పడుదాం. మన స్వార్ధాన్ని వీడి, ఇతరులను ప్రేమిస్తూ, సేవిస్తూ జీవించుదాం. కారణం, "కేవలము విశ్వాసము వలన మాత్రమే కాక, చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును" (యాకోబు 2:24). మన విశ్వాసాన్ని క్రియల రూపములోనికి మార్చమని, మనలను పరిశుద్డులుగా, పవిత్రులుగా చేయమని ప్రార్ధన చేద్దాం.